మలయాళం నుంచి వచ్చిన మరో మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ 'సూత్రవాక్యం'. టైటిల్ తోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాకి, యూజిన్ జోస్ చిరమ్మెల్ దర్శకత్వం వహించాడు. జులై 11వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నెల 21వ తేదీ నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: 'పాలక్కడ్' పరిధిలో క్రిస్టోఫర్ జేవియర్ (షైన్ టామ్ చాకో) పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆ చుట్టుపక్కల ఉండే ఇంటర్ పిల్లలకు అతను మ్యాథ్స్ చెబుతూ ఉంటాడు. అందువలన అక్కడి పిల్లలంతా అతనితో కాస్త చనువుగానే ఉంటారు. ఎక్కడ ఎలాంటి సమస్య తలెత్తినా క్రిస్టోఫర్ వెంటనే స్పందిస్తూ ఉంటాడు. అలాంటి ఆయనను స్థానికంగా ఉండే థామస్ కలుసుకుంటాడు. పాడుబడిన బావిని వ్యర్థాలతో నింపడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదు చేస్తాడు. 

ఆ గ్రామానికి సంబంధించిన ఆ బావి ప్రస్తుతం ఉపయోగం లేకుండా పడి ఉంటుంది. అందువలన ఆ బావిని పూడ్పించాలని క్రిస్టోఫర్ నిర్ణయించుకుంటాడు. ఆయన దగ్గరికి మ్యాథ్స్ చెప్పించుకోవడానికి వచ్చే ఇంటర్ పిల్లల్లో, అఖిల్ -  ఆర్య ఒకరినొకరు ఇష్టపడతారు. ఈ విషయం ఆర్య అన్నయ్య వివేక్ (దీపక్ పరంబోల్)కి తెలుస్తుంది. అతను ఆ ఇద్దరిపై చేయిచేసుకుంటాడు. వివేక్ డిగ్రీ చదువుతూ ఉండగా, ఆ ఇంట్లో 'ఆర్య' పుడుతుంది. స్నేహితులు గేలి చేయడంతో, అతను అప్పటి నుంచి ఆర్యపై కోపంతోనే ఉంటాడు. 

ఆర్యను తీవ్రంగా గాయపరిచిన వివేక్ పై అఖిల్ కోపంతో ఉంటాడు. వివేక్ పై ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం అఖిల్ ఒక ప్లాన్ వేస్తాడు. ఆ ప్లాన్ ఏమిటి? అది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది? ఈ విషయంలో క్రిస్టోఫర్ కి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది. 

విశ్లేషణ: క్రైమ్ థ్రిల్లర్ .. ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ కి సంబంధించిన కథలను మలయాళం దర్శకులు డీల్ చేసే తీరు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఒక చిన్న లైన్ పట్టుకుని, దానిని ఉత్కంఠభరితంగా చెప్పడానికి వాళ్లు చేసే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. అలా ఓ మాదిరి బడ్జెట్ లో రూపొందించిన సినిమా ఇది. చాలా తక్కువ పాత్రలతో .. తక్కువ బడ్జెట్ లో ప్లాన్ చేసిన ఈ సినిమా .. చాలా నిదానంగా మొదలవుతుంది. 

సాధారణంగా మలయాళ సినిమాలలోని కథలు సహజత్వానికి చాలా దగ్గరగా ఉండేలా చూసుకుంటారు. అందువలన సన్నివేశాలను కాస్త డీటేల్డ్ గా చెప్పడానికే ప్రయత్నిస్తారు. అసలు విషయం దగ్గరికి కథ వెళ్లడానికి కొంత సమయం తీసుకుంటారు. కాకపోతే ఈ సినిమా విషయంలో ఇంకాస్త ఆలస్యమైందని అనిపిస్తుంది. ఆ కీలకమైన అంశానికి ముందున్న సన్నివేశాలు అంత బలమైనవి కాకపోవడం వలన .. క్యూరియాసిటీని పెంచేవి కాకపోవడం వలన కూడా అలా అనిపించవచ్చు.

 ఇక ఇక్కడి నుంచి కథ హడావిడిగా పరిగెడుతుందని అనుకుంటారు .. కానీ అలా జరగదు. నిదానంగా .. నింపాాదిగానే ఆ మలుపులు తీసుకుంటుంది. ఇన్వెస్టిగేషన్ వేరే ట్రాక్ లోకి వెళ్లి మళ్లీ మెయిన్ ట్రాక్ లోకి వస్తుంది. అప్పుడు కూడా ఆడియన్స్, నెక్స్ట్ ఏం జరుగుతుందా? అని ఉత్కంఠగా ఎదురుచూసే పరిస్థితి ఉండదు. మొదటి 50 నిమిషాలతో పోలిస్తే, ఆ తరువాత కథ ఫరవాలేదు అనిపిస్తుందంతే.       

 పనితీరు: సాధారణంగా థ్రిల్లర్ జోనర్ నుంచి వచ్చిన మలయాళ సినిమాల జోరు వేరే ఉంటుంది. పోలీస్ పాత్రల వెంటే ప్రేక్షకులు పరిగెడతారు. కథ అనూహ్యమైన మలుపులు తీసుకోవడం .. ఆశ్చర్యపరిచే ట్విస్టులు ఉండటం జరుగుతుంది. కానీ అందుకు భిన్నంగా ఈ సినిమా కథాకథనాలు నిదానంగా కదులుతాయి. 

ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు. అనవసరమైన సన్నివేశాలు ఉండవుగానీ, పోలీస్ కథల్లో ఉండవలసిన స్పీడ్ లేకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. 

ముగింపు
: నేరం జరగడానికి దారితీసిన పరిస్థితులు .. నేరం జరిగిన సందర్భం .. నేరస్థులను పట్టుకోవడానికి చేసే ఇన్వెస్టిగేషన్ థ్రిల్లింగ్ గా ఉండాలి. నెక్స్ట్ ఏం జరగబోతోంది? అనే ఒక ఉత్కంఠ లేకపోతే .. సహజత్వం పేరుతో పోలీసులు కంగారు పడకుండా ఇన్వెస్టిగేషన్ ను చక్కబెడితే ప్రేక్షకులు డీలాపడతారు. ఈ కంటెంట్ విషయంలో అదే జరిగిందేమో అనిపిస్తుంది.