మూర్ఛపై అపోహ‌లు వ‌ద్దు.. అవ‌గాహ‌న ముఖ్యం

Related image

* అంటువ్యాధి కాదు.. మందులు, శ‌స్త్రచికిత్స‌ల‌తో పూర్తి ఉప‌శ‌మ‌నం

* భార‌త‌దేశంలో కోటి మందికి పైగా ఈ వ్యాధి బాధితులు

* అంత‌ర్జాతీయ మూర్ఛ‌దినోత్స‌వం సంద‌ర్భంగా కిమ్స్ ఆస్ప‌త్రిలో అవ‌గాహ‌న స‌ద‌స్సు

 

హైద‌రాబాద్, ఫిబ్ర‌వ‌రి 12, 2024: మూర్ఛ అనేది మెద‌డుకు వ‌చ్చే స‌ర్వ‌సాధార‌ణమైన వ్యాధి అని, భార‌త‌దేశంలో ప్ర‌స్తుతం దాదాపు కోటిమందికి పైగా ఈ వ్యాధి బాధితులున్నార‌ని కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన న్యూరోసర్జన్ డాక్ట‌ర్. మానస్ ఫ్రాణిగ్రహి అన్నారు. అంత‌ర్జాతీయ మూర్ఛ దినోత్స‌వం సంద‌ర్భంగా సికింద్రాబాద్‌లోని కిమ్స్ ఆస్ప‌త్రిలో సోమవారం నిర్వ‌హించిన అవ‌గాహ‌న స‌దస్సును ఆస్ప‌త్రి సీఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు, న్యూరాలజిస్ట్ డాక్టర్. సీతా జయలక్ష్మిలతో క‌లిసి ప్రారంభించారు. ఇందులో మూర్ఛ వ్యాధిగ్ర‌స్తుల‌తో పాటు సామాన్య ప్ర‌జ‌లూ పాల్గొన్నారు. ఇందులో దీని చుట్టూ ఉన్న అపోహ‌ల‌ను దూరం చేయ‌డంపై ప‌లువురు మాట్లాడారు. త‌మ జీవితంలో మూర్ఛ‌వ్యాధితో ముడిప‌డిన అనేక స‌వాళ్ల‌ను విజ‌య‌వంతంగా ఎదుర్కొంటూ జీవితాన్ని గ‌డుపుతున్న‌వారిపై ఈ సంవ‌త్స‌రం అంత‌ర్జాతీయ మూర్ఛ దినోత్స‌వం ప్ర‌ధానంగా దృష్టిపెట్టింది. ప్ర‌తి ఒక్క‌రూ ముందుకొచ్చి, ఈ వ్యాధిపై ఉన్న దుర‌భిప్రాయాల‌ను పార‌ద్రోలాల‌ని ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆస్ప‌త్రి సీఎండీ డాక్ట‌ర్ బి.భాస్క‌ర‌రావు సూచించారు.

ఈ సంద‌ర్భంగా డాక్ట‌ర్ మాన‌స్ పాణిగ్రాహి మాట్లాడుతూ, “మూర్ఛ అనేది న‌రాల‌కు సంబంధించిన స‌మ‌స్య‌. ఇది వ‌చ్చిన‌ప్పుడు మెదడులోని నాడీ కణాల కార్యకలాపాలు దెబ్బతింటాయి. మూర్ఛ లేదా అసాధారణ ప్రవర్తన, అనుభూతులు, కొన్నిసార్లు స్పృహ కోల్పోతారు.  మూర్ఛ అనేది చికిత్స చేయగల మెదడు వ్యాధి. ఇది ఏ వయసులోనైనా వ‌స్తుంది. 20 సంవత్సరాలకు ముందు, 60 సంవత్సరాల తర్వాత ఎక్కువగా నిర్ధారణ అవుతుంది.  ఒక్కసారి వ‌స్తేనే మూర్ఛ ఉన్న‌ట్లు కాదు. కనీసం రెండు సార్లు వ‌స్తే అప్పుడు చూపించుకోవాలి. కొద్దిపాటి మూర్ఛ వ‌చ్చినా చికిత్స‌లు అవ‌స‌రం అవుతాయి. ఎందుకంటే వాహ‌నాలు న‌డిపేట‌ప్పుడు, లేదా ఈత కొట్టేట‌ప్పుడు అవి ప్ర‌మాద‌క‌రం. మందుల‌తో కొన్నిసార్లు న‌య‌మ‌వుతుంది. శ‌స్త్రచికిత్స చేస్తే దాదాపు 80% మందికి పూర్తిగా న‌య‌మ‌వుతుంది. చిన్న‌త‌నంలో వ‌స్తే, పెద్ద‌వార‌య్యేకొద్దీ అదే పోతుంది.

ఎందువ‌ల్ల వ‌స్తుంది?

మూర్ఛ రావ‌డానికి అత్యంత ముఖ్యమైన కారణాలు చిన్న‌త‌నంలోనే మెద‌డుకు గాయాలు, అంటు వ్యాధులు, మెదడుకు తీవ్ర‌మైన‌ గాయం, స్ట్రోక్. ఈ పరిస్థితులన్నీ నివారించదగినవి. ఈ స‌మ‌స్య ఉన్నవారిలో 30% మందిలో మూర్ఛకు గుర్తించదగిన కారణం ఉండ‌దు. ఇంకా జన్యు ప్రభావం, మెదడు కణితులు, మెదడు అభివృద్ధి రుగ్మతల వంటి కారకాల వల్ల కూడా దీన్ని క‌నుక్కోవ‌చ్చు” అని వివ‌రించారు.

ఇప్ప‌టికే కొన్నివేల మూర్ఛ శ‌స్త్రచికిత్స‌లు చేసిన డాక్ట‌ర్ మాన‌స్ పాణిగ్రాహి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, ‘‘మందుల‌తో త‌గ్గ‌న‌ప్పుడు శ‌స్త్రచికిత్స చాలా మంచిది. వ్యాధి గురించిన అపోహ‌లు, అది ఉన్న‌వారిపై చూపుతున్న వివ‌క్ష‌ కార‌ణంగా వారి జీవితాల‌పై ప్ర‌తికూల ప్ర‌భావం ప‌డుతోంది. మూర్ఛ ఉన్న పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌ల్లో ఆట‌లు ఆడించ‌క‌పోవ‌డం, సామాజిక కార్య‌క‌లాపాల‌కు వారిని దూరం పెట్ట‌డం వ‌ల్ల వారి అభివృద్ధి, ఆత్మ‌గౌర‌వం రెండూ దెబ్బ‌తింటున్నాయి. అలాగే, ఈ స‌మ‌స్య ఉన్న పెద్ద‌వ‌య‌సువారికి ఉద్యోగావ‌కాశాల విష‌యంలో చిన్న‌చూపు చూడ‌టం, పదోన్న‌తులు ఇవ్వ‌క‌పోవ‌డం, కొన్ని ముఖ్య‌మైన ఉద్యోగాల్లోకి వారిని తీసుకోక‌పోవ‌డం లాంటివి ఎదుర‌వుతున్నాయి. దుర‌భిప్రాయం, అపోహ‌ల కార‌ణంగానే మూర్ఛ‌వ్యాధి ఉన్న‌వారిని చిన్న‌చూపు చూస్తున్నారు. చాలామంది ఇది మాన‌సిక అనారోగ్య‌మ‌ని, దీనివ‌ల్ల ప‌నులు చేసుకోలేర‌ని, లేదా అది అంటువ్యాధి అని అపోహ ప‌డుతున్నారు. మూర్ఛ ఉన్న‌వారిలో దాదాపు స‌గం మందికిపైగా ఇలాంటి వివ‌క్ష ఎదుర్కొంటున్నారు’’ అని చెప్పారు. 

వివ‌క్ష‌ను అధిగ‌మించాలి

‘‘మూర్ఛ‌వ్యాధి వ‌ల్ల బాధితులు జీవితంలో అన్ని అంశాల్లో ప్ర‌భావిత‌మ‌వుతారు. నిజానికి వ్యాధి వ‌ల్ల వ‌చ్చే స‌మ‌స్య‌ల కంటే, దాని కార‌ణంగా ఎదురయ్యే వివ‌క్ష‌ను భ‌రించ‌డ‌మే క‌ష్టం అవుతుంది. ఇది అభివృద్ధి చెందిన‌, చెందుతున్న దేశాల‌న్నింటిలో ఉంటోంది. దీనివ‌ల్ల మూర్ఛ బాధితులు శారీర‌కంగా, మాన‌సికంగా, సామాజికంగా ఇబ్బంది ప‌డ‌తారు. సాధార‌ణంగా 5 నిమిషాల కంటే ఎక్కువ‌సేపు మూర్ఛ వ‌స్తే త‌ప్ప‌నిస‌రిగా వైద్యుల‌ను సంప్ర‌దించాలి. అలాగే మూర్ఛ త‌ర్వాత ఊపిరి రాక‌పోయినా, స్పృహ లేక‌పోయినా, వెంట‌నే రెండోమూర్ఛ వ‌చ్చినా వెళ్లాలి. జ్వ‌రం ఎక్కువ‌గా ఉన్నా, గ‌ర్భంతో ఉన్నా, మూర్ఛ వ‌చ్చినప్పుడు గాయ‌ప‌డినా కూడా వైద్యుల వ‌ద్ద‌కు వెళ్లాలి. మూర్ఛ ఉన్న‌వాళ్లు సైతం సాధార‌ణ ప్ర‌జ‌ల్లాగే జీవితంలో ఏదైనా సాధించ‌గ‌లరు. వారికి స‌రైన చికిత్స అందిస్తే, దాదాపు 70%కు పైగా బాధితులు పూర్తిస్థాయిలో సాధార‌ణ‌ జీవ‌నం గ‌డ‌ప‌గ‌ల‌రు. మూర్ఛ‌ను అంటువ్యాధి అని చాలామంది అనుకుంటారు గానీ, అది కాదు. ఈ వ్యాధి ఉన్న‌వారికి తెలివితేట‌ల్లో ఎలాంటి లోటూ ఉండ‌దు. స‌రైన చికిత్స అందితే వాళ్లు సాధార‌ణ జీవ‌నం గ‌డిపి, ఉద్యోగం చేసుకుంటూ.. పెళ్లి చేసుకుని పిల్ల‌ల్ని కూడా క‌నొచ్చు’’ అని డాక్ట‌ర్ సీతాజ‌య‌ల‌క్ష్మి వివ‌రించారు.

   

More Press Releases