పీవీఆర్ స్కూల్ శతాబ్ది వేడుకలు.. హైదరాబాద్‌లో ఘనంగా సన్నాహక సమావేశం

పీవీఆర్ స్కూల్ శతాబ్ది వేడుకలు.. హైదరాబాద్‌లో ఘనంగా సన్నాహక సమావేశం
ఒంగోలులోని ప్రఖ్యాత పీవీఆర్ మున్సిపల్ హైస్కూల్ వందేళ్ల చారిత్రక ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఈ అపురూప ఘట్టాన్ని పురస్కరించుకుని నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలను చరిత్రలో నిలిచిపోయేలా జరిపేందుకు పూర్వ విద్యార్థులు నడుం బిగించారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌లో ఓ సన్నాహక సమావేశాన్ని (ప్రీ-మీట్) ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని డాక్టర్ రావు ఈఎన్‌టీ సూపర్ స్పెషాలిటీ ఇంటర్నేషనల్ హాస్పిటల్ ఆతిథ్యం ఇచ్చింది. ఆసుపత్రి అధినేత డాక్టర్ రావు కూడా ఇదే పాఠశాల పూర్వ విద్యార్థి కావడం విశేషం. సుమారు 150 మందికి పైగా పూర్వ విద్యార్థులు ఈ సమావేశంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. పాఠశాలతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, శతాబ్ది ఉత్సవాలను అద్భుతంగా నిర్వహించాలని ఏకగ్రీవంగా తీర్మానించారు.

ఈ సందర్భంగా కన్వీనర్ ఆరిగ వీర ప్రతాప్, కో-కన్వీనర్ బేతంశెట్టి హరిబాబు మాట్లాడుతూ.. పాఠశాల గౌరవప్రదమైన చరిత్రను స్మరించుకుంటూ, రాబోయే ఉత్సవాలను ఒక చారిత్రక ఘట్టంగా నిలబెట్టడమే లక్ష్యమని స్పష్టం చేశారు. సమావేశంలో ఉత్సవాల విజన్, థీమ్, ప్రచార వ్యూహాలు, స్పాన్సర్‌షిప్ వంటి అంశాలపై లోతుగా చర్చించారు. కార్యక్రమాల విజయవంతమైన నిర్వహణ కోసం పలు కమిటీలను ఏర్పాటు చేసి, బాధ్యతలను కేటాయించారు.

ఈ కమిటీలలో రిటైర్డ్ డీజీపీ నండూరి సాంబశివ రావు, రిటైర్డ్ డీఐజీ తోట వెంకటరావు, సినీ రచయిత మరుధూరి రాజా, సీనియర్ జర్నలిస్ట్ తలవర్జుల శివాజీ, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆదిపూడి గాయత్రి ప్రసాద్, కురవి రఘురామ్, డాక్టర్ శ్రీని పేర్ల, నార్నె చాణక్య వంటి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. మహిళా కమిటీ కన్వీనర్‌గా ధారా శ్రీవల్లి, కో-కన్వీనర్లుగా బయ్యవరపు రాజ్యలక్ష్మి, సీతాపద్మ తదితరులను నియమించారు.

రాబోయే జనవరి నెలలో సంక్రాంతి పండుగకు ముందు రెండు రోజుల పాటు ఈ శతాబ్ది ఉత్సవాలను నిర్వహించాలని నిర్వాహకులు ప్రాథమికంగా నిర్ణయించారు. త్వరలోనే తేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. ఈ వేడుకల అనంతరం ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి, దాని ద్వారా పలు స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టాలని కూడా పూర్వ విద్యార్థులు భావిస్తున్నారు.
20250831fr68b4732cd0ee8.jpg 20250831fr68b4730f3cde6.jpg
PVR High School
PVR School
Ongole
Nanduri Sambasivarao
Ariga Veera Prathap
Dr Rao
Thota Venkata Rao
Marudhuri Raja

More Press News