KCR: సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయండి: సీఎం..
Add ap7am to your home Screen

సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయండి: సీఎం కేసీఆర్ కి అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి

సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయండి: సీఎం కేసీఆర్ కి అక్బరుద్దీన్ ఓవైసీ విజ్ఞప్తి
హైదరాబాద్ పాతబస్తీలోని లాల్ దర్వాజలో ఉన్న సింహవాహిని మహంకాళి దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని ఎంఐఎం శాసనసభా పక్ష నాయకడు, చాంద్రాయణ గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావును కోరారు. ప్రగతి భవన్ లో ఆదివారం ముఖ్యమంత్రిని కలిసిన ఆయన ఈ మేరకు విజ్ఞాపన పత్రం అందచేశారు. ప్రతీ ఏటా ఈ దేవాలయంలో నిర్వహించే బోనాలు దేశ వ్యాప్తంగా లాల్ దర్వాజ బోనాలుగా ప్రసిద్ధి చెందాయని ఆయన గుర్తు చేశారు. దేవాలయానికి ఇంతటి ప్రసిద్ధి ఉన్నప్పటికీ చాలినంత స్థలం లేకపోవడం, దేవాలయ ప్రాంగణం అభివృద్ధికి నోచుకోకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడుతున్నారని అక్చరుద్దీన్ సీఎంకు తెలియజేశారు.

లాల్ దర్వాజ మహంకాళి దేవాలయానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. బోనాల పండుగ సందర్భంగా లక్షలాది మంది భక్తులు ఈ గుడిలో పూజలు చేసి, బోనాలు సమర్పిస్తారన్నారు. కానీ, ఈ గుడి ప్రాంగణం కేవలం వంద గజాల స్థలంలోనే ఉంది. ఇంత తక్కువ స్థలం ఉండడం వల్ల లక్షలాదిగా వచ్చే భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతుందని ఆయన సీఎంకు తెలియజేశారు. ప్రాంగణంతో పాటు దేవాలయాన్ని కూడా అభివృద్ధి చేయాల్సి ఉందని ఆయన తెలిపారు. రూ.10 కోట్ల వ్యయంతో దేవాలయాన్ని విస్తరించి, అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. దేవాలయ విస్తరణ వల్ల దీనికి ఆనుకుని ఉన్న వారు ఆస్తులు కోల్పోయే అవకాశం ఉంది. అందుకు ప్రత్యామ్నయంగా వారికి జీహెచ్ఎంసీ ఆధీనంలో ఉన్న ఫరీద్ మార్కెట్ ఆవరణలో 800 గజాల స్థలం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. గతంలో తెలంగాణ రాష్ట్రం.. బంగారు తెలంగాణ కావాలని దీవించాలని కోరుతూ ఈ దేవాలయంలో అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా బంగారు బోనం సమర్పించిన విషయాన్ని అక్బర్ గుర్తు చేశారు.

పాతబస్తీలోని అఫ్జల్ గంజ్ మస్జీద్ మరమ్మతుల కోసం 3 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని అక్బరుద్దీన్ సీఎం కేసీఆర్ ను కోరారు. ఎంతో మంది ముస్లింలు ఈ మసీదులో నిత్యం ప్రార్థనలు చేస్తారనీ, మరమ్మతులకు నోచుకోకపోవడం వల్ల మసీదులో ప్రార్థనలకు ఇబ్బంది కలుగుతున్నదని ఆయన సిఎం దృష్టికి తెచ్చారు.

అక్బరుద్దీన్ విజ్ఞప్తికి ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. మహంకాళి దేవాలయ అభివృద్ధికి, అఫ్జల్ గంజ్ మసీదు మరమ్మతులకు వెంటనే నిధులు విడుదల చేస్తున్నట్లు సీఎం హామీ ఇచ్చారు. ఈ రెండు ప్రార్థనా మందిరాల అభివృద్ధికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు. 
KCR
Akbaruddin Owaisi
Simhavahini Mahankali Temple
Hyderabad
Telangana

Watch Today's Deals on Amazon

More Press News