రివర్స్ టెండర్లు అంటూ రాష్ట్ర అభివృద్ధిని రివర్స్ చేశారు: నాదెండ్ల మనోహర్

Related image

  • వైసీపీది ఫ్యాక్షన్ పాలన

  • రాక్షస పాలనను అడ్డుకోవడానికే బీజేపీతో పొత్తు

  • నవరత్నాల కోసం పేదల భూములు లాక్కొంటున్నారు

  • భోగాపురం విమానాశ్రయం విషయంలో వైసీపీ నాడు నానా యాగీ చేసింది... ఇప్పుడు రహస్య ఒప్పందాలు

  • విజయనగరం, విశాఖ రూరల్ జిల్లాల నాయకుల సమావేశంలో జనసేన

  • రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి రాష్ట్రాభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం రివర్స్ చేసిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుతోపాటు అనేక ప్రాజెక్టులు అర్ధంతరంగా నిలిచిపోయాయన్నారు. ఏడాదిన్నరగా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు పనులు చేయడం లేదని, ఈ విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు మొట్టికాయ వేసినా స్పందన లేదన్నారు.  చేసిన పనులకు చెల్లించాల్సిన రూ.1400 కోట్ల రూపాయలను ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం బాధాకరమని అన్నారు.    మంగళవారం విశాఖపట్నంలోని జనసేన పార్టీ కార్యాలయంలో విజయనగరం, విశాఖ రూరల్  జిల్లాల పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ పార్టీ నాయకులు, శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఆయన మాట్లాడుతూ... "జనసేన పార్టీకి యువతే బలం. పార్టీని యువతే తమ భుజస్కంధాలపై మోస్తోంది. వెనకబడిన ఉత్తరాంధ్రకు న్యాయం చేయాలనే సంకల్పంతోనే అధ్యక్షులు పవన్ కల్యాణ్ మారుమూల గ్రామాల్లో నివసించే కొంతమంది యువతను ఎంపిక చేసి వారికి టికెట్లు ఇచ్చి 2019 సార్వత్రిక ఎన్నికల్లో అభ్యర్ధులుగా నిలబెట్టారు. నాయకత్వ మార్పుతోనే సమాజంలో మార్పు వస్తుందని ఆయన నమ్మారు కనుకే ఇంతమంది కొత్తవారికి  అవకాశం కల్పించారు. 

• తెలుగుదేశం పార్టీని ప్రజాక్షేత్రంలో నిలదీసింది పవన్ కల్యాణ్

2014 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకుంది. అప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయకుండా భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీకి మద్దతుగా నిలిచింది. బీజేపీ కోరిక మేరకు తెలుగుదేశం పార్టీ గెలుపు కోసం అనేక ప్రాంతాల్లో అధ్యక్షులు పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు. తెలుగుదేశం ప్రభుత్వంలో అవినీతి జరుగుతుంది... నాయకులు ఇష్టానుసారం దోచుకుంటున్నారని పవన్ కల్యాణ్ ఎన్నిసార్లు హెచ్చరించినా చంద్రబాబు పట్టించుకోకపోవడంతో 2018లో మంగళగిరిలో బహిరంగ సభ పెట్టి ప్రజాక్షేత్రంలోనే తెలుగుదేశం పార్టీ అవినీతిని ఎండగట్టిన ఒకే ఒక్క నాయకుడు పవన్ కల్యాణ్. ప్రజలకు మేలు చేస్తారని నమ్మి మద్దతు ఇస్తే .. బాధ్యతలను విస్మరించి దోచుకోవడమే పరమావధిగా పాలిస్తారా అని నిలదీసింది కూడా మన నాయకుడే. 

•జనసేన పార్టీది ఎప్పుడూ ఒకే మాట 

రాజధాని విషయంలో జనసేన పార్టీపై కొంతమంది కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారు. రాజధాని విషయంలో స్పష్టమైన స్టాండ్ తీసుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. రాజధాని అంశంపై మూడు కీలక సమావేశాలు ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల నాయకుల అభిప్రాయాలను సేకరించిన తర్వాతే... పాలన ఒకే చోటు నుంచి అభివృద్ధి అన్ని ప్రాంతాలకి అని మన నాయకుడు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయానికి ఇప్పటికి కట్టుబడి ఉన్నాం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాజధానికి మద్దతు తెలిపి, అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డిలా మాటమార్చడం మన నాయకుడికి చేతకాదు. 

• ఆ రోజు అండగా ఉన్నాం కనుకే ఈ రోజు అంత గౌరవం 

రాజధాని అమరావతి కోసం తెలుగుదేశం ప్రభుత్వం 33 వేల ఎకరాలను సేకరించాలని నిర్ణయం తీసుకున్నప్పుడు... రాజధానిని అంచలంచెలుగా అభివృద్ధి చేయాలిగానీ, ఒకేసారి ఇంత పెద్ద ఎత్తున భూసేకరణ ఎందుకని ప్రశ్నించిన నాయకుడు పవన్ కల్యాణ్. రైతులు ఇష్టపడి ఇస్తే తీసుకోండి కానీ బలవంతంగా భూములు లాక్కుంటే మాత్రం వారికి అండగా నిలబడి పోరాటం చేస్తామని ఆనాడు హెచ్చరించింది పవన్ కల్యాణ్. ఆనాడు ఆ స్టాండ్ తీసుకోబట్టే.. ఈనాడు రాజధాని ప్రాంతంలో ఆయనకు అంత గౌరవం ఇస్తున్నారు. 5 ఏళ్లలో ప్రపంచం గర్వించదగ్గ రాజధాని నిర్మిస్తామని ప్రజల్లో భ్రమ కల్పించిన చంద్రబాబును ప్రజాక్షేత్రంలో ఎండగట్టింది పవన్ కల్యాణ్.  

•పాలన పారదర్శకంగా లేదు 

ప్రజలు వైసీపీ పార్టీకి 151 మంది ఎమ్మెల్యేలను ఇస్తే... ఇవాళ ఆ పార్టీ నాయకులు ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారు. మూడు రాజధానులపై సరైన ప్రణాళిక లేదు. ముఖ్యమంత్రి కార్యాలయం ఎక్కడుంటుంది..? సచివాలయం ఎక్కడుంటుంది..? హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ కార్యాలయాలు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తారో చెప్పడం లేదు. మంత్రులు ప్రజలను  గందరగోళానికి గురి చేయడం, రాత్రికి రాత్రి రహస్య జీవోలు జారీ చేయడం తప్ప పారదర్శక పాలన జరగడం లేదు. స్థిరమైన ప్రభుత్వం... బలమైన నిర్ణయాలు తీసుకొని రాష్ట్రాభివృద్ధికి తోడ్పడుతుంది అనుకున్నాం కానీ, పెట్టుబడుదారుల్లో భయాందోళనలు సృష్టించి పెట్టుబడులు పెట్టాలన్న వాతావరణాన్నే కలుషితం చేశారు. ఆనాడు అమరావతి రైతులతో ప్రభుత్వమే ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం అనుసరించే రైతులు వారి భూములను త్యాగాలు చేశారు. రాజధాని 29 గ్రామాల సమస్య కాదు... 5 కోట్ల ఆంధ్రుల సమస్య.  

• వైసీపీది అసమర్ధ ప్రభుత్వం 

విభజన చట్టాన్ని అనుసరించి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం రూ. 150 కోట్లు కేటాయిస్తుంది. గత మూడేళ్లుగా రాష్ట్రానికి ఆ నిధులు వచ్చాయి. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ నిధులను తెచ్చుకోలేకపోయింది. దీనికి కారణం యుటిలైజేషన్ సర్టిఫికేట్లు కేంద్రానికి ఇవ్వలేదు. ఇప్పటికీ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని ఏజెన్సీలో కనీస మౌలిక సౌకర్యాలు లేవు. ఈ నిధులు తెచ్చుకొని ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేకపోవడం... పాలకుల అసమర్ధతను తెలియజేస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భోగాపురం ఎయిర్ పోర్టు విషయంలో నానా యాగి చేసి ఇప్పుడు దాని ఊసే ఎత్తడం లేదు. పైగా పనులు వేగంగా మొదలుపెట్టాలని జి.ఎం.ఆర్ సంస్థతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నారు.

• వారం రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కమిటీలు 

2019 సార్వత్రిక ఎన్నికల్లో బీఎస్పీ, కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన నాయకులకు కొంతమందికి అన్యాయం జరిగింది. సీట్లు సర్దుబాటు చేయలేకపోయాం. నిజానికి తెలుగుదేశం, వైసీపీ పార్టీలు మనతో పొత్తు పెట్టుకోవాలని భావించినా.. యువతకు అవకాశం ఇవ్వాలనే ఒకే ఒక్క సదుద్దేశంతో పవన్ కల్యాణ్ వారితో పొత్తు పెట్టుకోకుండా పోటీ చేశారు. ఎవరినైతే నమ్మి ఆ రోజు టికెట్లు ఇచ్చారో వాళ్లలో చాలామంది పార్టీని, జనసైనికులను మోసం చేశారు. మరో వారం రోజుల్లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లా కమిటీలు వేస్తాం. నియోజకవర్గ ఇంఛార్జులుగా నియమించే వాళ్లు వీలైనంత త్వరగా పట్టణ, మండల కమిటీలను పూర్తి చేయాలి. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోంది. బడుగు, బలహీన వర్గాలు వేధింపులకు గురవుతున్నారు. దానికి చరమగీతం పాడాలనే బీజేపీతో జనసేన పార్టీ పొత్తు పెట్టుకుంది. పార్టీ బలోపేతానికి స్థానిక సంస్థల ఎన్నికలు మంచి అవకాశం.  అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని  పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు.

జిల్లాల వారీగా ప్రజా సమస్యలను గుర్తించి వాటిపై పార్టీ నాయకులు శ్రేణులు తగిన పోరాటాలు చేయాలి. ఇప్పటికే పవన్ కల్యాణ్ దృష్టికి వివిధ జిల్లాల నుంచి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు వస్తున్నాయి. వాటిపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలో చక్కెర కర్మాగారాలకు సంబంధించిన సమస్యలు ప్రధానంగా ఉన్నాయి. అనకాపల్లి, గోవాడ కర్మాగారాలతో పాటు ఉత్తరాంధ్రలో సహకార చక్కెర కర్మాగారాలు, మూతపడ్డ జూట్ మిల్ విషయాలుపై తగిన పోరాటాలు చేస్తాం అన్నారు. 

ఈ సమావేశంలో పార్టీ నాయకులు టి.శివ శంకర్, బొలిశెట్టి సత్య, సుందరపు విజయ్ కుమార్, కోన తాతారావు, పాలవలస యశస్విని, గడసాల అప్పారావు, డా.రఘు, కందుల దుర్గేశ్, బి.నాయకర్, పి.వి.ఎస్.ఎన్.రాజు, వి. గంగులయ్య, గిరడా అప్పలస్వామి, జి.గౌరీ శంకర్, మైలపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

More Press Releases