ప్రతి రూపాయికీ లెక్క చెబుతాం.. చెప్పిన ప్రతి అభివృద్ధి పని ముందుకు తీసుకెళ్తాం: పవన్ కల్యాణ్

Related image

•స్థానిక ఎన్నికల్లో ఇదే జనసేన పార్టీ నినాదం

•బీజేపీతో కలసి ఓ ప్రణాళికతో ముందుకు వెళ్దాం

•వైసీపీ తప్పుడు విధానాలే  జనసేన బలం

•టీడీపీకి పట్టిన గతే వైసీపీకి పడుతుంది 

* రూ.2 వేల కోట్లు ఏమిటి.. రూ.20 వేల కోట్లు దోచేస్తారు

•అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు

•అధికారాలు పంచాయితీలకు బదలాయించాలి

•సామాన్యుడి తరపున పోరాడేందుకే జనసేన స్థాపించా

•పని చేసే ప్రతి కార్యకర్త నాకు తెలియాలి

•దశల వారీగా మరిన్ని సమావేశాలు ఏర్పాటు చేస్తాం

•తాడేపల్లిగూడెం నియోజకవర్గ క్రియాశీలక కార్యకర్తల సమావేశంలో పవన్ కళ్యాణ్ 

‘ప్రతి రూపాయికీ లెక్క చెబుతాం.. చెప్పిన ప్రతి అభివృద్ధి పనిని ముందుకు తీసుకువెళ్తాం...’ స్థానిక సంస్థల ఎన్నికల్లో అదే జనసేన పార్టీ నినాదమని పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవనీ, అందరి అభిప్రాయాలు తీసుకుని ముందుకు వెళ్తామని చెప్పారు. స్థానిక ఎన్నికల్లో  ఏ పంథా అనుసరించి  ఎలాంటి విధానాలతో ప్రజల వద్దకు వెళ్లాలి అనే అంశంపై బీజేపీతో కలసి ఒక ప్రణాళికతో ముందుకు వెళ్దామని చెప్పారు. పార్టీ క్రియాశీలక కార్యకర్తల సమావేశాల్లో భాగంగా ఆదివారం మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కార్యకర్తలతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు సమావేశం అయ్యారు. పార్టీ కార్యకర్తల అభిప్రాయాలు, స్థానికంగా వారికి ఎదురవుతున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “వైసీపీ చేస్తున్న తప్పులే మనకి కొండంత అండ. కొడుకు ఉద్యోగం చేస్తున్నాడు కదా అని తల్లిదండ్రుల ఫించన్లు తీసివేయడం దారుణం. నిధులు లేవు కాబట్టి మన పథకాలు కొన్ని వర్గాలకు, ఇంత మందికి మాత్రమే చేరాలి అన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా గెలవచ్చు అన్నది వారి ఉద్దేశం. అలా గెలవచ్చు అంటే నెల రోజుల్లో రూ.10 వేల కోట్లు విడుదల చేసిన టీడీపీ ఇప్పుడు అధికారంలో ఉండాలి. ఓ లక్ష్యంతో కొంత మందికే ఇస్తామన్న విధానంతో ముందుకు వెళ్తే టీడీపీకి పట్టిన గతే వైసీపీకీ పడుతుంది. టీడీపీ రూ.పది వేల కోట్లు ఇచ్చినా ఏ తప్పు చేస్తున్నారో ప్రజలు గ్రహించారు. ఎదురింటి వాడికి  రేషన్ వచ్చి తమకు రాకపోతే కచ్చితంగా కోపం వస్తుంది. ఇలాంటి విధానాల కారణంగా ప్రజల్లో అపనమ్మకాలు ఏర్పడతాయి. వైసీపీ ఇలాంటి తప్పుడు విధానాలు ఎన్ని అమలు చేస్తే జనసేన అంత ముందుకు వెళ్తుంది. వైసీపీ అనుసరించే తప్పుడు విధానాలను మనం బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్దాం.

•కేరళ తరహా విధానాలతో ముందుకి

అధికార వికేంద్రీకరణ అంటే మూడు రాజధానులు కాదు. అధికారాలు స్థానిక సంస్థలకు బదలాయించాలి. డబ్బులు ఖర్చు చేసే హక్కు స్థానిక సంస్థలకు ఉండాలి. ఎవరో వచ్చి సంతకాలు పెడితే పనులు జరగడం కాదు. కేరళ తరహా విధానాలు అవసరం. అక్కడ స్థానిక సంస్థల నిధులు ఎలా ఖర్చు చేయాలన్న అంశం స్పష్టంగా ఉంటుంది. పార్టీ ఓటమి తర్వాత మన విధానాలు నచ్చిన ఓ వ్యక్తి మన ఆలోచనలు అక్కడ అమలవుతున్న విషయాన్ని నాకు తెలిపాడు. మీరు వెనక్కి వెళ్తే సమాజానికి అన్యాయం జరుగుతుంది. మీ వెంట మేము ఉంటామని చెప్పాడు.

* టీడీపీ తప్పుల గురించి మొదట మాట్లాడింది మనమే

చంద్రబాబు నాయుడు గారి పీఎస్ దగ్గర రూ.2 వేల కోట్లు దొరికితే స్పందించాలి అంటున్నారు.. నాయకులు తప్పులు చేస్తే నిలదీసే శక్తి సమాజానికి ఉండాలి. రూ. 2 వేలకు నైతికతను అమ్మేసుకునే స్థాయిలో ప్రజలు ఉన్నప్పుడు ఈ నాయకులు రూ. 2 వేల కోట్లు ఏంటి రూ. 20 వేల కోట్లు అయినా దోచేస్తారు. వైసీపీ నాయకులు మాట్లాడితే మీరు చెప్పాల్సింది... ఏంటంటే అసలు టీడీపీ నాయకుల తాలూకూ తప్పొప్పులు 2018లో మొదట లేవనెత్తింది జనసేన పార్టీయే. వారు చేసిన అవినీతి గురించిగానీ, ఇసుక మాఫియా గురించిగానీ, అవి జన్మభూమి కమిటీలు కాదు గూండా కమిటీలు అని చెప్పింది మనమే. మంగళగిరి వేదికగా మనమే మాట్లాడాం. టీడీపీ నాయకుల మీద కేసులు ఉంటే పూర్తి చేయండి. సంపూర్ణంగా శిక్షించండి. మేము ఎవర్నీ వెనకేసుకురావడం లేదు. ఆ విషయాన్ని వైసీపీ నాయకులకు చెప్పండి.

•జగన్ రెడ్డి గారికి ఉన్నట్లు నా దగ్గర గనులు లేవు

డబ్బు లేని రాజకీయాలు చేయాలి. ఓ మధ్య తరగతి వ్యక్తి పోటీ చేస్తామని ముందుకు వచ్చే ధైర్యం రావాలనే జనసేన పార్టీని ఏర్పాటు చేశాను. రూపాయి పెట్టుబడి లేకుండా గెలవాలి. ఢిల్లీలో ఆప్ పార్టీ ఓట్లు డబ్బు ఇచ్చి కొనలేదు. ఐడియాలజీతో ఆ పార్టీ గెలిచింది. అలాంటి వ్యూహాలను మనం అమలు చేద్దాం. డబ్బు ఖర్చు చేస్తే గెలుస్తాం అన్న గ్యారెంటీ కూడా లేదు. ఓడినోడు బయట ఏడిస్తే గెలిచినోడు ఇంట్లో ఏడ్చే పరిస్థితి ఉంది. భీమవరంలో గెలిచిన గ్రంధి శ్రీనివాస్ ఆయనకి ఓటు వేసిన వారికి కూడా పని చేయడం లేదని తెలిసింది. ఎక్కువ మంది ప్రజలు డబ్బు ప్రభావానికి లోనై ఓట్లు వేయడమే ఈ పరిస్థితికి కారణం, ఓటు ఎందుకు వేయాలన్న స్పష్టత ప్రజల్లో లేదు. డబ్బు ప్రభావం ఉన్న రాజకీయాలకు పారద్రోలాలి. క్రిమినలైజేషన్ పాలిటిక్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయాలి. సినిమాలు నాకు బాధ్యత నేర్పాయి. నేను కాంట్రాక్టులు చేయలేను. జగన్ రెడ్డి గారి లాగా నాకు గనులు లేవు. గ్రంధి  శ్రీనివాస్ గారి లాగా ఆక్వా వ్యాపారాలు లేవు. నేనుస్వశక్తి మీద ఆధారపడ్డవాడిని. అదే ఇంతటి ప్రజాభిమానాన్ని తెచ్చిపెట్టింది.

నేరస్తులు నడిపే రాజకీయాలు చూసి విసిగిపోయి రాజకీయాల్లోకి వచ్చా. అలా అని రాజకీయాలను రిటైర్మెంట్ ప్లాన్ల లా చేసుకుని రాలేదు. కుల, మత ప్రభావంతో దేశం విచ్ఛిన్నం అయిపోతుంటే దేశాన్ని ప్రేమించేవాడిగా బాధ కలిగింది. ఆ కులం ఓట్లు ఈ పార్టీకి అని మాట్లాడుకునే స్థాయి వచ్చింది అంటే రాజకీయ వ్యవస్థ ఏ స్థాయికి దిగజారిందో అర్ధం అవుతోంది. ఎస్సీ కమ్యునిటీ మొత్తం వైసీపీకి ఏం లేదు. నేను ఏ కులానికి చెందిన వాడిని అయినా నా కులాన్ని చూసి ఓటు వేయమని ఎవరికీ చెప్పను. నా నడవడిక, ఆలోచన చూసి ప్రేమించమని చెబుతాను. రెండు కులాలకు చెందిన నాయకుల గొడవ రాష్ట్ర విచ్ఛిన్నానికి దారి తీస్తుందన్న ఉండవల్లి అరుణ్ కుమార్ గారి మాటల్ని లోతుగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితుల్లో మార్పు రావాలి.

•పోరాటంతో మార్చగలం

సినిమా జీవితంలో రెడ్ కార్పెట్ ఉంటుంది. అలాంటివన్నీ వదులుకుని దారినపోయే కొట్టు సత్యనారాయణ లాంటి వారితో తిట్టించుకోవాల్సిన అవసరం ఏముంది. మన ఆఫీస్ కి వచ్చి 2014లో టిక్కెట్ కోసం ఓ మాట చెప్పమని అడిగిన మాటలు మరచినట్టున్నారు. వారు బూతులు తిడుతున్నారు అంటే వారి దగ్గర సత్యం లేదు అని అర్ధం. అలాంటివారు మాట్లాడుతుంటే మన కార్యకర్తలు కాస్త ఓర్పు వహించండి. అలాంటివాళ్లకి తగిన సమయంలో తగిన సమాధానం చెబుదాం. పోరాటంతో ఈ వ్యవస్థని మార్చగలం అని నమ్ముతాను. ప్రస్తుత రాజకీయాల్లో జనం కోసం నిలబడే ఒక పార్టీ అవసరం ఉంది. సుగాలి ప్రీతి హత్యాచారం చేసిన వ్యక్తుల్ని శిక్షించమంటే పాలకులకు రుచించడం లేదు. మాట్లాడితే మూడేళ్ల క్రితం జరిగిన అంశంపై ఇప్పుడు మాట్లాడుతారా అంటున్నారు. వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అవినీతిపై పెట్టిన కేసులు పదేళ్ల క్రితం నాటివి కదా వదిలేయండి అని సిబిఐకి చెప్పగలరా? వివేకానందరెడ్డి గారు చనిపోయి ఏడాది అయ్యింది అందుకే వదిలేశారు. కోడి కత్తితో ఎప్పుడో గుచ్చాడు కాబట్టి వదిలేశారు. ఏదైనా వాళ్లకి కన్వినెంట్ గా చేస్తారు. 20 ఏళ్ల క్రితం ముత్తాతని చంపిన వారిని ఇప్పుడు చంపేస్తాం లాంటి కోపాలు ఉంటాయిగానీ, సుగాలి ప్రీతికి అండగా ఉంటామంటే కుదరదు. ఎన్నికల తర్వాత ఒక ఓడిపోయిన పార్టీ దగ్గరకు ఏదో చేస్తామని రావడం పరిస్థితికి అద్దం పడుతోంది.

•నిరుత్సాహం వద్దు

జనసేన పార్టీకి చెయ్యెత్తి జై కొట్టిన ప్రతి జనసైనికుడు, పోరాటయాత్రలో నిలబడిన ప్రతి యువకుడు ఓటు వేసి ఉంటే జనసేన పార్టీ 60 నుంచి 70 సీట్లతో అసెంబ్లీలో నిలబడి ఉండేది. ఓటమి జనసేన పార్టీ చేసిన తప్పు కాదు. ఒక సదుద్దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో కష్టాలు ఉంటాయి. ఓటమి నిరుత్సాహాన్ని నింపరాదు. నన్ను ఎవరూ వెనక్కి లాగలేరు. 2014 నుంచి 2019 వరకు నేను మాత్రమే ప్రయాణం చేశాను. ఎందుకంటే ముందు నన్ను నేను నిరూపించుకోవాలన్న లక్ష్యంతోనే ప్రయాణం చేశాను. ఈ వ్యక్తితో నడవవచ్చు అన్న నమ్మకం కలుగచేయాలనుకున్నా. ప్రలోభాలతో కాదు మీకు నచ్చితేనే రమ్మన్నాను. ఏ మూలకి వెళ్లినా అసంఖ్యాకంగా జనం వస్తున్నారు అంటే వారు డబ్బుకో, మరోదానికో ఆశపడి వచ్చిన వారు కాదు. భగవంతుడు ఇచ్చిన ఈ బలాన్ని సమాజ శ్రేయస్సుకి, బలమైన రాష్ట్ర నిర్మాణానికీ వాడుదాం.

సొంత మీడియా కావాలి అంటున్నారు. మన మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారు అంటున్నారు. అసత్య ప్రచారాలు అసత్యంగానే ఉంటాయి. సత్యం మాత్రమే నిలబడుతుంది. అందుకోసం నేను అర్జెంటుగా కోట్లు ఖర్చుపెట్టి పేపర్లు, ఛానల్స్ ఎక్కడ పెట్టను. స్వతంత్ర పోరాటం సమయంలో అంబేద్కర్ గారి దగ్గర, గాంధీజీ దగ్గర ఏం ఛానల్స్ ఉన్నాయి. బ్రిటీష్ వారి దగ్గర ఉన్నంత సంపద, వ్యవస్థ కూడా లేదు. అంతా ఎవరి పని వారు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. మనకి సోషల్ మీడియా ఉంది, కొందరి మద్దతు ఉంది, ముందు ముందు పేపర్లు మనల్ని నమ్ముతాయి. వర్గాలు, గ్రూపులు లేకుండా మనం వంద మంది ఒక్క చోట ఉంటే చాలు.

•మీ కోసం నేనున్నాను 

జనసేన పార్టీకి పటిష్టమైన ముడి సరుకు జనసైనికుల రూపంలో ఉంది.   పార్టీ ఆశయాలకు అండగా ఉండేవారిని నియోజకవర్గానికి ఆరు నుంచి 30 మందిని గుర్తించి ఒక కూటమిగా చేస్తాం. పార్టీ ఆశయాలు ముందుకు వెళ్తున్నాయా లేదా అన్న అంశాలు నేరుగా నా దగ్గరకు చేరాలి. అలాంటి ప్రణాళిక నా దగ్గర ఉంది. అందుకు నిస్వార్ధంగా ఉండే వ్యక్తుల అవసరం ఉంది. వారి ఎంపికను తాడేపల్లిగూడెం నుంచే మొదలుపెడతాం. మండల స్థాయి నుంచి జనసేన పార్టీ నాయకులు నాకు తెలియాలి. అందులో భాగంగానే క్రియాశీలక కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశాం. భవిష్యత్తులో మండల స్థాయిలో కూడా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయాలి. ఆయా నియోజకవర్గాల్లోనే వాటిని నిర్వహించాలని భావిస్తున్నాం. దశలవారీగా దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్దాం.

పోలీసుల వేధింపుల ఎక్కువయ్యాయి అంటున్నారు. పోలీస్ వ్యవస్థ రాజకీయ నాయకులు చేతిలో ఆయుధం లాంటిది. వారు ఏం చెబితే అది చేస్తుంది. మనం పోలీసులను కాదు వారికి ఆదేశాలు ఇచ్చే వైసీపీని ఢీ కొడదాం. పోలీసు వ్యవస్థ స్థాయి దాటి ముందుకు వెళ్తే ఖచ్చితంగా నేను వస్తాను. ముందుగా మీ వంతు పోరాటం మీరు చేయండి, మీ వల్ల కానప్పుడు నేను స్వయంగా వస్తాను. ఆ భరోసా నేను ఇవ్వగలను. తప్పదు అనుకుంటే మీ కోసం వీధి పోరాటాలు చేస్తాను” అన్నారు. ఈ సమావేశంలో తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఇంచార్జ్ బొలిశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు.

More Press Releases