వెదురు పరిశ్రమలు, క్షేత్రాలను సందర్శించిన బోయినపల్లి వినోద్ కుమార్

Related image

  • మహారాష్ట్రలో బోయినపల్లి వినోద్ కుమార్  ఫీల్డ్ విజిట్

తెలంగాణలో వెదురు ( బ్యాంబు ) సాగుకు మెరుగైన అవకాశాలు ఉన్నాయి. వెదురును అనేక రూపాలుగా వినియోగించేందుకు అవకాశాలు ఉన్నాయి. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ సమాయత్తమయ్యారు. అందుకోసం వెదురు నిపుణుల బృందంతో కలిసి మహారాష్ట్రలోని సింధ్ దుర్గ్ జిల్లా కుడాల్ తాలూకా శివారులో ఉన్న వెదురు పరిశ్రమలు, క్షేత్రాలను వినోద్ కుమార్ రెండు రోజుల పాటు సందర్శించారు. అక్కడి రైతులతో వెదురు సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు.

కుడాల్ పట్టణ పారిశ్రామికవాడలోని కొంకన్ వెదురు పరిశ్రమలను పరిశీలించారు. 2004 లో కేంద్ర ప్రభుత్వం నేషనల్ బ్యాంబు మిషన్ ను ఏర్పాటు చేసి పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. ఆ మిషన్ ను మరింత బలోపేతం చేస్తూ 2017 లో కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కేంద్ర నిర్ణయం బ్యాంబు సాగుకు మరింత ఊతమిచ్చింది. ఈ అవకాశాలను ఉపయోగించుకుని మహారాష్ట్ర కుడాల్ ప్రాంత రైతులు బ్యాంబు సాగును పెంచారు. తద్వారా మెరుగైన లాభాలను ఆర్జిస్తున్నారు.

మహారాష్ట్రలోని కుడాల్ ప్రాంత వెదురు సాగు విజయగాథను బోయినపల్లి వినోద్ కుమార్ ఆధ్వర్యంలోని నిపుణుల బృందం స్వయంగా గమనించింది. ప్రస్తుతం వెదురుకు ఉన్న విశిష్ట ప్రాముఖ్యతను గుర్తించింది. వెదురు ( బ్యాంబు ) చెట్టు కాదు. వెదురు ఒక రకమైన గడ్డి జాతి మొక్క. ఇది దుంపలాగా పెరుగుతుంది. ఎన్నిసార్లు కోసినా మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితులు అయినా ఎదుర్కొని వెదురు మొలకెత్తుతుంది. వెదురును నాటిన రోజు నుంచి నాలుగో సంవత్సరానికి బ్యాంబు క్రాప్ కోతకు సిద్ధమవుతుంది.

ప్రతి ఏడాది కోతకు వస్తుంది. ఎన్ని సంవత్సరాలు అయినా వెదురుకు ఎదురు ఉండదు. ప్రతి ఏడాది ఆదాయం వస్తుంది. ఇతర మొక్కల కన్నా వెదురు ఎక్కువగా ఆక్సిజన్ ను అందించి కార్బన్ దయాక్సిడ్ ను పీలుస్తుంది. రాళ్లు, రప్పలుగా ఉన్న భూముల్లోనూ వెదురు అవలీలగా పెరుగుతుంది. వ్యవసాయానికి యోగ్యం కాని భూముల్లో కూడా వెదురు పెరుగుతుంది. ఆక్సిజన్ ను అందించే సుగుణమ్ కలిగి ఉండటం, బహుళ విధాలుగా వెదురు వినియోగం వల్ల మార్కెట్ లో దీనికి ప్రత్యేకత సంతరించుకుంది.

  • కలపకు ప్రత్యామ్నాయం వెదురు

  • భవిష్యత్తులో వెదురే శరణ్యం

  • కలపకు వెదురు ( బ్యాంబు ) ప్రత్యామ్నాయం గా మారనుంది

ప్రస్తుతం టేకు, ఇతర పలు రకాల కలపను ఇళ్ల నిర్మాణాలకు విరివిగా వాడుతున్నారు. రానున్న రోజుల్లో ఇవి దొరకడం దుర్లభం కానున్నాయి. సమీప భవిష్యత్తులో వెదురు ఉత్పత్తి వినియోగం తప్ప మరో మార్గం లేని పరిస్థితులు నెలకొననున్నాయి. కలప చోట వెదురుతో తయారు చేసే పెద్ద  పెద్ద  చెక్కలు, డోర్స్, విండోస్, ఫ్లోరింగ్స్ లు శరణ్యం కానున్నాయి. వెదురు పరిశ్రమల్లో బ్యాంబు బద్దలు ( స్ట్రిప్స్ ) ను కలిపి యంత్రాల్లో ప్రెస్సింగ్ చేసి భారీ హీటర్స్ తో చెక్కలుగా మలుస్తారు. ఈ చెక్కలను అవసరమైన ఆకృతుల్లో డోర్స్, విండోస్ లను తయారు చేసుకోవచ్చు.

కలపకు బదులుగా వెదురు వినియోగం ప్రత్యామ్నాయం కానున్న పరిస్థితులను అధిగమించేందుకు, తెలంగాణ రాష్ట్రంలో వెదురు సాగును ముమ్మరం చేసేందుకు, ప్రణాళికలు రచించేందుకు బోయినపల్లి వినోద్ కుమార్ సన్నద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రలోని కుడాల్ ప్రాంతంలోని వెదురు పరిశ్రమలను, వెదురు క్షేత్రాలను బోయినపల్లి వినోద్ కుమార్ రెండు రోజుల పాటు నిశితంగా స్టడీ చేశారు. తెలంగాణలో రోజు రోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యం నేపథ్యంలో వెదురు సాగు ఆవశ్యకత విధిగా ఏర్పడుతోంది. ముఖ్యంగా సింగరేణి ప్రాంతాల్లో కాలుష్యం కోరలు చాస్తున్నందున ఇప్పటికే అటవీ పునరుజ్జీవ కార్యక్రమాలను చేపట్టారు.

అయితే వీటికి తోడుగా సింగరేణి కార్మికులకు ఊరటను కల్పించేందుకు పెద్ద ఎత్తున వెదురు సాగును చేపట్టడం ద్వారా కాలుష్యాన్ని నియంత్రించేందుకు అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఏర్పడింది. వెదురు ఉత్పత్తులతో అనేక రకాల క్రాఫ్ట్ లు తయారు చేయడం ద్వారా మార్కెట్ లో మంచి డిమాండ్ ను ఆ పారిశ్రామికవేత్తలు సాధిస్తున్నారు. మహారాష్ట్రలో పర్యటించిన బోయినపల్లి వినోద్ కుమార్ వెంట మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గం టీఆర్ఎస్ ఇంచార్జీ మర్రి రాజశేఖర్ రెడ్డి, రాష్ట్ర హార్టికల్చర్ కమిషనర్ ఎల్. వెంకట్రాం రెడ్డి,  అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ( ఆస్కి ) డైరెక్టర్ అచీలెందర్ రెడ్డి I.F.S, ఎన్నారై శ్రీనివాస్ గోగినేని, కెనడా దేశ వెదురు నిపుణులు సుధీర్ కోదాటి, కృష్ణ కోమండ్ల, తదితరులు ఉన్నారు.

More Press Releases