15 ఏళ్ల యువ‌కుడికి అరుదైన స‌మ‌స్య; సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌తో స‌రిచేసిన అమోర్ వైద్యులు

Related image

* లోప‌ల‌కు నొక్కుకుపోయిన కుడివైపు ఎద‌భాగం

* ఊపిరితిత్తులు ప‌నిచేయ‌క‌.. న‌డిస్తే ఆయాసం

* సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌తో స‌రిచేసిన అమోర్ వైద్యులు

* 9 గంట‌ల పాటు సుదీర్ఘంగా ఆప‌రేష‌న్‌

 హైద‌రాబాద్, ఏప్రిల్ 12, 2024: పురుషులు అంద‌రికీ ఎద భాగం స‌మ‌త‌లంగా ఉంటుంది. కానీ 15 ఏళ్ల యువ‌కుడికి పుట్టుక‌తోనే ఒక అవ‌క‌రం ఏర్ప‌డింది. కుడివైపు ఎద భాగం బాగా లోతుకు నొక్కుకుపోయిన‌ట్లు ఉంది. దీనివ‌ల్ల అటువైపు ఉండే ఊపిరితిత్తులు కూడా లోప‌ల‌కు నొక్కుకుపోయి, అత‌డికి స‌రిగా ఊపిరి అందేది కాదు. కొంత‌దూరం న‌డిచినా విప‌రీత‌మైన ఆయాసం వ‌చ్చేది. దీంతో అత‌డు బాగా ఇబ్బంది ప‌డేవాడు. ప‌లు ఆస్ప‌త్రుల‌కు తిరిగినా ఇందులోని సంక్లిష్ట‌త కార‌ణంగా ఎవ‌రూ కేసు తీసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌లేదు. చివ‌ర‌కు న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన అమోర్ సూప‌ర్ స్పెషాలిటీ హాస్పిట‌ల్ అండ్ అమోర్ కేన్స‌ర్ సెంట‌ర్‌కు ఆ యువ‌కుడు వ‌చ్చాడు. అత‌డిని నిశితంగా ప‌రీక్షించి, శ‌స్త్రచికిత్స చేసిన ఆస్ప‌త్రి ఎండీ డాక్ట‌ర్ కిశోర్ బి. రెడ్డి ఇందుకు సంబంధించిన వివ‌రాలు తెలిపారు.

 “ఆ యువ‌కుడికి పుట్టుక‌తోనే స‌మ‌స్య ఉంది. ఎద భాగం లోప‌లకు నొక్కుకుపోయి ఉండ‌టం వ‌ల్ల ఊపిరితిత్తులు కూడా స‌రిగా ప‌నిచేయ‌ని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీన్ని వైద్య ప‌రిభాష‌లో పెక్ట‌స్ ఎక్స్‌క‌వాట‌మ్ అంటారు. ఈ స‌మ‌స్య ఉన్న‌వారికి ఊపిరితిత్తులు కూడా బాగా లోప‌ల‌కు నొక్కుకుపోతాయి. సాధార‌ణంగా మ‌నం ఊపిరి పీల్చుకునేట‌ప్పుడు ఎద భాగం ముందుకు వ‌స్తుంది. ఊపిరి విడిచిపెట్టేట‌ప్పుడు అది లోప‌ల‌కు వెళ్తుంది. కానీ, ఈ కేసులో అలా కాక‌పోవ‌డం వ‌ల్ల అత‌డికి ఊపిరి కూడా స‌రిగా అందేది కాదు. ఇందుకు చాలా సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స చేయాల్సి వ‌చ్చింది. ముందుగా అత‌డి ప‌క్క‌టెముక‌ల‌ను క‌త్తిరించి, లోప‌ల అవ‌స‌ర‌మైన చోట మెట‌ల్ బార్లు, రిబ్ ప్లేట్లు పెట్టాం. ఈ మెట‌ల్ బార్ల‌ను ప‌క్క‌టెముక‌ల్లో రెండోదాని కింద‌, ఐదో ప‌క్క‌టెముక కింద పెట్టాల్సి వ‌చ్చింది. రెండు రిబ్ ప్లేట్ల‌ను కూడా పెట్టి, వాటిని ప‌క్క‌టెముక‌ల‌కు స్క్రూల‌తో బిగించాం. రెండు ప్ర‌ధాన ఫ్లాప్ క‌వ‌ర్లు కూడా పెట్ట‌డం వ‌ల్ల ఎద భాగం మ‌ళ్లీ సాధార‌ణ స్థితికి చేరుకుంది. అనంత‌రం చెస్ట్ డ్రెయిన్ కూడా పెట్టాం” అని డాక్ట‌ర్ కిశోర్ బి.రెడ్డి వివ‌రించారు.

ఈ మొత్తం శ‌స్త్రచికిత్స‌కు దాదాపు 9 గంట‌ల‌కుపైగా స‌మ‌యం ప‌ట్టింది. ఇందులో ప్ర‌ధానంగా కార్డియోథొరాసిక్, వాస్క్యుల‌ర్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ కె. అరుణ్‌, ప్లాస్టిక్ స‌ర్జ‌న్ డాక్ట‌ర్ అభినంద‌న్, ఐసీయూ స్పెష‌లిస్టు డాక్ట‌ర్ జె.శ్రీ‌నివాస్‌, ఎమ‌ర్జెన్సీ వైద్య నిపుణుడు డాక్ట‌ర్ జ‌య‌శేఖ‌ర్, అనెస్థ‌టిస్టులు డాక్ట‌ర్ ప్ర‌త్యూష‌, డాక్ట‌ర్ మ‌హేష్‌, ఇంకా రీహాబిలిటేష‌న్ బృందం ఎంతో క‌ష్ట‌ప‌డ్డారు. ప్ర‌త్యేక‌మైన ఆప‌రేష‌న్ థియేట‌ర్ సిబ్బంది, ఐసీయూ సిబ్బంది, న‌ర్సులు సైతం అత‌డు కోలుకోవ‌డానికి స‌హాప‌డ్డారు. వీరంద‌రి సమిష్టి నైపుణ్యం, నిబ‌ద్ధ‌త వ‌ల్లే శ‌స్త్రచికిత్స పూర్తిగా విజ‌య‌వంతం కావ‌డం, రోగి వేగంగా కోలుకోవ‌డం సాధ్య‌మైంది. 

శ‌స్త్రచికిత్స నుంచి కోలుకున్న త‌ర్వాత రోగికి ప‌ల్మ‌న‌రీ ఫంక్ష‌న్ టెస్టు చేయ‌గా, పూర్తి సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాలు వ‌చ్చాయి. అత‌డు ఎలాంటి ఇబ్బంది లేకుండా న‌డ‌వ‌డంతో పాటు త‌న ప‌నులన్నీ చేసుకోగ‌లుగుతున్నాడు.
         

More Press Releases