అర్బన్ ఫారెస్ట్ పార్కులు, హరిత వనాల్లో చిక్కటి పచ్చదనం పరుచుకోవాలి: శాంతి కుమారి

Related image

  • ఆగస్టు నెలాఖరు కల్లా మొక్కలు నాటే లక్ష్యం పూర్తి చేయాలి
  • జిల్లాల అటవీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ లో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి
హైదరాబాద్: అర్బన్ ఫారెస్ట్ పార్కులు, హరితవనాల్లో ఖాళీ ప్రదేశాలు లేకుండా వందశాతం (సాచురేషన్ బేసిస్ లో) మొక్కలు నాటి, చిక్కటి పచ్చదనం పెంచాలని అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఏ. శాంతి కుమారి ఆదేశించారు. సంబంధిత ఉన్నతాధికారులు, డీఎఫ్ఓలతో శాంతి కుమారి అరణ్య భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
 
మంచి వానలు కురుస్తున్నందున మొక్కలు నాటే లక్ష్యాన్ని వేగంగా పూర్తి చేయాలని కోరారు. అర్భన్ ఫారెస్ట్ పార్కులు, హరిత వనాలు కలిపి రాష్ట్ర వ్యాప్తంగా 164 ఉన్నాయని, వాటిల్లో మొత్తం సుమారు రెండు కోట్ల మొక్కలు (1,99,58,170) నాటడం లక్ష్యంగా పెట్టుకున్నామని, ఈ యేడాది (2022) లక్ష్యం మొత్తం 91,63,442 కాగా ఇప్పటి దాకా 28,15,278 మొక్కలు నాటారని సమీక్షలో పాల్గొన్న పీసీసీఎఫ్ & హెచ్ఓఓఎఫ్ ఆర్.ఎం. డోబ్రియల్ వివరించారు.

జిల్లాల్లో పార్కులు, హరిత వనాల వారీగా అభివృద్ది పనులు, మొక్కల లక్ష్యాన్ని సంబంధిత అధికారుల నుంచి స్పెషల్ చీప్ సెక్రటరీ అడిగి తెలుసుకున్నారు. అర్బన్ పార్కుల్లో సందర్శకుల సంఖ్య పెంచేలా చర్యలు తీసుకోవటంతో పాటు, చిక్కటి పచ్చదనం, అహ్లాదంగా ఉండేలా, పిల్లల్లో పర్యావరణ స్ఫృహ పెరిగేలా చూడాలన్నారు. పార్కు స్థలం కాకుండా మిగతా అటవీ ప్రాంతాన్ని కన్జర్వేషన్ జోన్ గా అభివృద్ధి పరచాలని తెలిపారు.

ఈ నెలాఖరు కల్లా (ఆగస్టు) మొక్కలు నాటే లక్ష్యాన్ని పూర్తి చేయాలని సూచించారు. త్వరలోనే తాను జిల్లాల పర్యటనకు వచ్చినపుడు అర్బన్ ఫారెస్ట్ పార్కులను సందర్శిస్తానని శాంతి కుమారి తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఏ.కే. సిన్హా, డిప్యూటీ చీఫ్ కన్జర్వేటర్ శాంతారామ్, అమ్రాబాద్, కవ్వాల్ టైగర్ రిజర్వుల ఫీల్డ్ డైరెక్టర్లు, వివిధ జిల్లాల చీఫ్ కన్జర్వేటర్లు, జిల్లా అటవీ అధికారులు పాల్గొన్నారు.

More Press Releases