పట్టణ ప్రగతిలో పాల్గొన్న తెలంగాణ సీఎస్ సోమేశ్ కుమార్

Related image

  • గ్రీనరీ పెంపుకు ప్రత్యేకంగా పది శాతం నిధులు: సీఎస్ సోమేశ్ కుమార్

  • ఇబ్రాహీంపట్నంలో పట్టణ ప్రగతిలో పాల్గొన్న సీఎస్                                               

తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, నగరాలలో గ్రీనరీని పెంపొందించేందుకుగాను మున్సిపల్ బడ్జెట్లలో పది శాతం నిధులను ప్రత్యేకంగా గ్రీన్ బడ్జెట్ గా కేటాయిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వున్న 140 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోని 3 ,456 మున్సిపల్ వార్డుల్లో నేడు పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైంది. రంగా రెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం మున్సిపల్ కేంద్రంలో జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ హాజరయ్యారు. మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్ లు కూడా హాజరయ్యారు.

ఈ సందర్బంగా స్థానిక మార్కెర్ట్ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన సమావేశంలో సిఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం గణనీయంగా పెంచాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక సంస్థల బడ్జెట్లో పది శాతాన్నిప్రత్యేకంగా హరిత హారానికి కేటాయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. మొక్కల పెంపకానికి ఎంత పెద్ద మొత్తంలో నిధులను కేటాయిస్తున్న రాష్ట్రం దేశంలోనే కేవలం తెలంగాణ రాష్ట్రమని వెల్లడించారు. అయితే, ఈ హరిత హారంలో భాగంగా నాటే మొక్కలలో 85 శాతం మొక్కలు బతికేలా చూడాల్సిన భాద్యత మున్సిపల్ చైర్మన్లు, మేయర్లు, కౌన్సిలర్, కార్పొరేటర్ల పైనే ఉందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో నిర్వహించిన పల్లె ప్రగతి సానుకూల బాగస్వామ్యంతో విజయవంతంకావడంతో ఇదే విధమైన స్ఫూర్తితో పట్టణ ప్రగతి నిర్వహించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశాల మేరకు నేటి నుండి మార్చ్ 4వ తేదీ వరకు పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు.

పట్టణ ప్రగతిలో స్థానికుల భాగస్వామ్యం కల్పించేందుకు ప్రతి మున్సిపల్ వార్డ్ లో ఒక్కో కమిటీలో పదిహేను మంది సభ్యులుగా నాలుగు కమిటీలను మొత్తం అరవై మంది సభ్యులను నియమించడం జరిగిందని చెప్పారు. స్థానిక పరిపాలనలో పౌరుల భాగస్వామ్యం మరింత కల్పించే విధంగా నూతన మున్సిపల్ చట్టం రూపొందించడం జరిగిందని తెలిపారు. దీనిలో భాగంగా 75 గజాల లోపు స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు అనుమతులు అవసరం లేదని, నిబంధనల ప్రకారం నిర్మిచుకొని కేవలం సమాచారాన్ని సంబంధిత మున్సిపాలిటీలకు ఇవ్వాలని సూచించారు. ప్రతి మున్సిపల్ కేంద్రంలో టాయిలెట్ల నిర్మాణం, డంప్ యార్డు, స్మశాన వాటికలు, ఆటో షెల్టార్ల నిర్మాణాలకు చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్, కార్పొరేటర్లను కోరారు. పదిరోజుల పాటు జరిగే ఈ పట్టణ ప్రగతి కార్యక్రమంలో నూతన మున్సిపల్ చట్టంపై చైతన్య పర్చాలని కోరారు.

తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధిలో ముందంజలో ఉందని, అయితే అక్షరాస్యత శాతం తక్కువగా ఉందని అన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ మినహా 33 లక్షల మంది నిరక్షరాస్యులు వున్నారని తేలిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తీర్చిదిద్దే కార్య క్రమాన్ని ముఖ్యమంత్రి త్వరలోనే ప్రకటిస్తారని చెప్పారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో వార్డుల వారీగా సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు వీలుగా వార్డుకు 4 కమిటీలను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. 14వ ఆర్థిక సంగం నిధులతో చెత్త సేకరణకుగాను ప్రత్యేక వాహనాలను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.

స్థానిక ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలో పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. ఎస్సి, బీసీ బస్తీలలో పర్యటించి సమస్యలను తెలుసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నంలో వాకింగ్ ట్రాక్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు.

జిల్లా కలెక్టర్ ఆమోయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లాలోని 15 మున్సిపాలిటీలలో పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు, మొత్తం 396 వార్డులలో వార్డు కమిటీలను ఏర్పాటు చేశామని తెలిపారు. 10 రోజుల పాటు నిర్వహించే పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా 15 మున్సిపాలిటీల రూపు రేఖలను మార్చేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. అంతకు ముందు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి, స్థానిక శాసన సభ్యులు తదితరులు మున్సిపాలిటీ లోని ఎస్సి, బీసీ బస్తీలలో పాదయాత్ర చేసి మౌలిక సదుపాయాలను పరిశీలించారు. అదే విధంగా ప్రభుత్వ ఆసుపత్రిని, ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్తీల్లో, మార్కెట్ యార్డులో మొక్కలను నాటారు. అదే విదంగా పట్టణంలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను వారు పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు హరీష్, ప్రతిక్ జైన్, ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ స్రవంతి, కౌన్సిలర్లు ఇతర ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 

More Press Releases