అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు: నాదెండ్ల మనోహర్

Related image

  • పోలీసులు నామినేషన్ పత్రాలు చించేశారు

  • దాఖలైన నామినేషన్లను అధికారులు తిరస్కరిస్తున్నారు

  • అధికార యంత్రాంగం బాధ్యతలు విస్మరిస్తోంది

  • సమాజం పట్ల బాధ్యతతోనే మన నుడి మన నది కార్యక్రమానికి జనసేన శ్రీకారం

  • రాజమహేంద్రవరంలో విలేఖర్ల సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అప్రజాస్వామిక రీతిలో సాగుతున్నాయని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. నామినేషన్ దాఖలు చేయడానికి వెళ్లిన అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేసి దాడులకు పాల్పడి అడ్డుకుంటే అధికార యంత్రాంగం ఏమి చేస్తోందని ప్రశ్నించారు. గుంటూరు జిల్లాలో నామినేషన్ వేయడానికి వెళ్ళిన జనసేన పార్టీ అభ్యర్థి పత్రాలను పోలీస్ అధికారి చించి వేసినట్లు తెలిపారు. దాఖలైన నామినేషన్లను ఆర్ ఓ స్థాయి అధికారులు తిరస్కరిస్తున్నారని చెప్పారు. ఎన్నికల ప్రక్రియను ఒక మొక్కుబడి తంతుగా నడిపిస్తున్నారని తప్పుబట్టారు.

రాజమహేంద్రవరంలో శుక్రవారం సాయంత్రం నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ "పాలన వ్యవస్థలో కీలకమైన స్థానిక సంస్థల ఎన్నికలను సక్రమంగా నిర్వహించాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఇందుకు సంబంధించిన బాధ్యతను విస్మరిస్తోంది. అధికార పార్టీ చేస్తున్న దౌర్జన్యాలను ప్రతి ఒక్కరూ ఖండించాలి. ఈ ఎన్నికల ద్వారా స్థానిక సంస్థల పాలనలోకి యువతరాన్ని, మహిళలను తీసుకురావాలని బిజెపి జనసేన పార్టీలు నిర్ణయించాయి అందుకు అనుగుణంగా అభ్యర్థులను ఎంపిక చేసి నామినేషన్లు దాఖలు చేయించిన సమయంలో ఉంటే అధికారపక్షం భయభ్రాంతులకు గురి చేస్తూ దాడులకు పాల్పడుతోంది.

నామినేషన్ వేసిన అభ్యర్థులను పోలీసులు బైండోవర్ కేసులు పేరుతో స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. అదే విధంగా అభ్యర్థుల వెంబడి ఉన్న నాయకులను ఇబ్బందుల పాలు చేస్తున్నారు. అయినప్పటికీ జనసేన - బీజేపీ కూటమి అభ్యర్థులు ధైర్యంగా ఉన్నారు. ధైర్యంగా నిలిచిన ప్రతి ఒక్కరికి పార్టీ అండగా నిలుస్తుంది.

తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గత ఐదేళ్లలో చేసిన తప్పులనే ఇప్పటి వైసీపీ ప్రభుత్వం చేస్తోంది జన్మభూమి కమిటీల పేరుతో ఒక వ్యవస్థను సృష్టించి టిడిపి చేసిన తప్పులను ఇప్పుడు వాలంటీర్ల పేరుతో వైసీపీ చేస్తోంది. ఈ ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం అభివృద్ధిపై ఇలాంటి ప్రణాళిక లేదు కేంద్ర ప్రభుత్వం వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చే నిధులను కూడా తీసుకోవడం లేదు ఇలాంటి విషయాలు ఇటీవల కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారిని కలిసినప్పుడు వెల్లడయ్యాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వినియోగించి యూసీలు ఇవ్వడం లేదు. అదేవిధంగా చట్ట ప్రకారం రావాల్సిన నిధులను రాబట్టు కోవడం లేదు.

మన జలాలను మాతృ భాషను రక్షించుకోవాలి:

పవిత్రమైన గోదావరి తీరంలో మన నుడి మన నది కార్యక్రమాన్ని పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈ సందర్భంగా శనివారం ప్రారంభిస్తున్నాం. సమాజం పట్ల జనసేనకు ఉన్న బాధ్యత ఇది. గోదావరి తీరంలోనే రక్షితమైన జలాలు దొరకని పరిస్థితి తలెత్తింది. మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ సిద్ధాంతాలలో పర్యావరణాన్ని ఒక ప్రధాన అంశంగా చేర్చారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఒకరికి ఈ అంశాన్ని కూడా అప్పగించారు.

ఈ విధమైన బాధ్యతతో పని చేసే పార్టీ మరొకటి లేదు. రాష్ట్రంలో ఉన్న అన్ని నదులను కాపాడుకునే విధంగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ఈ కార్యక్రమం ఉద్దేశం. జలాల పరిరక్షణతోపాటు మాతృభాషను కాపాడుకోవడం కూడా విధిగా భావించి ఈ కార్యక్రమంలో భాగంగా శనివారం సాయంత్రం ధవళేశ్వరం లోని రామ పాదాలు రేవు దగ్గర గోదావరి నదికి సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించి హారతి ఇచ్చి కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. సాహిత్యంలో ప్రత్యేక స్థానం ఉన్న రాజమహేంద్రవరంలో తెలుగు భాష ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తాం. పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పార్టీ ముఖ్యులతో శనివారం ఉదయం సమావేశం నిర్వహిస్తాం" అన్నారు.

ఈ సమావేశంలో పార్టీ పి.ఎ.సి. సభ్యులు కందుల దుర్గేష్, పార్టీ ఉపాధ్యక్షులు బి.మహేందర్ రెడ్డి,  పార్టీ నాయకులు బొమ్మదేవర శ్రీధర్ (బన్ను), అత్తి సత్యనారాయణ పాల్గొన్నారు.

More Press Releases