ఆడబిడ్డకు న్యాయం చేయలేని అధికారం ఎందుకు..? పవన్ కల్యాణ్

Related image

•సుగాలి ప్రీతి కేసు సీబీఐకి అప్పగించాలి 

•లేని పక్షంలో నిరాహార దీక్షకు దిగుతా

•కట్టమంచి రామలింగారెడ్డి స్కూలుపై సత్వర విచారణ జరగాలి 

•2018తో పోల్చుకుంటే బాలికలపై అత్యాచారాలు కర్నూలు జిల్లాలోనే 10 శాతం పెరిగాయి 

•కర్నూలులో హైకోర్టుకు జనసేన వ్యతిరేకం కాదు.. సీమ సమగ్రాభివృద్దే మా లక్ష్యం 

•ఇస్లాం పాటించే భారతీయులను ఈ దేశం నుంచి ఎవరూ వేరు చేయలేరు

•జగన్ సీఎం అయినంత మాత్రాన ఏమైనా అద్భుతాలు జరిగాయా? 

•కర్నూలు బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  

ఆడబిడ్డకు న్యాయం చేయలేనప్పుడు అధికారం ఉండి ఏం ప్రయోజనమని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. న్యాయం చేయడానికి జ్యుడిషియల్ క్యాపిటల్ ను కర్నూలులో పెడతామంటుంది వైసీపీ ప్రభుత్వం... సుగాలి ప్రీతికి న్యాయం చేయలేనప్పుడు జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టి ప్రయోజనం ఏమిటన్నారు. రాయలసీమ గడ్డ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.. సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించకపోతే ఇదే ప్రాంతంలో ఒక రోజు నిరాహార దీక్షకు కూర్చుంటానని ప్రకటించారు. సుగాలి ప్రీతి కేసులో నిందితులను శిక్షించాలంటూ బుధవారం సాయంత్రం కర్నూలు రాజ్ విహార్ సర్కిల్ నుంచి కోట్ల సర్కిల్ వరకూ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ర్యాలీ చేపట్టారు.

అనంతరం కోట్ల సర్కిల్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో  ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “జనసేన పార్టీ ఆవిర్భావానికి మూల కారణాల్లో ఒకటి - చట్టాలు బలహీనులపై బలంగా పనిచేసి... బలవంతులపై బలహీనంగా పని చేస్తుండటం. సుగాలి ప్రీతి విషయంలో కూడా ఇదే జరిగింది. పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం చేసి హత్య చేసి చంపేశారని చెబుతుంటే ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. చేతిలో రిపోర్టులు పట్టుకొని నాయకులు, అధికారులు చుట్టు దివ్యాంగురాలైన ఆమె తల్లి శ్రీమతి పార్వతి గారు తిరుగుతున్నా ఎవరి మనసూ కరగలేదు. నా బిడ్డ ఎలాగు చనిపోయింది ఇలాంటి దుస్థితి మరే బిడ్డకు రాకూడదనే పోరాటం చేస్తున్నానని ఆమె చెప్పిన మాటలు నన్ను కదిలించాయి.  

•సుగాలి ప్రీతి గురించి జగన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడరు..?

పక్క రాష్ట్రమైన తెలంగాణలో దిశ దుర్ఘటన జరిగితే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చొని చట్టాలు చేశారు. రాయలసీమ ఆడ బిడ్డను అమానుషంగా అత్యాచారం చేసి హత్య చేస్తే జగన్ రెడ్డి గారు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు. దిశ గురించి మాట్లాడిన మీరు సుగాలి ప్రీతి గురించి ఎందుకు మాట్లాడరు..? తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పులను రివర్స్ టెండరింగ్ పేరు చెప్పి ఎండగడుతున్నప్పుడు... వారి హయాంలో న్యాయం జరగని సుగాలి ప్రీతి తల్లిదండ్రులకు న్యాయం ఎందుకు చేయలేకపోతున్నారు..? సుగాలి ప్రీతికి న్యాయం జరిగినట్లయితే ఇవాళ నేను రోడ్ల మీదకు రావాల్సిన అవసరం వచ్చేది కాదు.

 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నాయకులు ఉన్నారు. బలహీన వర్గాలకు చెందిన ఆడబిడ్డకు అన్యాయం జరిగితే మాత్రం ఒక్కరు కూడా న్యాయం చేయలేకపోయారు. సుగాలి ప్రీతికి న్యాయం చేయాలని, ఆడబిడ్డలకు అన్యాయం జరగకుండా కఠిన చట్టాలు తేవాల్సిన అవసరం ఉందని దిశ ఘటన జరగక ముందే రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పాను. కానీ వారిలో చలనం లేదు. సుగాలి ప్రీతి విషయంలో ఏం జరిగిందో... ఎలా జరిగిందో రాష్ట్రం మొత్తం తెలియాల్సిన అవసరం ఉంది. 

•మానవ హక్కుల కమిషన్ ఆశ్రయిస్తాం

సుగాలి ప్రీతిపై అత్యాచారం జరిగి హత్య చేసింది విద్యాసంస్థలో. విద్యనభ్యసించాల్సిన చోట ఇలాంటి దారుణానికి గురైతే ఎవరు రక్షిస్తారు. ఇలాంటి కీచకులకు రాజకీయ నాయకులు అండగా ఉంటే బాధితులు తమ వేదనను ఎవరికి చెప్పుకొంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరచి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించకపోతే మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించి జరిగిన అన్యాయాన్ని వివరిస్తాను.  

•సత్వర విచారణ జరగాలి

సుగాలి ప్రీతి విషయంలో పోలీసు యంత్రాంగాన్ని తప్పుబట్టడం లేదు. రాజకీయ నాయకులను తప్పుబడుతున్నాను. పోలీసు వ్యవస్థను రాజకీయ నాయకులు ఎలా నడిపిస్తారో అలా నడుస్తుంది. పోలీసు ఉన్నతాధికారులకు న్యాయం చేయాలనే ఉంటుంది కానీ, రాజకీయ బాసుల వల్ల చేయలేకపోతున్నారు. కొన్ని రెసిడెన్షియల్ స్కూళ్లలో అత్యాచారాలు జరుగుతున్నాయి... మైనార్టీ తీరని బాలికలను కొంతమంది స్థానిక నాయకులు వినియోగవస్తువులుగా వాడుతున్నారని నా దృష్టికి వచ్చింది. ముఖ్యంగా కర్నూలు చుట్టపక్కల ప్రాంతాల్లో బాలికలపై అత్యాచారాలు 2018తో పోల్చుకుంటే 10 శాతం పెరిగాయి. ఈ ప్రాంతంలో దిశ పోలీస్ స్టేషన్ పెట్టండి. చట్టాలను బలంగా ప్రయోగించండి. అయితే ఆడబిడ్డల మానప్రాణాలు కాపాడుకోలేనప్పుడు ఎన్ని చట్టాలు చేసిన నిష్ప్రయోజనమే. కట్టమంచి రామలింగారెడ్డి స్కూలులో కూడా బాలికలు లైగింక వేధింపులకు గురవుతున్నారని నా దృష్టికి వచ్చింది. దీనిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు సత్వర విచారణ జరిపించి నిందితులను కఠినంగా శిక్షించాలి. తప్పు ఎవరు చేసినా శిక్షపడాల్సిందే. సుగాలి ప్రీతి కుటుంబానికి ఇవాళ మనం అండగా నిలబడకపోతే రేపు మన ఇంట్లో కూడా ఇలా జరిగితే ఎవరు మద్దతుగా రారు. దిశ ఘటన జరిగినప్పుడు యువత, మహిళలు ఎలా అయితే రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారో.. సుగాలి ప్రీతి విషయంలో కూడా అలాగే చేయాలి. 

•సీఏఏపై ప్రతిపక్షాలది దుష్ర్పచారం 

సీఏఏ చట్టం ద్వారా ఇస్లాం పాటించే భారతీయులను ఇబ్బందిపెట్టాలని భారతీయ జనతా పార్టీ చూస్తోందని దుష్ప్రచారం జరుగుతోంది. అందులో ఎటువంటి వాస్తవం లేదు. భారత్ సెక్యులర్ దేశం. ఈ నేలపై అన్ని కులాలు, అన్ని మతాలు సమానమే. భారతదేశం నుంచి ముస్లింలను ఎవరు వేరు చేయలేరు. ఏ మత పెద్దలు చెప్పినా నమ్మకండి. అబ్దుల్ కలాం గారిని దేశ ప్రథమ పౌరుడిగా చూశాం. భారతదేశంలో కోట్లాదిమంది అభిమానించే క్రికెట్ కు అజారుద్దీన్ ను కెప్టెన్ గా చూశాం. అంత గొప్పది భారతదేశ సంస్కృతి. 

•సీఎం అయినంత మాత్రాన అద్భుతాలు జరగవు 

అధికారం మీద ఆశతో జనసేన పార్టీ పెట్టలేదు. అన్యాయం జరిగిన ఆడబిడ్డలకు న్యాయం చేయడానికి, నీటి కొరత లేని కర్నూలును చూడటానికి పార్టీ పెట్టాను. ముఖ్యమంత్రి అయితేనే అద్భుతాలు జరుగుతాయని అనుకోను. జగన్ సీఎం అయ్యారు అద్భుతాలు ఏమైనా జరిగాయా..?. పెట్టుబడులు వెనక్కి వెళ్లిపోతున్నాయి. భావితరాల భవిష్యత్తు కోసం ఓటమి వచ్చినా, విజయం వరించిన పని చేసుకుంటూ వెళ్తాను. రాయలసీమలో జనసేన పార్టీకి బలమైన నాయకులు లేరు అంటారు. నేను పార్టీ పెట్టినప్పుడే చెప్పాను సామాన్యుల నుంచే నాయకులను తయారు చేస్తానని. ఇవాళ నా దగ్గరకు సుగాలి ప్రీతి విషయం తీసుకొచ్చింది కూడా సామాన్య జన సైనికులే. ప్రజలు తమ మోచేతి నీళ్లు తాగే బతకాలని ఇక్కడ నాయకులు కోరుకుంటారు. అలాంటి నాయకత్వం జనసేన పార్టీ కి అవసరం లేదు. ప్రజలతో మమేకమైన నాయకత్వాన్ని కోరుకుంటాను.

రాయలసీమ నుంచి ఆరుగురు ముఖ్యమంత్రులు వచ్చారు. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరగవ్వలేదు. పరిశ్రమలు రాలేదు. 10, 15 ఎకరాల భూమి ఉన్న రైతు కూడా వలసలు పోయే పరిస్థితి దాపురించింది. హంద్రీనీవా కాలువ ఈ ప్రాంతం మీద నుంచే వెళ్తున్న ఇక్కడ పొలాలకు నీరు అందడం లేదు. కర్నూలు, ఇతర ప్రాంతాల ప్రజలకు పది రోజులకు ఒకసారి నీళ్ళు ఇస్తున్నారు. జనసేన పార్టీ ఉన్నదే ప్రజల కష్టాలు తీర్చడం కోసం. రాబోయే రోజుల్లో జనసేనను గెలిపించుకుంటే ప్రజలకు అండగా ఉంటే నాయకత్వం తీసుకుంటాం. 

జనసేన పార్టీ హైకోర్టుకు వ్యతిరేకం కాదు. హైకోర్టుతో పాటు ఈ ప్రాంతానికి పరిశ్రమలు రావాలి, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాలి. రైతుల వలసలు ఆగిపోవాలి. మొత్తంగా సమగ్ర రాయలసీమ అభివృద్ధి జరగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాన”ని అన్నారు. 

•స్పందించిన మొదటి నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారే: పార్వతీ బాయి

సుగాలి ప్రీతి తల్లి శ్రీమతి పార్వతి బాయి మాట్లాడుతూ “2017 నుంచి నా కుమార్తెకు జరిగిన అన్యాయంపై పోరాటం చేస్తున్నాను. ఈ సమస్య మీద మొట్టమొదట స్పందించిన నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారే. ఆయనకు నా తరఫున, నా కుటుంబం తరఫున రుణపడి ఉంటాను. నా కూతురిని అత్యాచారం చేసి హత్య చేశారు. ఆత్మహత్యగా చిత్రీకరించాలని చూశారు. దీనిపై పోరాటం చేస్తే తెలుగుదేశం ప్రభుత్వం కానీ, ఇప్పటి వైసీపీ ప్రభుత్వం కానీ పట్టించుకోలేదు.  పోస్టుమార్టం రిపోర్టులో అత్యాచారం చేసి హత్య చేశారని క్లియర్ గా ఉంది. కేసును తప్పుదోవ పట్టించేందుకు కొందరు అధికారులు రూ.30 లక్షలు తీసుకున్నారు. నిందితులతో  కుమ్మక్కై చార్జ్ షీటులో ఆత్మహత్య అని రాశారు. ఇదేంటి అని అడిగినందుకు మమ్మల్ని పోలీసుస్టేషన్ లో పెట్టారు. ఎవరినైనా ఎదిరించే ధైర్యం, ప్రశ్నించే దమ్ము ఉందన్న నమ్మకంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిశాను. మా గోడు చెప్పుకున్నా. ఆడపిల్లకు అన్యాయం జరిగితే ఎదిరించే ఒకే ఒక్క నాయకుడు ఆయన. 

కర్నూలు జిల్లా ఇంచార్జ్ మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారిని కలిశాను. మొదటిసారి బాగానే మాట్లాడారు. రెండోసారి మాత్రం చీప్ పీపుల్ అంటూ తిట్టారు. మరోసారి కలిసినప్పుడు  నీ కూతురు హత్య మా హయాంలో జరిగిందా అని ప్రశ్నించారు.  నిందితులు అధికార పక్షానికి లంచాలు ఇచ్చి మభ్యపెట్టారు. చట్టాలు ఉన్నవారికే చుట్టాలు అయిపోతున్నాయి. ఎన్నో పోరాటాలు చేసినా సమస్యను కర్నూలు మొత్తానికీ కూడా నా బాధ చెప్పుకోలేకపోయాను. ఒక్కసారి శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్తే దేశం యావత్తు గుండెల్లో పెట్టుకుని పోరాటం చేస్తున్నారు” అని అన్నారు.

More Press Releases