నగరంలోని ఖాళీ స్థలాల్లో విస్తృతంగా మొక్కలు నాటాలి:సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, మార్చి 04: గ్రేటర్ హైదరాబాద్ తో పాటు శివారు మున్సిపాలిటీలు, హెచ్.ఎం.డి.ఏ పరిధిలోని ఖాళీ స్థలాలన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. నగరంలో భారీ ఎత్తున గ్రీనరి పెంపుకై నేడు వివిధ ప్రాంతాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ జీహెచ్ఎంసీ కమిషనర్ డి.ఎస్.లోకేష్ కుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ డైరెక్టర్ సత్యనారాయణ, సిసిఎఫ్ డోబ్రియల్, అటవీ, హెచ్.ఎం.డి.ఏ తదితర అధికారులతో కలిసి పరిశీలించారు.

హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు నగరంలోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ కార్యాలయాలు, రహదారులకు ఇరువైపులా, చెరువులు, కుంటల గట్లపై పెద్ద ఎత్తున మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

హైదరాబాద్ నగరాన్ని శాటిలైట్ మ్యాప్ ద్వారా సెక్టార్లుగా విభజించి ఆయా సెక్టార్లలో ఉన్న ఖాళీ స్థలాలన్నింటిలోనూ మొక్కలు నాటాలని, ఇందుకుగాను సెక్టార్ల వారిగా అర్భన్ బయోడైవర్సిటీ, టౌన్ ప్లానింగ్ తదితర శాఖల అధికారులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో నిర్మిస్తున్న లింక్ రోడ్లకు ఇరువైపులా కూడా అందమైన మొక్కలను నాటి నగరవాసులకు కనువిందుచేసే విధంగా చేయాలని పేర్కొన్నారు.

రహదారుల వెంట మూడు వరుసల్లో పూల మొక్కలు, ఆకర్షనీయంగా ఉండే మొక్కలను విస్తృతంగా నాటాలని అన్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం నుండి ఆదర్శ్ నగర్ మీదుగా కంట్రోల్ రూంకు వెళ్లే రహదారి ఇరువైపులా మరింత ఆహ్లాదకరంగా ఉండే రీతిలో మంచి పూల మొక్కలను నాటాలని పేర్కొన్నారు. రాయదుర్గం చెరువును మరింత సుందరీకరణ చేపట్టాలని, ఈ చెరువు చుట్టూ పెద్ద సంఖ్యలో మొక్కలు నాటాలని సూచించారు.

బి.ఆర్.కె భవన్, ఎమ్మెల్యే క్వార్టర్స్, గన్ పార్క్, లక్డికాపూల్, ఎన్టీఆర్ మార్గ్, ఫిలిం నగర్, షేక్ పేట్ దర్గా, గచ్చిబౌలి, రాయదుర్గ్, మెహిదీపట్నం, మాసబ్ ట్యాంక్ మార్గాలను సీఎస్ సోమేశ్ కుమార్ పరిశీలించారు. ఈ మార్గాలకు ఇరువైపులా పూర్తిస్థాయిలో ప్లాంటేషన్ ను చేపట్టాలని స్పష్టం చేశారు. మాసబ్ ట్యాంక్ పాలిటెక్నిక్ కళాశాలలో ఉన్న ఖాళీ స్థలంలో ఆహ్లాదకరమైన గార్డెనింగ్, మొక్కలను నాటాలని సూచించారు.

More Press Releases