స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఈనెల 9 నుండి 22 వ తేదీ వరకు అత్యంత ఘనంగా నిర్వహించేలా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో ఫిలిం డెవలప్మెంట్ శాఖ అధికారులు, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు తదితరులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశానికి స్వాత్రంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారి ఆదేశాల మేరకు వజ్రోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ వేడుకలలో విద్యార్ధులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, యువతీయువకులు ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేసే విధంగా ఎంతో ఉత్సాహంగా పాల్గొనేలా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఆగస్టు 15 వ తేదీన ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా ఇంటికో జెండాను అందజేయనున్నట్లు చెప్పారు. అందులో భాగంగా విద్యార్ధులు అందరికీ మహాత్మాగాంధీ చరిత్రను తెలియజెప్పే, విద్యార్ధి దశ నుండే దేశభక్తి ని పెంపొందించే విధంగా తెలుగు, హిందీ భాషలలో రూపొందించిన చిత్రాన్ని రాష్ట్రంలోని 2.77 లక్షల సీట్ల సామర్ద్యంతో ఉన్న 563 స్క్రీన్స్ లలో ప్రదర్శించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. 

విద్యార్ధులను థియేటర్ లకు తీసుకెళ్ళే రవాణాఏర్పాట్లను కూడా ప్రభుత్వం చేపడుతుందని, అంతేకాకుండా వారికి ఉచితంగా వాటర్ బాటిల్స్, స్నాక్స్ అందించడం జరుగుతుందని చెప్పారు. ఇందులో భాగంగా విద్యాశాఖ అధికారులతో ఒక సమావేశం నిర్వహించి సమీక్షించాలని హోం శాఖ ప్రిన్స్ పల్ సెక్రెటరీ రవిగుప్తాను మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు సునీల్ నారంగ్, కార్యదర్శులు అనుపమ్ రెడ్డి, దామోదర్ ప్రసాద్, ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ అద్యక్షులు బసిరెడ్డి, FDC ED కిషోర్ బాబు, UFO, క్యూబ్ ప్రతినిధులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.

నిజామాబాద్ లో హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలి: మంత్రి నిజామాబాద్ పట్టణంలో అత్యాధునిక వసతులతో కూడిన హోల్ సేల్ చేపల మార్కెట్ ను నిర్మించడానికి గల అవకాశాలపై అధ్యయనం చేయాలని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మత్స్య శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన పలువురు మత్స్యకారులు పలు సమస్యలపై మంత్రిని కలిశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మత్స్య శాఖ కు చెందిన స్థలంలో అత్యాధునిక హోల్ సేల్ చేపల మార్కెట్ నిర్మాణం చేపట్టేందుకు ఉన్నతస్థాయి అధికారులతో ఒక కమిటీ వేసి స్థల పరిశీలన చేసి ప్రతిపాదనలను సిద్దం చేయాలని మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా ను మంత్రి ఆదేశించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ తో పాటి ఇతర నీటి వనరుల ద్వారా పెద్ద ఎత్తున చేపల ఉత్పత్తి జరుగుతుందని, ఇక్కడ మార్కెట్ చేపల నిర్మాణం జరిగితే ఈ పరిసర ప్రాంతాల్లో అత్యధిక సంఖ్యలో ఉన్న మత్స్యకారుల కుటుంబాలకు ఎంతో మేలు జరుగుతుందని వివరించారు. 

అంతేకాకుండా కోల్డ్ స్టోరేజీ నిర్మాణం కూడా చేపట్టడం వలన పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు చేపలను ఎగుమతి చేసే అవకాశం ఉంటుందని, తద్వారా ఈ ప్రాంతం మత్స్య రంగానికి ఒక హబ్ గా అభివృద్ధి చెందే అవకాశం ఉందని చెప్పారు. ఇప్పటికే బేగంబజార్ లో హోల్ సేల్ చేపల మార్కెట్ ను ఎంతో అద్భుతంగా నిర్మించిన విషయాన్ని వివరించారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత కులవృత్తులను ప్రోత్సహించే విధంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు. కులవృత్తి పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారిని ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి లోకి తీసుకురావాలనేది ముఖ్యమంత్రి ఆలోచన అని పేర్కొన్నారు. 

ఆ ఆలోచనలలో భాగంగా ఉచితంగా చేప పిల్లల పంపిణీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. వీటితో పాటు మత్స్యకారులకు అదనపు ఆదాయం సమకూర్చాలనే ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా రొయ్య పిల్లలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని నీటి వనరులలో ఉచితంగా చేప పిల్లలను విడుదల చేసిన ఫలితంగా రాష్ట్రంలో మత్స్య సంపద గణనీయంగా పెరిగిందని మంత్రి చెప్పారు. మత్స్యకారులు చేపలను విక్రయించుకోవడానికి 800 కోట్ల రూపాయల వ్యయంతో సబ్సిడీ పై వివిధ రకాల వాహనాలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

ఇవే కాకుండా అన్ని జిల్లా కేంద్రాలు, మున్సిపల్ కేంద్రాలలో అన్ని వసతులతో కూడిన చేపల మార్కెట్ ల  నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. మత్స్యకారులు కూడా ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మరింత అభివృద్ధి చెందాలని సూచించారు. అంతేకాకుండా తమ పిల్లలను ప్రభుత్వం ఏర్పాటు చేసిన రెసిడెన్షియల్ స్కూల్స్ లో చేర్పించి విద్యావంతులను చేయాలని చెప్పారు. ఈ సమావేశంలో ముషీరాబాద్ MLA ముఠా గోపాల్, గంగపుత్ర సంఘం రాష్ట్ర అధ్యక్షులు దేశిని మల్లయ్య పలువురు మత్స్యకారులు పాల్గొన్నారు.

More Press Releases