తమిళనాట కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న సూరి, 'విడుదలై' సినిమాతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆయన హీరోగా చేసిన మరో సినిమానే 'మామన్'. మే 16వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడి ఆడియన్స్ ను ఆకట్టుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'వినాయక చవితి' రోజు నుంచి తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
కథ: 'తిరుచ్చి'లో ఇన్బా (సూరి) ఒక ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉంటాడు. తల్లి .. అక్క గిరిజ (శ్వాసిక) ఇదే అతని కుటుంబం. గిరిజ వివాహం రవి (బాబా భాస్కర్)తో జరుగుతుంది. అయితే వివాహమై పదేళ్లు అవుతున్నా పిల్లలు లేకపోవడం వలన, గిరిజకి అత్తగారి పోరు ఎక్కువైపోతోంది. చుట్టుపక్కల వారి మాటలు కూడా ఆమెను చాలా బాధపెడుతూ ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఆమె నెల తప్పుతుంది. ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. ఆ పిల్లాడికి 'నిలన్' అనే పేరు పెడతారు.
గిరిజ కాన్పు సమయంలో ఆమెను ఇన్బా ఎంత బాగా చూసుకుంటున్నాడనేది, ఆ హాస్పిటల్లో డాక్టర్ గా పనిచేస్తున్న రేఖ (ఐశ్వర్య లక్ష్మి) గమనిస్తుంది. తల్లిని .. అక్కను అంత ప్రేమగా చూసుకుంటున్న అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే, తన జీవితం హ్యాపీగా ఉంటుందని భావిస్తుంది. తన కుటుంబ సభ్యులను ఒప్పించి ఇన్బాను పెళ్లిచేసుకుంటుంది. ఎన్నో ఆశలతో ఆమె ఇన్ బా ఇంట్లో అడుగుపెడుతుంది.
అయితే మేనమామ అయిన ఇన్బా అంటే 'నిలన్' కి ఎంతో ఇష్టం. ఆ కుర్రాడిని వదిలిపెట్టి ఇన్బా కూడా ఉండలేడు. ఆ కుర్రాడి కారణంగా ఇన్బా - రేఖ ఫస్టు నైట్ కేన్సిల్ అవుతుంది. హనీమూన్ కి వెళ్లాలనే ప్లాన్ కూడా వాయిదా పడుతుంది. తన భర్తతో సరదాగా కాసేపు గడపాలనే రేఖ కోరిక నెరవేరకుండానే పోతుంటుంది. అప్పుడు ఆమె ఏం చేస్తుంది? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? అనే మలుపులతో ఈ కథ ముందుకు వెళుతుంది.
విశ్లేషణ: అక్కా తమ్ముడు .. భార్యాభర్తలు .. మేనమామ మేనల్లుడు మధ్య ఎమోషన్స్ ప్రధానంగా దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. ఈ మూడు వరుసలలోను కథానాయకుడి పాత్ర కేంద్ర బిందువుగా కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా ఈ మూడు కోణాలను ఫేస్ చేయవలసి ఉంటుంది. అందువలన ప్రధానమైన పాత్రకి ప్రతి ఒక్కరూ కనెక్ట్ అవుతారు. అంత సహజంగా దర్శకుడు ఈ కథను డిజైన్ చేసుకున్నాడు.
తల్లిదండ్రులు తరువాత కూడా ఆడపిల్లలకు పుట్టింటివారి వైపు నుంచి అండదండలు ఉండాలనే ఉద్దేశంతో, పెద్దవాళ్లు మన ఆచార సంప్రదాయాలను ఏర్పరిచారు. వివాహం తరువాత కూడా అన్నాచెలెళ్లు .. అక్కాతమ్ముళ్లు ప్రేమగా మసలుకోవడానికి కారణం ఈ ఆచారవ్యవహారాలే. అలాంటి ఒక మేనమామ, నిస్వార్థమైన తన ప్రేమ కారణంగా ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయవలసి వచ్చిందనే కథను దర్శకుడు ఆవిష్కరించిన విధానం బాగుంది.
చిన్నప్పటి నుంచి కలిసి పెరగడం వలన ఒకే ఇంట్లోని వారి మధ్య ఉండే ప్రేమానురాగాలు వేరు. కానీ కొత్త కోడలిగా ఆ ఇంటికి వచ్చేవారు ఆ అనుబంధాన్ని అర్థం చేసుకుంటూ మసలుకోవడం వేరు. లేదంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుందనే విషయాన్ని దర్శకుడు ఆవిష్కరించిన విధానం మనసును టచ్ చేస్తుంది. పరిమితమైన పాత్రలతో దర్శకుడు చేసిన ప్రయత్నం, సహజసిద్ధమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది.
పనితీరు: ఈ మధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ నుంచి ఎక్కువ కథలు పలకరిస్తూ ఉండగా, ఈ మధ్యలో నుంచి ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఒక కథ పలకరించడం కాస్త కొత్తగా అనిపిస్తుంది. కథాకథనాల పరంగా ఆ కంటెంట్ ను కనెక్ట్ చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ముఖ్యంగా చెవులు కుట్టించే సీన్ .. గిరిజను రేఖ నిలదీసే సీన్ .. దర్శక ప్రతిభకు నిదర్శనంగా నిలుస్తాయి.
భర్తగా .. తమ్ముడిగా .. మేనమామగా సంఘర్షణతో కూడిన పాత్రలో సూరి నటన మెప్పిస్తుంది. అతని అక్కయ్య పాత్రలో శ్వాసిక నటనకు ప్రశంసలు దక్కుతాయి. ఐశ్వర్య లక్ష్మి నటన కూడా ఆకట్టుకుంటుంది. దినేశ్ పురుషోత్తమన్ ఫొటోగ్రఫీ .. హేషం అబ్దుల్ వాహెబ్ నేపథ్య సంగీతం .. గణేశ్ శివ ఎడిటింగ్ బాగున్నాయి.
ముగింపు: పెళ్లికి ముందు ఒక వ్యక్తిలో ఏ అంశాలైతే నచ్చుతాయో, పెళ్లి తరువాత అవే అంశాలు అసహనాన్ని కలిగిస్తాయి. అలకలు .. ఆవేశాలు .. ఆవేదనలకు కారణమవుతాయి. జీవితమంటే అర్థం చేసుకుని సర్దుకుపోవడం. ఆవేశంతో తొందరపడటం కాదు అనే సందేశంతో కూడిన సినిమా ఇది. ఫ్యామిలీతో కలిసి చూడదగిన కంటెంట్ ఇది.
'మామన్' (జీ 5) మూవీ రివ్యూ!
Maaman Review
- తమిళంలో రూపొందిన సినిమా
- ఫ్యామిలీ ఎమోషన్స్ తో సాగే కంటెంట్
- బలమైన కథాకథనాలు
- సహజత్వంతో కూడిన సన్నివేశాలు
- వినోదంతో కూడిన సందేశం
Movie Details
Movie Name: Maaman
Release Date: 2025-08-27
Cast: Soori, Swasika, Aishwarya lakshmi, Rajkiran, Baba Bhaaskar, Master Prageeth Sivan
Director: Prashanth Pandiyaraj
Music: Hesham Abdul Wahab
Banner: Lark Studios
Review By: Peddinti
Trailer