శిక్ష‌ణార్థుల‌కు యూపీఎస్సీ మాజీ ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ డీపీ అగ‌ర్వాల్ సూచ‌న

Related image

హైద‌రాబాద్, మార్చి 24, 2024: యూపీఎస్సీ ప‌రీక్ష‌ల‌కు సిద్ద‌మ‌వుతూ, శిక్ష‌ణ పొందుతున్న విద్యార్థులంతా నిజాయితీ, చిత్త‌శుద్ధి, స‌మైక్య భావాల‌ను పెంపొందించుకోవాల‌ని.. అలాగే ఏమాత్రం ఒత్తిడి లేకుండా నేర్చుకోవ‌డాన్ని ఆస్వాదించాల‌ని యూపీఎస్సీ మాజీ ఛైర్మ‌న్ ప్రొఫెస‌ర్ డీపీ అగ‌ర్వాల్ సూచించారు. కృష్ణ‌ప్ర‌దీప్ ట్వంటీఫ‌స్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడ‌మీకి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి, విద్యార్థుల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేశారు.  శిక్ష‌ణ‌లో చెప్పే అంశాల‌ను మ‌న‌సుకు ఎక్కించుకుని, ఆస్వాదిస్తూ నేర్చుకోవాలి త‌ప్ప మూస‌ప‌ద్ధ‌తిలో క‌ష్ట‌ప‌డ‌టం వ‌ల్ల అంత మంచి ఫ‌లితాలు రావ‌ని ప్రొఫెస‌ర్ అగ‌ర్వాల్ అన్నారు. ముందుగా, విద్యార్థులు నేరుగా క‌ళాశాల‌ల నుంచే వ‌చ్చారా, లేదా ఇంత‌కుముందు ఏదైనా పోటీ ప‌రీక్ష‌కు హాజ‌ర‌య్యారా అని ప్ర‌శ్నించారు. యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌ల‌కు, పోటీ ప‌రీక్ష‌ల‌కు కొంత తేడా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు. సాధార‌ణంగా యూనివ‌ర్సిటీ ప‌రీక్ష‌ల‌లో అయితే, కేవ‌లం ఆ స‌బ్జెక్టులో ప‌రిజ్ఞానాన్ని మాత్ర‌మే చూస్తార‌ని, అదే పోటీ ప‌రీక్ష‌ల‌లో అయితే మ‌న వ్య‌క్తిత్వం మొత్తాన్ని అంచ‌నా వేస్తార‌ని అన్నారు. ఆ విధంగా పోటీ ప‌రీక్ష‌ల‌కు సిద్ధ‌ప‌డేవారు అది ఏ ప‌రీక్ష అయినా, త‌మ వ్య‌క్తిత్వాన్ని రూపొందించుకోవాల‌ని సూచించారు. దాదాపు రెండు గంట‌ల పాటు ఆయ‌న విద్యార్థుల‌తో ప్ర‌శ్నోత్త‌రాల కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు.

 ప్రొఫెస‌ర్ అగ‌ర్వాల్ గ‌తంలో యూపీఎస్సీలో అనేక సంస్క‌ర‌ణ‌ల‌కు ఆద్యుడ‌ని, ఆయ‌న చెప్పిన విష‌యాల‌ను సువ‌ర్ణాక్ష‌రాలుగా భావించి విద్యార్థులు ఆయ‌న నుంచి స్ఫూర్తి పొందాల‌ని అకాడ‌మీ డైరెక్ట‌ర్లు కృష్ణ ప్ర‌దీప్‌, డాక్ట‌ర్ భ‌వానీశంక‌ర్ సూచించారు. సుమారు 200 మందికి పైగా విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ప్ర‌శ్నోత్త‌రాల అనంత‌రం అకాడ‌మీ నిర్వాహ‌కులు ప్రొఫెస‌ర్ డీపీ అగ‌ర్వాల్‌ను ఘ‌నంగా స‌త్క‌రించారు.  ఈ సంద‌ర్భంగా ప్రొఫెస‌ర్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ, ఇలాంటి విద్యార్థుల‌ను చూసిన‌ప్పుడ‌ల్లా త‌న‌కు మ‌ళ్లీ త‌న య‌వ్వ‌న‌ద‌శ‌, విద్యార్థిగా ఉన్న‌ప్ప‌టి రోజులు గుర్తుకొస్తాయ‌ని, ఇప్ప‌టి పిల్ల‌ల‌కు అప్ప‌టికంటే అనేక అవ‌కాశాలు ఉన్నందున వాటిని స‌ద్వినియోగం చేసుకుంటూ జీవితంలో మ‌రింత ఉన్న‌త‌స్థానాల‌కు ఎద‌గాల‌ని ఆకాంక్షించారు.

యూపీఎస్సీ ప‌రీక్ష‌ల్లో ఉత్తీర్ణ‌త సాధించి అఖిల‌భార‌త స‌ర్వీసుల‌కు వెళ్లాల‌ని ఆకాంక్ష ఉన్న విద్యార్థుల‌కు ఇంత మంచి శిక్ష‌ణ అవ‌కాశాలు క‌ల్పిస్తున్నందుకు కృష్ణ‌ప్ర‌దీప్ ట్వంటీఫ‌స్ట్ సెంచరీ ఐఏఎస్ అకాడ‌మీ డైరెక్ట‌ర్లు కృష్ణ‌ప్ర‌దీప్‌, డాక్ట‌ర్ భ‌వానీశంక‌ర్‌ల‌ను ప్రొఫెస‌ర్ అగ‌ర్వాల్ అభినందించారు. యూపీఎస్సీ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంట‌ర్వ్యూ అనే మూడు ద‌శ‌ల‌ను దాటాలంటే ఏం చేయాలి, ఏం చేయ‌కూడ‌దు అనే విష‌యాల‌ను కూలంక‌షంగా చెప్ప‌డం చాలా ముఖ్య‌మ‌ని, ఆ విష‌యంలో ఈ అకాడ‌మీ విజ‌య‌వంతంగా ముందుకెళ్తోంద‌ని అన్నారు.

More Press Releases