పట్టణాలను గ్రీన్ సిటీలుగా మార్చుకోవడానికి అందరూ ముందుకు రావాలి: మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి

Related image

నిజామాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా నగరాలను, పట్టణాలను గ్రీన్ సిటీ లుగా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలని తెలంగాణ రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. మంగళవారం నాడు నిజామాబాద్ ఆర్ అండ్ బి అతిథిగృహంలో స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్, మేయర్ తదితరులతో కలిసి నాలుగు మున్సిపాలిటీలకు కొత్తగా అందజేస్తున్న ట్రాక్టర్లను పూజలు చేయించి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గౌరవ ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ ఇచ్చిన ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమంలో పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశుభ్రతతో పాటు మొక్కలు పెంచే కార్యక్రమం కూడా అత్యంత ప్రాధాన్యతతో నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా యంత్రాంగం ఈ దిశగా మరింత ముందుకు వచ్చి కలెక్టర్ పరిధిలోని నిధులతో ప్రతి మున్సిపాలిటీలో నాటిన మొక్కలకు నీటిని అందించడానికి ప్రత్యేకంగా కొత్తగా ఒక ట్రాక్టర్ ను ఒక ట్యాంకర్ ను అందించారని తెలిపారు.

మున్సిపల్ చైర్ పర్సన్ లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఏ లక్ష్యంతో జిల్లా యంత్రాంగం వీటిని సరఫరా చేసిందో అందుకు అనుగుణంగా వీటిని కేవలం మొక్కలను సంరక్షించడానికి నీటిని అందించడానికి మాత్రమే ఉపయోగించుకోవాలని తద్వారా అన్ని మొక్కలు బ్రతికే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ముఖ్యమంత్రి స్ఫూర్తికి అనుగుణంగా ట్రాక్టర్లను అందించినందుకు జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు. పట్టణ ప్రగతిలో నిర్దేశించిన అన్ని పనులను పూర్తి చేసి పట్టణాలను సుందరంగా పరిశుభ్రంగా తీర్చిదిద్దడానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలతో కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

అనంతరం ఫులాంగ్ వీధులలో మొక్కలు నాటి ట్రీ గార్డ్ లు ఏర్పాటు చేశారు. పలు వార్డుల్లో పాదయాత్ర చేసి ప్రజలతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించే సమస్యలపై సత్వరమే చర్యలు చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, స్థానిక శాసనసభ్యులు బీగాల గణేష్ గుప్తా, నగర మేయర్ నీతూ కిరణ్, అదనపు కలెక్టర్ లతా, డీఎఫ్ఓ సునీల్, నగర పాలక సంస్థ కమిషనర్ జితేష్ వి పాటిల్, మూడు మున్సిపాలిటీల చైర్ పర్సన్ లు రాజశ్రీ, పద్మ, వినీత, మున్సిపల్ కమిషనర్లు శైలజ, గంగాధర్ తదితరులు నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, ట్రాన్స్కో ఎస్ఇ సుదర్శన్, ఆర్డీవో వెంకటయ్య, డిసిఓ సింహాచలం, కార్పొరేటర్లు, ప్రజా ప్రతినిధులు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

More Press Releases