హరితనిధిపై అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం

Related image

హరితనిధి నిధులను పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఖర్చు చేయాలి ప్రజలు, ఉద్యోగుల నుంచి వచ్చిన ప్రతీ రూపాయికీ లెక్క పక్కాగా ఉండాలి ప్రజల భాగస్వామ్యంతో పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలి -- హరితనిధిపై అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సమీక్షా సమావేశం---

పర్యావరణ పరంగా ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులు పెను సవాలుగా మారుతున్నాయని, పచ్చదనం పెంపు ప్రక్రియ నిరంతరం కొనసాగాలని అటవీ పర్యావరణం, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. సచివాలయంలో ఇవాళ హరితనిధి విరాళాలు, వ్యయంపై మంత్రి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఇప్పటి దాకా హరితనిధి కింద వచ్చిన విరాళాలు, ఖర్చు వివరాలను అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్.ఎం. డోబ్రియల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. 2021 లో మొదలైన హరితనిధి ద్వారా ఇప్పటి దాకా 69.21 కోట్ల రూపాయలు జమ అయ్యాయని వెల్లడించారు. ఇందులో 43 కోట్ల మేరకు పనులు మంజూరు అయ్యాయని, 29. 39 కోట్లు విడుదల కాగా, 18.72 కోట్ల రూపాయలు పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. మిగతా పనులు వివిధ దశల్లో ఉన్నాయని అన్నారు.

జిల్లాకు ఒకటి చొప్పున సెంట్రల్ నర్సరీల ఏర్పాటు, ఎవెన్యూ ప్లంటేషన్ కోసం పెద్ద మొక్కల పెంపకం, అర్బన్ ఫారెస్ట్ పార్కుల్లో మిగిలిన పనులు, దశాబ్ది సంపద వనాల పేరుతో సాగునీటి శాఖ పరిధిలో ఉన్న మిగులు భూముల్లో వనాల పెంపుకంపై ప్రధానంగా హరితనిధి ద్వారా వచ్చిన నిధులతో జరుగుతోందని వెల్లడించారు.

ప్రజలు, ఉద్యోగుల నుంచి విరాళాల రూపంలో వస్తున్న హరితనిధిలో ప్రతీ రూపాయకూ పక్కా లెక్కలు ఉండాలని, పూర్తి పారదర్శకత, జవాబుదారీ తనంలో పనులు చేయాలని ఆదేశించారు. కేటాయింపులు, ఖర్చకు సంబంధించిన వివరాలు ఆన్ లైన్ లో ప్రజలకు అందుబాటులోకి తేవాలని సూచించారు. వివిధ జిల్లాల్లో ఏర్పాటైన నర్సరీలు,

జరుగుతున్న పనుల నాణ్యతను పరిశీలించి తనకు నివేదిక ఇవ్వాలని అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీ ప్రసాద్ కు మంత్రి సూచించారు. పూర్తి అయిన పనుల ఆడిట్ నివేదికలను కూడా పరిశీలించాలని తెలిపారు. మంజూరై, పనులు మొదలు పెట్టని జిల్లాలను నుంచి నిధులను వెంటనే వెనక్కితీసుకుని, తాజా పనులకు కేటాయించాలని అన్నారు. తెలంగాణ నేల స్వభావానికి అనువైన చింత, వేప, రేల లాంటి చెట్లను రహదారుల వెంట నాటేందుకు ప్రాధాన్యతను ఇవ్వాలని మంత్రి తెలిపారు.

ఈ సమీక్షా సమావేశంలో పీసీసీఎఫ్ (హరితహారం) సువర్ణ, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

More Press Releases