మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు: మంత్రి తలసాని

Related image

హైదరాబాద్: మన సంస్కృతి, సాంప్రదాయాలను చాటి చెప్పేవి పండుగలు అని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం మొగల్ పురా పోలీస్ స్టేషన్ సమీపంలో గల సుల్తాన్ షాహీ జగదాంబ అమ్మవారి ఆలయం వద్ద బోనాల ఉత్సవాల కోసం ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి ఆయా ఆలయాల కమిటీ సభ్యులకు అందజేశారు.

ఉమ్మడి దేవాలయాల కమిటీ పరిధిలోని దేవాలయాలతో పాటు సౌత్ జోన్ పరిధిలో గల సుమారు 345 దేవాలయాలకు 1.86 కోట్ల రూపాయల విలువైన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 వ తేదీన హైదరాబాద్ బోనాలు, 25 వ తేదీన ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు జరగనున్నాయని, ఈ నేపధ్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిస్థాయిలో చేస్తున్నట్లు చెప్పారు. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపుకు ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని చెప్పారు. ఎంతో విశిష్టత కలిగిన బోనాల ఉత్సవాలను తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించిన తర్వాత రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ బోనాల ఉత్సవాలను గొప్పగా, సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు చెప్పారు.

భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. బోనాల ఉత్సవాల సందర్భంగా 100 కోట్ల రూపాయల వ్యయంతో రోడ్లు, డ్రైనేజీ, సీవరేజ్ వంటి వివిధ అభివృద్ధి పనులు చేపట్టినట్లు చెప్పారు. బోనాల ఉత్సవాల సందర్భంగా గతంలో ఆయా ఆలయాల కమిటీల ఆధ్వర్యంలో విరాళాలు సేకరించే వారని, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వమే ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. సుమారు 3500 కు పైగా దేవాలయాలకు ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరం బోనాల ఉత్సవాల కు ముందే ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నట్లు చెప్పారు. పండుగలను ప్రజలు అంతా కలిసి మెలసి సంతోషంగా, గొప్పగా జరుపుకోవాలని కోరారు. 

శాంతిభద్రతల కు విఘాతం కల్పించాలని ఎవరైనా ప్రయత్నిస్తే అలాంటి వారిని ఉపేక్షించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పాతబస్తీ లో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే అనేక అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో, అభివృద్ధి పనులను చేపట్టే విషయంలో ప్రభుత్వం చిత్తశుద్దితో పని చేస్తుందని వివరించారు. ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇచ్చిన హామీ ప్రకారం లాల్ దర్వాజ లోని సింహవాహిని దేవాలయ అభివృద్ధి, నిర్మాణ పనులను ప్రభుత్వం త్వరలో చేపడుతుందని వివరించారు. పాతబస్తీ ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకొని రెండు మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్స్ ను మంజూరు చేయడం జరిగిందని, అందులో ఒకటి ఉప్పుగూడ లో త్వరలోనే నిర్మాణ పనులు ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ఈ మల్టి పర్ఫస్ ఫంక్షన్ హాల్ లు పేద ప్రజలకు అతి తక్కువ ధరలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో DCP సాయి చైతన్య, ఉమ్మడి దేవాలయాల కమిటీ చైర్మన్ రాకేశ్ తివారీ, సభ్యులు మధుసూదన్ యాదవ్, గాజుల అంజయ్య, మధుసూదన్ గౌడ్, మహేష్ యాదవ్, హన్స్ రాజ్, శంకర్ యాదవ్, దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ రామకృష్ణ, అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

More Press Releases