రాజధాని రైతుల దగ్గరకు వెళ్ళి భరోసాగా నిలుద్దాం: బీజేపీ, జనసేన నిర్ణయం

రాజధాని రైతుల దగ్గరకు వెళ్ళి భరోసాగా నిలుద్దాం: బీజేపీ, జనసేన నిర్ణయం

•బీజేపీ – జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం

రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతుల దగ్గరకు బీజేపీ, జనసేన పార్టీలు సంయుక్తంగా వెళ్ళి, వారికి అండగా నిలవాలని ఉభయ పార్టీల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నాయి. రైతులకు భరోసా కల్పించాలని, అమరావతి రాజధాని విషయంలో ఉభయ పార్టీలు పోరాటం చేయాలని సంకల్పించాయి. మంగళవారం ఉదయం విజయవాడలో బీజేపీ, జనసేన పార్టీల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ నుంచి దగ్గుబాటి పురందేశ్వరి, సోము వీర్రాజు, శాంతారెడ్డి హాజరయ్యారు. జనసేన పక్షాన నాదెండ్ల మనోహర్, టి.శివశంకర్, కందుల దుర్గేష్, సిహెచ్.మధుసూదన్ రెడ్డి, వి.గంగులయ్య, బి.శ్రీనివాస్ యాదవ్, బి.నాయకర్, సి.మనుక్రాంత్ రెడ్డి పాల్గొన్నారు. రాజధాని మార్పు, స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంపై సుదీర్ఘంగా చర్చించారు.

అమరావతి ప్రస్తుత దుస్థితికి నాడు అధికారంలో ఉన్న టీడీపీ, నేడు అధికారంలో ఉన్న వైసీపీలు  రెండూ బాధ్యులే అని సమన్వయ కమిటీ అభిప్రాయపడింది. రాజధాని మార్పు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పి చేస్తున్నామని అధికార వైసీపీ ప్రచారం చేస్తోందని, ఇది పూర్తిగా సత్యదూరమైన ప్రచారమనీ ఇలాంటి అబద్ధాలు, అభూత కల్పనలు ప్రచారం చేయడంలో ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ, నాడు అధికారంలో ఉన్న పార్టీ ఒకే విధంగా వ్యవహరిస్తున్నాయని ఈ కమిటీ పేర్కొంది.

బిజెపీ – జనసేన పార్టీలు కలసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలని నిశ్చయించుకున్నాయి. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో కమిటీలు నియమించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.  ఉభయ పార్టీల అధ్యక్షులు ఆమోదం తెలిపిన తరవాత కమిటీ సభ్యులను ఎంపిక చేస్తారు.

Janasena
Pawan Kalyan
Andhra Pradesh
BJP

More Press News