మెద‌డు గాయాలతో ఏటా 1.5 ల‌క్ష‌ల మంది మృతి

Related image

* మ‌రో 5 ల‌క్ష‌ల మందికి తీవ్ర గాయాలు

* ర‌హ‌దారి భ‌ద్ర‌త‌పై అవగాహ‌న అవ‌స‌రం

* బ్రెయిన్ అండ్ స్పైన్ సొసైటీ ఆధ్వ‌ర్యంలో అవ‌గాహ‌న ప‌రుగు

* పాల్గొన్న ట్రాఫిక్ డీసీపీ, ప‌లువురు వైద్య ప్ర‌ముఖులు, బ్యాడ్మింట‌న్ స్టార్ సాయిప్ర‌ణీత్‌

 
హైద‌రాబాద్, మార్చి 10, 2024: రోడ్డు ప్ర‌మాదాల్లో మెద‌డుకు గాయాలు కావ‌డం వ‌ల్ల ప్ర‌తియేటా ల‌క్ష‌న్న‌ర మ‌ర‌ణాలు సంభ‌విస్తుండ‌గా, క‌నీసం మ‌రో 5 ల‌క్ష‌ల మందికి పైగా తీవ్రంగా గాయ‌ప‌డి జీవితాంతం ఇబ్బందులు ప‌డుతున్నార‌ని ప‌లువురు ప్ర‌ముఖులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. త‌ల‌కు అయ్యే గాయాల‌పై అవ‌గాహ‌న కోసం ఆదివారం న‌గ‌రంలోని నెక్లెస్ రోడ్డులో గ‌ల సంజీవ‌య్య పార్కు నుంచి ఒక అవ‌గాహ‌న ప‌రుగు నిర్వ‌హించారు. ఉద‌యం 7 గంట‌ల‌కు ప్రారంభ‌మైన ఈ కార్య‌క్ర‌మం 8.30 వ‌ర‌కు కొన‌సాగింది. నిమ్స్ ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ ఎన్. బీర‌ప్ప‌, ట్రాఫిక్ డీసీపీ ఎన్. అశోక్ కుమార్‌, బ్రెయిన్ అండ్ స్పైన్ సొసైటీ ఆఫ్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు డాక్ట‌ర్ కేవీఆర్ శాస్త్రి, కార్య‌ద‌ర్శి ప్రొఫెస‌ర్ మాన‌స్ పాణిగ్రాహి, నిమ్స్ ఆస్ప‌త్రి న్యూరోస‌ర్జ‌రీ విభాగాధిప‌తి ప్రొఫెస‌ర్ సుచంద భ‌ట్టాచార్జీ, భార‌త బ్యాడ్మింట‌న్ క్రీడాకారుడు, అర్జున అవార్డు గ్ర‌హీత బి. సాయిప్ర‌ణీత్, ఇంకా పలువురు న్యూరోస‌ర్జ‌న్లు, న్యూరోసైన్స్ నిపుణులు త‌దిత‌రులు ఈ ప‌రుగులో పాల్గొని మెద‌డుకు అయ్యే గాయాల‌పై అవ‌గాహ‌న క‌ల్పించారు.

అంత‌కుముందు జ‌రిగిన కార్య‌క్ర‌మంలో వైద్య నిపుణులు, ట్రాఫిక్ డీసీపీ, సాయిప్ర‌ణీత్ త‌దిత‌రులంతా న‌గ‌రంలోను, దేశ‌వ్యాప్తంగా త‌ర‌చు జ‌రుగుతున్న రోడ్డు ప్ర‌మాదాల‌పై తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ప్ర‌జ‌ల‌కు ప్ర‌మాదాల నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌లు తెలియ‌జేయ‌డంతో పాటు, ఏదైనా ప్ర‌మాదం సంభ‌విస్తే వెంట‌నే ఏం చేయాల‌న్న విష‌యాల‌నూ తెలియ‌బ‌రిచారు. మెద‌డుకు గాయ‌మైతే ఏం జ‌రుగుతుంది, ఎంత తొంద‌ర‌గా ఆస్ప‌త్రికి తీసుకెళ్లాలి, ఎలాంటి ల‌క్ష‌ణాలుంటే వెంట‌నే జాగ్ర‌త్త‌ప‌డాలి అనే వివ‌రాలు తెలిపారు. కొన్ని సందర్భాల‌లో పైకి ఎలాంటి గాయం క‌నిపించ‌క‌పోయినా, మెదడు లోప‌లి భాగాలు గాయ‌ప‌డొచ్చ‌ని, అలాంటివి పైకి గుర్తించ‌లేక‌పోయినా ల‌క్ష‌ణాలను గ్ర‌హించి వెంట‌నే వైద్య‌స‌హాయం అందించాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా ప‌లువురు ప్ర‌జ‌లు అడిగిన వివిధ సందేహాల‌ను డాక్ట‌ర్ కేవీఆర్ శాస్త్రి, ప్రొఫెస‌ర్ మాన‌స్ పాణిగ్రాహి, ప్రొఫెస‌ర్ సుచంద భ‌ట్టాచార్జీ త‌దిత‌రులు నివృత్తి చేశారు. 

 
ఈ సంద‌ర్భంగా హాజ‌రైన ప్ర‌ముఖులు మాట్లాడుతూ, “భార‌త‌దేశంలో మ‌ర‌ణాల‌కు రోడ్డు ప్ర‌మాదాలు, అందులోనూ మెద‌డుకు అయ్యే గాయాలే ప్ర‌ధాన కార‌ణాల‌వుతున్నాయి. ప్ర‌తియేటా ఈ ప్ర‌మాదాల వ‌ల్ల దేశంలో ఏడాదికి ల‌క్ష‌న్న‌ర మంది ప్రాణాలు కోల్పోతుండ‌గా, మ‌రో 5 ల‌క్ష‌ల మంది తీవ్ర గాయాల పాల‌వుతున్నారు. త‌ల‌కు అయ్యే గాయాల్లో 60% వాటికి రోడ్డు ప్ర‌మాదాలే కార‌ణం, అందులోనూ ద్విచ‌క్ర వాహ‌నాల మీద వెళ్లేట‌ప్పుడు అయ్యేవే ఎక్కువ‌. 1970లో ఒక కిలోమీట‌ర‌కు 1.14 వాహ‌నాలే ఉంటే, 2018 నాటికి ఆ సంఖ్య ఏకంగా 43కు చేరింది. ఎక్కువ‌గా 20-45 సంవ‌త్స‌రాల మ‌ధ్య వ‌య‌సున్న‌వారు, ఆర్థికంగా వెన‌క‌బ‌డిన‌వారే ఈ ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు. దీనివ‌ల్ల ఉత్పాద‌క వ‌య‌సులో ఉన్న‌వారు మ‌ర‌ణించి, ఆ కుటుంబాల‌పై పెనుభారం ప‌డుతోంది. ర‌హ‌దారి భ‌ద్ర‌త‌పై ప్ర‌జ‌లకు అవ‌గాహ‌న లేక‌పోవ‌డం, హెల్మెట్లు స‌రిగా వాడ‌క‌పోవ‌డం, ర‌హ‌దారులు స‌రిగా లేక‌పోవ‌డం, చ‌ట్టాల‌ను ప‌ట్టించుకోక‌పోవ‌డం, ఆస్ప‌త్రికి రావ‌డానికి ముందు ప్రాథ‌మిక చికిత్స‌లు అంద‌క‌పోవ‌డం, ఆస్ప‌త్రుల‌లోనూ న్యూరోస‌ర్జ‌రీ విభాగాలు ప‌టిష్ఠంగా ఉండ‌క‌పోవ‌డం లాంటివి ఎక్కువ‌శాతం మెద‌డుగాయాల వ‌ల్ల సంభ‌వించే మ‌ర‌ణాల‌కు కార‌ణ‌మ‌వుతున్నాయి.  ఈ విష‌యాల‌న్నింటిపైనా అవ‌గాహ‌న పెంపొందించుకుని, తోటివారికి కూడా సాయ‌ప‌డాలి” అని కోరారు.

     

More Press Releases