అనుష్క ఒక వైవిధ్యభరితమైన కథతో .. పవర్ఫుల్ రోల్ తో తెరపైకి రావాలని ఆమె అభిమానులంతా కోరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో క్రిష్ దర్శకత్వంలో ఆమె చేసిన సినిమానే 'ఘాటి'. 15 ఏళ్ల క్రితం క్రిష్ కాంబినేషన్లో అనుష్క 'వేదం' సినిమా చేసింది. ఆ సినిమాలో ఆమె చేసిన 'సరోజ' పాత్ర ఎంతో పేరు తెచ్చిపెట్టింది. ఆ తరువాత వాళ్లిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమానే 'ఘాటి'. ఈ రోజునే థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. 

కథ: ఆంధ్ర - ఒడిశా బోర్డర్ లోని తూర్పు కనుమలలో ఈ కథ మొదలవుతుంది. తూర్పు కనుమల గుండా గంజాయి అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతంలో 'షీలావతి' అనే రకం గంజాయికి విపరీతమైన డిమాండ్ .. అంతర్జాతీయ మార్కెట్లో భారీ రేటు ఉంటుంది. ఆ చుట్టూ పక్కల గ్రామస్తులంతా గంజాయిని మోసే కూలీలుగా తమ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అలాంటి ఒక గ్రామానికి చెందిన జంటనే షీలావతి (అనుష్క) దేశిరాజు ( విక్రమ్ ప్రభు). పుట్టగానే షీలావతి తల్లిని పోగొట్టుకోగా, పోలీస్ కాల్పుల్లో దేశిరాజు తన తండ్రిని కోల్పోతాడు. 

ఆ కనుమల నుంచి నాయుడు (రవీంద్ర విజయ్) .. అతని తమ్ముడైన కుందల్ ( చైతన్య రావు) గంజాయి వ్యాపారాన్ని విస్తరిస్తూ వెళుతుంటారు. వాళ్లను కాదని 'ఘాటి'లు మరెక్కడా పని చేయకూడదు .. వేరు కుంపటి పెట్టకూడదు అనే కఠినమైన నిబంధన ఉంటుంది. వాళ్ల దగ్గరే షీలావతి - దేశిరాజు ఇద్దరూ కూడా 'ఘాటి'లు గా పని చేస్తూ ఉంటారు. ఇద్దరూ ప్రేమించుకుంటారు .. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటారు.

అయితే తరతరాలుగా 'ఘాటి'లకు జరుగుతున్న అన్యాయాన్ని గురించి నాయుడు (రవీంద్ర విజయ్)ని దేశిరాజు నిలదీస్తాడు. ఈ విషయంలో దేశిరాజుపై నాయుడి తమ్ముడు కుందల్ (చైతన్య రావు) పగబడతాడు. అంతేకాదు దేశిరాజు వివాహం చేసుకోవలసిన షీలావతిపై మనసు పడతాడు. ఇక ఈ ప్రాంతంలో జరుగుతున్న గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయడానికి స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా విశ్వదీప్ (జగపతిబాబు) రంగంలోకి దిగుతాడు. ఆ కొండ ప్రాంతం నుంచి గంజాయి బస్తాలలోనే కాదు, లిక్విడ్ రూపంలోను తరలించబడుతోందనే విషయం అతనికి అర్థమవుతుంది. ఈ అక్రమానికి పాల్పడుతున్నది ఎవరు? వాళ్లను విశ్వదీప్ నియంత్రించగలుగుతాడా? షీలావతితో దేశిరాజు వివాహం జరుగుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ఈ కథ మూడు వైపుల నుంచి నడుస్తుంది. ఘాటిలు .. వాళ్లతో గంజాయి మోయించే అక్రమార్కులు .. ఇన్వెస్టిగేషన్ చేసే పోలీస్ డిపార్టుమెంటు వైపు నుంచి ఈ కథ సాగుతూ ఉంటుంది. గంజాయి మోసే ఘాటిల జీవితం ఎలా ఉంటుంది? వాళ్లు ఎదుర్కునే సవాళ్లు .. సమస్యలు ఎలా ఉంటాయి? అనేది చెప్పడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నంలో కొంతవరకూ సక్సెస్ అయ్యాడు. 

ఈ కథ చాలా వేగంగా మొదలవుతుంది. ప్రధానమైన పాత్రలన్నింటినీ చాలా తక్కువ సమయంలో పరిచయం చేయడానికి ప్రయత్నించారు. ఒక పాత్ర రిజిస్టర్ అయ్యేలోగా మరో పాత్ర తెరపైకి వచ్చేస్తూ ఉంటుంది. హీరో .. హీరోయిన్ .. లోకల్ విలన్ .. నాన్ లోకల్ విలన్ .. ఇలా అందరూ తెరపైకి వచ్చి ఒకసారి కనిపించి హాజరు వేయించుకుని వెళుతున్నట్టుగా అనిపిస్తుంది. దాంతో ఆ పాత్రలను వెతికి పట్టుకుని ఊరు .. పేరు తెలుసుకోవడానికి మనకి కొంత సమయం పడుతుంది.

ఘాటిలను తమ స్వార్థానికి ఉపయోగించుకోవడానికి కొన్ని అరాచక శక్తులు చేసే ప్రయత్నాలతో ఫస్టాఫ్ నడిస్తే, సంపాదన కోసం సామాజిక బాధ్యతను మరిచిపోకూడదనే ఉపదేశాలతో .. సందేశంతో సెకాండాఫ్ కొనసాగుతుంది. ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ కీ .. క్లైమాక్స్ కి మధ్యలో, ఎమోషన్స్ ను ఒంపేసి యాక్షన్ ను మాత్రమే నింపిన సన్నివేశాలు కనిపిస్తాయి. సహజత్వానికి చాలా దూరంగా అనిపిస్తాయి. 

పనితీరు
: ఇది నాయిక ప్రధానమైన సినిమా. ఆమె చుట్టూ మూడు అంచల పద్ధతిలో విలన్స్ ఉంటారు. ఎక్కడో ఉంటూ చక్రం తిప్పేది ఒకరు .. లోకల్ గా ఉంటూ దానిని ఆచరణలో పెట్టేది ఇంకొకరు .. స్పాట్ కి వెళ్లి అమలు పరిచేది ఇంకొకరు. ఈ చివరి లైన్ లో కనిపించే చైతన్యరావునే మెయిన్ విలన్ గా చూపించడం ఈ కథలోని ట్విస్ట్. ఈ నేపథ్యంలో జిషు సేన్ గుప్తా .. హరీశ్ పేరడి .. రవీంద్ర విజయ్ వంటి వారి పాత్రలు తేలిపోతాయి. ఇక జగపతిబాబు పాత్రను వెరైటీగా చూపించడానికి చేసిన ప్రయత్నం దాదాపు ఇబ్బంది పెట్టిందనే చెప్పాలి. 

ఆర్టిస్టులంతా చాలా సీనియర్లే. అయితే ఎవరి పాత్రనూ కొత్తగా డిజైన్ చేయలేదు. ఆ పాత్రలను గురించి చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదు. అనుష్కలో మునుపటి ఆకర్షణ లేదు. ఆమె పాత్ర ఆకట్టుకునే స్థాయిలోను లేదు. అనుష్క జోడీగా ప్రేక్షకులు ఊహించుకునే స్థాయిలో విక్రమ్ ప్రభు కనిపించలేదేమో అనిపిస్తుంది. మనోజ్ రెడ్డి ఫొటోగ్రఫీ బాగుంది. తూర్పు కనుమలకు సంబంధించిన విజువల్స్ ను గొప్పగా ఆవిష్కరించాడు. విద్యాసాగర్ సంగీతం .. చాణక్య రెడ్డి ఎడిటింగ్ ఫరవాలేదు. 

ముగింపు: 'ఘాటి' గురించి క్రిష్ ఎంచుకున్న లైన్ బాగుంది. ప్రధానమైన పాత్రకి అనుష్కను ఎంపిక చేసుకోవడం బాగుంది. కానీ కథను ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా ఆవిష్కరించలేకపోయారు. విషయం లేని పాత్రలు తెరపై పేరుకుపోతూ వెళ్లడం ప్రధానమైన లోపంగానే చెప్పాలి. ఒక మంచి కథను బరువు లేని పాత్రలతో చెప్పడానికి చేసిన ప్రయత్నంగా ఈ సినిమా కనిపిస్తుంది.