ఈనెల 8న ఉభయ సభల్లో బడ్జెట్: తెలంగాణ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల

Related image

తెలంగాణ రాష్ట్ర శాసనసభ 5వ సమావేశాల నిర్వహణపై సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన స్పీకర్ ఛాంబర్ లో, శాసన మండలి సమావేశాలపై మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అధ్యక్షతన చైర్మన్ ఛాంబర్ లో బీఏసీ సమావేశాలు వేరు వేరుగా జరిగాయి. రెండు బీఏసీలో తీసుకున్న నిర్ణయాలను శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. ప్రస్తుత బడ్జెట్ సమావేశాలు మార్చి 20వ తేది వరకు జరపాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి తెలిపారు.

ఈనెల 9, 10, 15 తేదీలలో సెలవులను మినహాయిస్తే మొత్తం శాసనసభ బడ్జెట్ సమావేశాలు 12 రోజులు,మండలి సమావేశాలు 8 రోజులు జరుగుతాయన్నారు. శనివారం గవర్నర్ ప్రసంగం ధన్యవాద తీర్మానం పై చర్చ అనంతరం రిప్లై ఉంటుందన్నారు. ఈనెల 8న ఉభయ సభల్లో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నట్లు తెలిపారు. శాసనసభ లో 11,12 తేదీలలో బడ్జెట్ పై చర్చ జరుగుతుందని,12వ తేదీన ఆర్థిక శాఖ మంత్రి రిప్లై ఉంటుందని చెప్పారు. 13,14,16,17,18,19 తేదీలలో మొత్తం ఆరు రోజులు పద్దులపై చర్చ ఉంటుందన్నారు.20 వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లు పై ముఖ్యమంత్రి రిప్లై ఉంటుందన్నారు.

ఆరు నుంచి 20 వ తేదీ వరకు జరిగే శాసనసభ సమావేశాలపై బీఏసీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ పక్ష నేత భట్టి విక్రమార్క,ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ పలు అంశాలపై లఘు చర్చలు జరపాలని కోరగా సభా నాయకుడు కేసీఆర్ సానుకూలంగా స్పందించారన్నారు. నిర్ణయాత్మక చర్చలు జరిగితే శాసనసభ సమావేశాలు ఎన్ని రోజులైనా జరపడానికి సిద్దమని,అందులో ఎలాంటి ఇబ్బందులు లేవని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారన్నారు.

షార్ట్ డిస్కషన్స్ పై బడ్జెట్ రిప్లై తర్వాత ఎన్ని సబ్జెక్ట్స్ వస్తాయో చూసి స్పీకర్ దానిపై నిర్ణయం తీసుకొని,మరోసారి బీఏసీ సమావేశం జరపాలని,అవసరమైతే ముఖ్యమైన అంశాలపై రెండు,మూడు రోజులు సమావేశాలు పొడిగించాలని బిజినెస్ అడ్వైజరి కమిటీ ఏకాభిప్రాయం వ్యక్తం చేసిందన్నారు. శాసన మండలి 6,7,8,11,12,20 తేదీలలో ఆరు రోజుల పాటు జరగనుండగా కౌన్సిల్ చైర్మన్, బీఏసీ సభ్యులు రెండు రోజులు అదనంగా ప్రశ్నోత్తరాలు లేకుండా 13,14 తేదీలలో లఘు చర్చలు జరపాలని నిర్ణయించారని, శాసనమండలి మొత్తం 8 వర్కింగ్ డేస్ పనిచేయనున్నట్లు చెప్పారు. CAA,NRC,NPR లపై సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీర్మానం ప్రవేశ పెడుతారని,సుదీర్ఘ చర్చ అనంతరం సభ్యుల అభిప్రాయాన్ని తీర్మానం చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి ముందుకొచ్చి బీఏసీలో తెలిపారన్నారు..

More Press Releases