ఎస్‌ఆర్‌డీపీ ప‌నుల‌ను త‌నిఖీ చేసిన హైదరాబాద్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌

Related image

వేగంగా పెరుగుతున్న న‌గ‌ర ప్ర‌జ‌ల సౌక‌ర్యార్థం ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్ కింద నిర్మిస్తున్న ఫ్లైఓవ‌ర్లు, అండ‌ర్ పాస్ ప‌నుల‌ను హైదరాబాద్ న‌గ‌ర‌ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ సోమ‌వారం ఉద‌యం ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు. ఎల్బీన‌గ‌ర్, చార్మినార్ జోన్ల‌లో ప‌ర్య‌టించారు. నాగోల్ ఫ్లైఓవ‌ర్‌, కామినేని ఫ్లైఓవ‌ర్‌, ఎల్బీన‌గ‌ర్ అండ‌ర్ పాస్‌లు, బైరామ‌ల్‌గూడ ఫ్లైఓవ‌ర్లు, చాంద్రాయ‌ణ‌గుట్ట ఫ్లైఓవ‌ర్ ప‌నుల‌ను ప‌రిశీలించారు. ఈ ప‌నుల‌ను వేగంగా పూర్తి చేయాల‌ని అధికారులు, కాంట్రాక్ట‌ర్ల‌ను ఆదేశించారు. ఈ నిర్మాణ ప‌నుల‌కు అవ‌స‌ర‌మైన ఆస్తుల‌ను సేక‌రించుట‌కై భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను వేగంగా చేప‌ట్టాల‌ని ఆదేశించారు.

అలాగే సీఆర్‌ఎంపీ కింద అప్ప‌గించిన రోడ్ల మ‌ర‌మ్మ‌తులు, ఫుట్‌పాత్‌ల నిర్మాణ‌ ప‌నుల‌ను మేయ‌ర్ త‌నిఖీ చేశారు. వ‌ర్షాకాలంలో ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది రాకుండా స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల‌ని సీఆర్‌ఎంపీ కాంట్ర‌క్ట్ ఏజెన్సీలు, విద్యుత్‌, వాట‌ర్ వ‌ర్క్స్‌, ట్రాఫిక్ అధికారుల‌కు సూచించారు. ప్ర‌ధాన జంక్ష‌న్ల‌ను అందంగా ఆధునిక డిజైన్ల‌తో అభివృద్ది చేయాల‌ని ఆదేశించారు. వాణిజ్య ప్రాంతాల్లో ప‌బ్లిక్ టాయిలెట్ల‌ను వెంట‌నే నిర్మించాల‌ని చెప్పారు. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఎల్బీన‌గ‌ర్‌ శాస‌న స‌భ్యులు డి.సుధీర్ రెడ్డి, ప్రాజెక్ట్స్‌ చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్‌, సిసిపి దేవేంద‌ర్ రెడ్డి, స్థానిక ప్ర‌జాప్ర‌తినిధులు, అధికారులు పాల్గొన్నారు.

అంత‌కుముందు ఉద‌యం 5గంట‌ల‌కు మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌ మెట్టుగూడలో ప‌ర్య‌టించి పారిశుధ్య ప‌నుల‌ను ప‌రిశీలించారు. శానిటేష‌న్ వ‌ర్క‌ర్లు, సూప‌ర్‌వైజ‌ర్ల‌తో మాట్లాడారు. సిబ్బంది హాజ‌రును త‌నిఖీ చేశారు.

More Press Releases