శివరాత్రి కానుకగా పురాణపండ 'శంభో మహాదేవ'

శివరాత్రి కానుకగా పురాణపండ 'శంభో మహాదేవ'
గడచిన రెండున్నర దశాబ్దాలుగా తన అక్షర దీపాలతో ఆధ్యాత్మిక లోకాన్ని వెలిగిస్తున్న ప్రముఖ రచయిత, పుస్తక మాంత్రికుడు పురాణపండ శ్రీనివాస్ మరో అపురూప గ్రంథాన్ని భక్తకోటి ముందుకు తీసుకువస్తున్నారు. 'శంభో మహాదేవ' పేరుతో సుమారు 500 పేజీలతో రూపొందిన ఈ అఖండ గ్రంథం రాబోయే మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా విడుదల కానుంది.

అక్షర మాంత్రికుని అద్భుత ప్రయాణం శ్రీశైల మహాక్షేత్రానికి ప్రత్యేక సలహాదారుడిగా, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అధికారిక పత్రిక 'ఆరాధన' సంపాదకుడిగా విశేష సేవలందించిన పురాణపండ శ్రీనివాస్‌కు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా విదేశాల్లోనూ భారీగా పాఠకులు ఉన్నారు. ఆయన రచనల్లోని మార్దవం, వైదిక వైదుష్యం భక్తులను జ్ఞానానందం వైపు నడిపిస్తాయని పండితులు కొనియాడుతుంటారు. గతంలో ఆయన వెలువరించిన 'శ్రీ పూర్ణిమ', 'శ్రీమాలిక', 'నేనున్నాను', 'అమ్మణ్ణి' వంటి గ్రంథాలు ఆధ్యాత్మిక సాహిత్యంలో కొత్త ఒరవడిని సృష్టించాయి.

సెలబ్రిటీల ఆదరణ పురాణపండ శ్రీనివాస్ గ్రంథాలకు సినీ, రాజకీయ రంగాల ప్రముఖుల నుంచి విశేష స్పందన లభిస్తుంటుంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయ నేతలు ఆయన రచనల పట్ల ఎంతటి ఆసక్తిని చూపిస్తారో గతంలో రవీంద్రభారతిలో జరిగిన ఓ సభలో సీనియర్ నటుడు మురళీమోహన్ స్వయంగా వెల్లడించారు. అప్పటి సభకు సాక్షిగా నిలిచిన తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక సలహాదారులు కె.వి. రమణాచారి వంటి ప్రముఖులు కూడా శ్రీనివాస్ కృషిని అనేక సందర్భాల్లో అభినందించారు.

హక్కులు పొందిన కాలభైరవ ప్రచురణలు త్వరలో ఆవిష్కరణ జరుపుకోనున్న ఈ 'శంభో మహాదేవ' గ్రంథానికి సంబంధించిన ప్రచురణ హక్కులను 'కాలభైరవ ప్రచురణల సంస్థ' వారు పొందినట్లు సమాచారం. శివతత్వాన్ని, ఆర్ష ధర్మ వైభవాన్ని చాటిచెప్పే ఈ గ్రంథం భక్తులకు ఒక గొప్ప కానుక కానుందని ఆధ్యాత్మిక వేత్తలు భావిస్తున్నారు. ఈ గ్రంథ ఆవిష్కరణ వేడుకకు సంబంధించి త్వరలోనే తేదీ, వేదిక వివరాలు అధికారికంగా వెల్లడి కానున్నాయి.
MAHA SHIVARATRI 2026
Puranapanda Srinivas
Sambho Mahaadeva Book
Kaalabhairava Graphics
MAHA SHIVARATRI 2026 Puranapanda Srinivas

More Press News