ఈ మధ్యకాలంలో 'కోర్ట్ రూమ్ డ్రామా'కి సంబంధించిన కథలు ఎక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు ఈ తరహా కథల పట్ల ఆడియన్స్ అంతగా ఆసక్తిని చూపించలేదు. కానీ ఇప్పుడు ఈ తరహా కథలను ప్రెజెంట్ చేసే తీరు మారడంతో, ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నేపథ్యంలో మలయాళం నుంచి వచ్చిన సినిమానే 'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'. జులైలో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఈ నెల 15 నుంచి 'జీ 5'లో స్ట్రీమింగ్ అవుతుండగా, 22వ తేదీ నుంచి తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
కథ: జానకీ విద్యాధరన్ (అనుపమ పరమేశ్వరన్) రేప్ కి గురవుతుంది. ఆ విషయాన్ని పోలీస్ వారి దృష్టికి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించిన ఆమె తండ్రి, అక్కడ జరుగుతున్న ఒక గొడవలో ప్రాణాలు కోల్పోతాడు. తన ఫ్రెండ్ నవీన్ తో కలిసి పోలీస్ స్టేషన్ కి వచ్చిన జానకి, తండ్రి మరణ వార్తను గురించి తెలుసుకుని కుప్పకూలిపోతుంది. ఆమె రేప్ కి గురైన విషయం అప్పుడే పోలీస్ వారికి తెలుస్తుంది.
జానకి బెంగుళూర్ లో ఒక సాఫ్ట్ వేర్ సంస్థలో పనిచేస్తూ ఉంటుంది. తాను పుట్టి పెరిగిన కేరళలో జరుగుతున్న 'జాతర'కు స్నేహతురాళ్లను వెంటబెట్టుకుని వస్తుంది. వాళ్లను బస్సు ఎక్కించిన తరువాత, అంతకు ముందు తాము ఆగిన 'బేకరీ'లో ఫోన్ మరిచిపోయిన విషయం గుర్తుకు వస్తుంది. అప్పటికే బాగా చీకటిపడుతుంది. ఆ ఫోన్ కోసం బేకరికి వెళ్లిన సమయంలోనే గుర్తు తెలియని వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డారని న్యాయస్థానంలో జానకి చెబుతుంది.
అయితే అడ్వకేట్ గా మంచి పేరున్న డేవిడ్ (సురేశ్ గోపీ), బేకరీ వారి తరఫు నుంచి రంగంలోకి దిగుతాడు. లభించిన ఆధారాలను దృష్టిలోపెట్టుకుని, తన తెలివితేటలతో బేకరీ వారిని కాపాడతాడు. ఆ సమయంలో జానకి చాలా బాధపడుతుంది. అది చూసిన డేవిడ్ కి, తాను ఎక్కడో పొరపాటు చేశాననే ఆలోచన మొదలవుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఆ నిర్ణయం ఎలాంటి మలుపులు తీసుకుంటుంది? అనేది కథ.
విశ్లేషణ: ఒక కేసుకి సంబంధించిన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడం, కోర్టు తీర్పు గురించి ప్రజలంతా ఉత్కంఠగా ఎదురుచూడటం .. మీడియాలో వరుస కథనాలు .. పోలీస్ వారి హడావిడి వంటి అంశాలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అలాంటి ఒక కోణంలో ఆవిష్కరించబడిన కథనే ఇది.
సాధారణంగా కోర్టు రూమ్ డ్రామాలలో, వాదోపవాదాలు .. సేకరించే ఆధారాలు .. అసలేం జరిగిందనే పరిశోధన ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాయి. ఇరువైపులా గల న్యాయవాదులు లాజిక్కులు పట్టుకుంటూ ముందుకు వెళ్లడం వంటి అంశాలు ఆసక్తిని రేపుతూ ఉంటాయి. ఏ క్షణంలో కేసు ఏ మలుపు తిరుగుతుందో అనే ఒక కుతూహలాన్ని కలిగించినప్పుడే ఈ తరహా కథలు కనెక్ట్ అవుతాయి. ఈ సినిమా విషయానికి వస్తే అలాంటి ఒక ఇంట్రెస్ట్ ను కలిగించలేకపోయిందనే చెప్పాలి.
ఈ కథలో మూడు వైపుల నుంచి ప్రేక్షకులకు సందేహాలను రేకెత్తిస్తూ దర్శకుడు ముందుకు వెళ్లాడు. ఆ మూడు వైపుల నుంచి ముడులు విప్పుకుంటూ రావడం ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తించాలి. కానీ ఎక్కడికక్కడ తేలిపోవడం నిరాశ పరుస్తుంది. అనుమానితులు .. కారకులు తాలూకు సన్నివేశాలు సైతం పెద్దగా ప్రభావితం చేయలేకపోయాయి. పైగా ఆరంభంలో ఈ కథను ఫాదర్ ఫ్రాన్సిస్ కేసుతో ముడిపెట్టడం వలన గందరగోళమే తప్ప, ఒరిగింది ఏమీ లేదు.
పనితీరు: అత్యాచారానికి దారితీసిన పరిస్థితులు .. అందుకు కారకులు .. అనుమానితులు .. ఆధారాల సేకరణ .. వ్యూహాలు .. వాదోపవాదాలు వంటి అంశాలపై దర్శకుడు మరింత కసరత్తు చేస్తే బాగుండేదేమో అనిపిస్తుంది. వాదోపవాదాల విషయంలో 'పస' లేకపోవడం నిరాశకు గురిచేస్తుంది. అనుపమ మంచి ఆర్టిస్ట్ కనుక .. ఆమె నటన గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయంతే.
ముగింపు: ఒక అత్యాచార సంఘటన చుట్టూ అల్లుకున్న ఈ కథ, సీరియస్ గా కొనసాగుతుంది. అనూహ్యమైన మలుపులు .. ట్విస్టులు పెద్దగా కనిపించవు. ఆడియన్స్ వెయిట్ చేసే కీలకమైన సన్నివేశాలు చాలా సాధారణంగా వచ్చి వెళ్లడం .. ఎమోషన్స్ పరంగా ఎక్కడా కనెక్ట్ కాకపోవడం నిరాశను కలిగిస్తుంది.
'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ' (జీ 5) మూవీ రివ్యూ!
Janaki Vs State Of Kerala Review
- మలయాళంలో రూపొందిన సినిమా
- ప్రధానమైన పాత్రలో అనుపమా పరమేశ్వరన్
- ఈ నెల 15 నుంచి మొదలైన స్ట్రీమింగ్
- తెలుగులోను అందుబాటులోకి
- ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాని కంటెంట్
Movie Details
Movie Name: Janaki Vs State Of Kerala
Release Date: 2025-08-22
Cast: Anupama Parameswaran,Suresh Gopi,Divya Pillai,Askar Ali
Director: Pravin Narayanan
Music: Ghibran
Banner: Cosmos Entertainments
Review By: Peddinti
Trailer