ప్రిన్స్, మహావీరుడు, అమరన్ వంటి తమిళ అనువాద చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు శివ కార్తీకేయన్. ఆయన నటించిన తాజా చిత్రం 'మదరాసి'. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు మురుగదాస్ నిర్ధేశకుడు కావడంతో ఈ చిత్రంపై తెలుగులో కూడా మంచి బజ్ ఏర్పడింది. ఈ ఇద్దరి కలయికలో వచ్చిన ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక శివ కార్తికేయన్ 'మదరాసి'గా ఆకట్టుకున్నాడా? గత కొంతకాలంగా సక్సెస్ ఎదురుచూస్తున్న దర్శకుడు మురుగదాస్‌కు ఈ చిత్రంతో సక్సెస్ దక్కిందా లేదా? రివ్యూలో తెలుసుకుందాం..
కథ: తమిళనాడులో గన్ కల్చర్‌ను విస్తరించి తద్వారా కోట్లాది రూపాయాలను సొమ్ము చేసుకోవాలని ఓ సిండికేట్ ముఠా ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా విరాట్ ( విద్యుత్ జమ్వాల్), చిరాగ్ (షబ్బీర్ కల్లరక్క) అనే ఫ్రెండ్స్‌ని ఇందులో ఇన్వాల్వ్ చేసి ట్రక్కులతో ఆయుధాలను ఓ ప్లేస్‌కు తరలిస్తారు. ఈ విషయం ఎన్ఐఏ సంస్థకు తెలుస్తుంది.
ఎన్ఐఏకు సారథ్యం వహిస్తున్న ప్రేమ్‌నాథ్ (బీజు మేనన్) ఆ ఆయుధాలను రాష్ట్రంలోకి రావడం ఆపలేకపోవడంతో, ఎలాగైనా ఆయుధాలు ఉన్న ప్లేస్‌ని బాంబులతో పేల్చాలని ఒక ఆపరేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ సమయంలోనే సూసైడ్ చేసుకోవాలనుకున్న రఘురామ్‌ను ( శివ కార్తికేయన్) ఈ ఆపరేషన్‌లో ఇన్వాల్వ్ చేయాలని ప్రేమ్‌నాథ్ డిసైడ్ అవుతాడు. అసలు ఈ ఆపరేషన్ సక్సెస్ అయ్యిందా? రఘురామ్ ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటాడు? రఘురామ్‌కు మాలతికి ఉన్న సంబంధమేమిటి? ఇలాంటి విషయాలు మిగతా కథలో తెలుస్తాయి.
విశ్లేషణ: సాధారణంగా మురుగదాస్ సినిమా అనగానే ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో పాటు పూర్తి కమర్షియల్ అంశాలకు ఓ సోషల్ మేసేజ్‌ను కూడా యాడ్ చేస్తాడు. ఆయన సినిమాల్లోని సందేశం కూడా చాలా బలంగా ఉంటుంది. న్యూ కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలతో, సరికొత్త హీరో పాత్రలు ప్రేక్షకులను సర్ఫ్రైజ్ చేస్తాయి. ఈ సినిమా కూడా ఎప్పటిలాగే తన పంథాలోనే రాసుకున్నాడు మురుగదాస్. అయితే ఈ కాన్సెప్ట్ ఆయన దర్శకత్వంలో వచ్చిన గత చిత్రాల కథాంశాలన్నింటిని మిక్స్ చేసి రాసుకున్నట్లు అనిపిస్తుంది.
తుపాకీ కల్చర్ సమాజానికి ఎంత చెడు చేస్తుందో ఈ సినిమా ద్వారా చెప్పాలని ప్రయత్నించాడు. అయితే ఈ అంశాన్ని కన్వీన్సింగ్‌గా చెప్పలేకపోయాడు. ఫస్ట్‌హాఫ్‌లో కొన్నియాక్షన్ సన్నివేశాలు, కొన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్‌తో పర్వాలేదనిపించినా, ద్వితీయార్థంలో కథలో బలం లేకపోవడంతో సినిమా స్లోగా మారిపోయింది. కథ ఒకే చోట ఉన్న భావన కలుగుతుంది. అంతేకాదు ప్రతి సినిమాలో సన్నివేశాల విషయంలో ఎంతో లాజిక్‌గా ఆలోచించే మురుగదాస్ ఈ సినిమా విషయంలో కొన్ని సన్నివేశాల్లో అలాంటి లాజిక్‌లు పాటించలేదు. ఈ సినిమా చూస్తున్నంత సేపు మురుగదాస్ తన పాత ఫార్మాట్‌కే పరిమితమైనట్లుగా అనిపిస్తుంది.
నటీనటుల పనితీరు: రఘురామ్ పాత్రలో శివ కార్తీకేయన్ మెప్పిస్తాడు. ఓ వింత వ్యాధితో బాధపడుతున్న రోగిగా అతని నటన బాగుంది. రుక్మిణీ వసంతన్ అందంగా కనిపించడంతో పాటు కొన్ని సన్నివేశాల్లో తన నటన ప్రతిభను చూపింది. విద్యుత్ జమ్వాల్ విలన్‌గా, చిరాగ్ పాత్రలో షబీర్, ఎన్ఐఏ ఆఫీసర్‌గా బీజు మేనన్ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతిక విలువలతో ఉన్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం, నేపథ్య సంగీతం చెప్పుకునే స్థాయిలో లేకపోయినా మైనస్ మాత్రం కాలేదు. ఈ చిత్రం కథ, కథనాల విషయంలో మురుగదాస్ మరింత శ్రద్ధ పెట్టి ఉంటే తప్పకుండా సినిమా ఫలితం మెరుగ్గా ఉండేది. ఓవరాల్‌గా అక్కడక్కడా ఈ మదరాసి మెప్పించినా.. చాలా చోట్ల నిరాశపరిచాడు
'మదరాసి' మూవీ రివ్యూ
Madharaasi Review
- రొటిన్ కథతో 'మదరాసి'
- ఆసక్తి పంచని ట్విస్ట్‌లు
- సాగతీతగా అనిపించే సన్నివేశాలు
Movie Details
Movie Name: Madharaasi
Release Date: 2025-09-05
Cast: Sivakarthikeyan,Rukmini Vasanth, Vidyut Jammwal,Biju Menon
Director: A. R. Murugadoss
Music: Anirudh Ravichander
Banner: Sri Lakshmi Movies
Review By: Madhu