బాలీవుడ్ లో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా మనోజ్ బాజ్ పాయ్  కనిపిస్తాడు. ఒక వైపున వెబ్ సిరీస్ లతో .. మరో వైపున ఓటీటీ సినిమాలతో ఆయన దూసుకుపోతున్నాడు. అలా ఆయన ప్రధానమైన పాత్రను పోషించిన సినిమానే 'ఇన్ స్పెక్టర్ ఝండే'. చిన్మయ్ డి మండ్లేకర్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ థ్రిల్లర్,నేరుగా ఓటీటీకి వచ్చేసింది. యథార్థసంఘటన ఆధారంగా రూపొందించిన ఈ సినిమా, ఈ నెల 5వ తేదీ నుంచి హిందీతో పాటు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.

కథ: ఈ కథ 1970 - 86 మధ్య కాలంలో నడుస్తుంది. తీహార్ జైలు నుంచి కార్ల్ భోజ్ రాజ్ (జిమ్ కర్బ్)  అనే ఖైదీ తప్పించుకుంటాడు. కరడుగట్టిన నలుగురు నేరస్థులతో పాటు అతను పారిపోయినట్టు వినగానే పోలీస్ ఆఫీసర్ మధుకర్ ఝండే ( మనోజ్ బాజ్ పాయ్) కంగారు పడిపోతాడు. ఎందుకంటే 1970 నుంచి అతను వివిధ దేశాలకు చెందిన జైళ్ల నుంచి ఐదు సార్లు తప్పించుకుంటాడు. ఇంటర్ పోల్ ఆఫీసర్స్ ను ముప్పతిప్పలు పెట్టిన ఖైదీ అతను. అలాంటి నేరస్థుడు మరోసారి తప్పించుకోవడం చర్చనీయాంశమవుతుంది. 

అలాంటి భోజ్ రాజ్ ను పట్టుకోవడం కోసం డీజీపీ 'పురంధర్' (సచిన్ ఖేడేకర్) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేస్తాడు. గతంలో భోజ్ రాజ్ ను పట్టుకున్న పోలీస్ ఆఫీసర్ మధుకర్ ఝండేకి ఆ బాధ్యతను అప్పగిస్తాడు. మధుకర్ ఝండే తన టీమ్ తో కలిసి రంగంలోకి దిగుతాడు. భోజ్ రాజ్ 'గోవా'కి పారిపోయినట్టుగా అతని ఇన్వెస్టిగేషన్ లో తేలుతుంది. దాంతో అతను తన టీమ్ తో కలిసి అక్కడికి వెళతాడు. అక్కడ ఏం జరుగుతుంది? మధుకర్ ఝండే టీమ్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనేది కథ. 

విశ్లేషణ: యథార్థ సంఘటన ప్రేరణతో ఈ సినిమాను రూపొందించినట్టుగా వాయిస్ ఓవర్ తో ఈ సినిమా మొదలవుతుంది. చూసే ప్రేక్షకుడికి ఇది 'ఛార్లెస్ శోభరాజ్' జీవితంలో జరిగిన ఒక సంఘటన అనే విషయం అర్థమైపోతూనే ఉంటుంది. కథానాయకుడి లుక్ .. అతను చేస్తూ వెళ్లిన హత్యల ప్రస్తావన ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ ఉంటుంది. తీహార్ జైలు నుంచి భోజ్ రాజ్ తప్పించుకోవడం .. అతనిని పట్టుకోవడానికి  ఇన్ స్పెక్టర్ ఝండే చేసే ప్రయత్నమే ఈ కథ. 
              
భోజ్ రాజ్ తీహార్ జైలు నుంచి తన తోటి ఖైదీలతో కలిసి తప్పించుకుంటాడు. దాంతో ఈ బృందం ఎక్కడ ఎలాంటి నేరాలకు పాల్పడుతుందో అని ఆడియన్స్ అనుకుంటారు. అలాగే అతని బృందంలోని వారిని ఈ పోలీస్ టీమ్ ఎలా వెంటాడుతుందో .. ఎలా పట్టుకుంటుందో అనే ఒక కుతూహలం కూడా ఆడియన్స్ లో తలెత్తుతుంది. అయితే ఈ రెండు వైపుల నుంచి కూడా ప్రేక్షకులకు నిరాశే ఎదురవుతుంది.

భోజ్ రాజ్ అంతర్జాతీయ నేరస్థుడు. అతను ఎలా తప్పించుకున్నాడనేది సింపుల్ గా తేల్చేశారు. ఇక అతను తప్పించుకునే తీరు గానీ .. అతని పట్టుకోవడానికి పోలీస్ టీమ్ వేసే ఎత్తులు గాని ఏమీ ఉండవు. ఎవరికి వారు చాలా తాపీగా తమ పనులు చేసుకుపోతుంటారు. దర్శకుడు ఒక సీరియస్ ఇన్వెస్టిగేషన్ కి కామెడీ టచ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. అయితే కామెడీ పండకపోగా, నేరస్థుడిని పట్టుకోవడానికి వెళ్లిన పోలీస్ టీమ్, కమెడియన్స్ బ్యాచ్ మాదిరిగా అనిపిస్తుంది.    

పనితీరు: 32 హత్యలు చేసిన నేరస్థుడు. నలుగురు ఖైదీలతో పాటు పారిపోయిన నేరస్థుడు. గతంలో అతనిని పట్టుకున్న అనుభవం ఉంది గనుక, ఈ సారి కూడా నువ్వే పట్టుకో అంటూ పోలీస్ పెద్దలు హీరోకి ఆపరేషన్ ను అప్పగించడం మనం నోరెళ్ల బెట్టేలా చేస్తాయి. ఒక ప్రమాదకరమైన నేరస్థుడిని పట్టుకోవడానికి పోలీస్ లు కామెడీతో ముందుకు వెళ్లడం ప్రేక్షకులకు నిరాశను కలిగిస్తుంది. దర్శకుడు ఈ కథను సీరియస్ గానే చెబితే బాగుండేదని అనిపిస్తుంది.

కథలో ప్రధానమైన సన్నివేశాలు .. కీలకమైన సన్నివేశాల విషయంలో రిస్క్ తీసుకునే ఆలోచన చేసినట్టుగా మనకి ఎక్కడా కనిపించదు. అలాంటి సన్నివేశాలను ఎక్కడికక్కడ దాటవేసుకుంటూ వెళ్లారు.  కామెడీ థ్రిల్లర్ అంటూ తేలికపాటి సన్నివేశాలతోనే ముగించారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ గురించి చెప్పుకోవడానికి పెద్దగా ఏమీ లేదు. ఇక మనోజ్ బాజ్ పాయ్ .. ఆయన భార్య  పాత్రను పోషించిన గిరిజ ఓక్ నటన ఆకట్టుకుంటుంది. 

ముగింపు: ఒక అంతర్జాతీయ నేరస్థుడిని పట్టుకోవడానికి పోలీసులు కామెడీగా చేసే ప్రయత్నమే ఈ సినిమా. అనుకున్న లైన్ చుట్టూ బలమైన కథాకథనాలు అల్లుకోకపోవడం వలన చాలా సాదాసీదాగా ఈ సినిమా సాగిపోతుంది. ఎలాంటి కసరత్తు లేకుండా వదిలిన ఈ కంటెంట్ ఆడియన్స్ ను నిరాశ పరుస్తుంది.