'సారే జహాసే అచ్ఛా' .. అనే టైటిల్ తోనే ఇది దేశభక్తికి సంబంధించిన సిరీస్ అనే విషయం అర్థమైపోతుంది. 'స్పై థ్రిల్లర్' జోనర్లో రూపొందిన ఈ సిరీస్ కి సుమిత్ పురోహిత్ దర్శకత్వం వహించాడు. బాంబే ఫేబుల్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సిరీస్ లో ప్రతీక్ గాంధీ ..  సన్నీ హిందూజా ప్రధానమైన పాత్రలను పోషించగా, సుహైల్ నయ్యర్ .. క్రుతిమా క్రమా .. రజత్ కపూర్ .. అనూప్ సోని .. తిలోత్తమ షోమ్ కీలకమైన పాత్రలలో కనిపిస్తారు. 6 ఎపిసోడ్స్ గా ఈ నెల 13 నుంచి స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.    

కథ: 1970లలో నడిచే కథ ఇది. పాకిస్థాన్ తనని తాను అణుశక్తి కలిగిన దేశంగా నిరూపించుకోవడం కోసం, అణు సంబంధమైన సన్నాహాలు మొదలుపెడుతుంది. పాక్ కి సంబంధించిన ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ వారు అందుకు అవసరమైన ఏర్పాట్లు చకచకా చేసేస్తూ ఉంటారు. ఈ విషయానికి సంబంధించిన రహస్య సమాచారం, ఇండియాలోని 'రా' చీఫ్ 'కావో' (రజత్ కపూర్) కి అందుతుంది. దాంతో ఆయన ప్రధానితో సమావేశమై ప్రమాదకర పరిస్థితులను గురించి చర్చిస్తాడు. 

పాకిస్థాన్ అణుశక్తిని సంపాదించుకుంటే ఏం జరుగుతుందనేది, స్పై ఆఫీసర్ విష్ణు శంకర్ ( ప్రతీక్ గాంధీ)కి 'కావో' వివరిస్తాడు. పాకిస్థాన్ వెళ్లి అక్కడి పరిస్థితులను గమనిస్తూ, అణుశక్తిని సొంతం చేసుకోవాలనుకునే వాళ్ల ప్రయత్నాలను విఫలం చేయమని ఆదేశిస్తాడు. అయితే అక్కడ చాలా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటాయనీ, అప్రమత్తంగా లేకపోతే అక్కడి నుంచి బయటపడటం అసాధ్యమని హెచ్చరిస్తాడు. అప్పటికే 'మోహిని'( తిలోత్తమా షోమ్)తో విష్ణు శంకర్ కి పెళ్లి నిశ్చయమైందని తెలుసుకుని, పెళ్లి తరువాత ఆమెను తీసుకుని పాకిస్థాన్ కు వెళితే అతనిపై ఎవరికీ ఎలాంటి అనుమానం రాదని అంటాడు. 

అలాగే అతను మోహినిని పెళ్లి చేసుకుని, ఆమెతో కలిసి పాకిస్థాన్ వెళతాడు. పాకిస్థాన్ అధ్యక్షుడు స్వయంగా నియమించిన మూర్తాజా మాలిక్ (సన్నీ హిందూజా), పాకిస్థాన్ వ్యతిరేకుల విషయంలో చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అతనికి ఎంతమాత్రం అనుమానం వచ్చినా, తన ఆపరేషన్ పూర్తిగా దెబ్బతుంటుందనే విషయం విష్ణు శంకర్ కి అర్థమైపోతుంది. పాకిస్థాన్ అణుబాంబు తయారు చేయడం లేదనీ, కొనుగోలు చేస్తుందనే ఒక సమాచారం అతనికి అందుతుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటాడు? అనేది కథ. 

విశ్లేషణ: ఈ సిరీస్ ను 6 ఎపిసోడ్స్ గా అందించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమిషాలకు పైనే ఉంటుంది. ఈ కథ ఇండియా నుంచి మొదలై పాకిస్థాన్ .. కరాచీ .. లెబనాన్ .. పారిస్ .. అమెరికా వంటి ప్రాంతాలను టచ్ చేస్తూ వెళుతుంది. ప్రధానమైన పాత్రలు ఒక పది వరకూ కనిపిస్తాయి. ఈ పాత్రలను రిజిస్టర్ చేసి, ఆ పాత్రలను టచ్ చేస్తూనే కథను నడిపించిన తీరు బాగుంది. ముఖ్యంగా 1970ల నాటి వాతావరణాన్ని ఆవిష్కరించడం ఆకట్టుకుంటుంది. 

భారత్ - పాకిస్థాన్ కి సంబంధించి, దేశభక్తి కోణంలో ఒక వైపున కథ కొనసాగుతూ ఉంటుంది. మరో వైపున ప్రేమలో ఉన్న జంట .. కొత్తగా పెళ్లైన జంట .. తల్లీ కొడుకుల ఎమోషన్స్ కూడా ఈ కథకు కనెక్ట్ అవుతూ ఉంటాయి. 1970ల నాటి వాతావరణంలో, దేశ రక్షణ కోసం తనకి అప్పగించిన ఒక ఆపరేషన్ ను ఒక స్పై ఆఫీసర్ ఎలా సైలెంట్ గా చక్కబెట్టాడనే విషయాన్ని ఆవిష్కరించిన తీరు మెప్పిస్తుంది. దాదాపుగా కథ చాలా సీరియస్ గానే నడుస్తుంది. 
           
'రా' టీమ్ ఎలా పనిచేస్తుంది? 'రా' సభ్యుల వర్కింగ్ స్టైల్ ఎలా ఉంటుంది?   వాళ్లకి ఎలాంటి ప్రమాదాలు ఎదురవుతాయి? అనేది దర్శకుడు చూపించే ప్రయత్నం చేశాడు. దేశ రక్షణ కోసం  గూఢచారులు తమ ప్రాణాలను పణంగా పెడతారు. తమ త్యాగం కూడా రహస్యంగానే ఉండిపోతుందని తెలిసి కూడా, అంకితభావంతో పనిచేస్తూ వెళతారనే ఒక విషయాన్ని దర్శకుడు స్పష్టం చేసిన తీరు ఆలోచింపజేస్తుంది. 

పనితీరు: ఈ సిరీస్ మొత్తం చూసిన తరువాత కథ .. కథనం ఒక ఎత్తయితే, 1970ల నాటి వాతావరణాన్ని తెరపై ఆవిష్కరించడం మరో ఎత్తు అనిపిస్తుంది. వస్తువులు .. వాహనాలు .. బంగళాలు .. కార్లు .. కాస్ట్యూమ్స్ .. ఇలా ప్రతి చిన్న విషయంలో జరిగిన పరిశోధన .. పరిశీలన  మంచి మార్కులు తెచ్చిపెడుతుంది.

ఇది 1970ల నాటి కాలంతో ముడిపడిన కథనే అయినా, కథనంలో వేగం కనిపించదు. సన్నివేశాల కంటే కూడా, వ్యూహాలు .. వాటి తాలూకు సంభాషణలతోనే ఎక్కువ సమయం గడిచిపోతుంది. యాక్షన్ కి ఏ మాత్రం అవకాశం లేకపోవడం కూడా ఒక రకమైన అసంతృప్తిని కలిగిస్తుంది. నటీనటులు .. సాంకేతిక నిపుణులు తమ పనికి న్యాయం చేశారు. 

ముగింపు: దర్శకుడు తాను ఏదైతే తెరపై చూపించాలని అనుకున్నాడో, దానిని సహజత్వానికి దగ్గరగా ఆవిష్కరించడానికే ప్రయత్నించాడు. అయితే ఒక గూఢచారి తన ఉనికి బయటకి తెలియకుండా సైలెంట్ గా పనులు చక్కబెట్టడమనేది ఈ కథకి ఎంతటి సహజత్వాన్ని తెచ్చిందో, అంత నిదానంగా సాగిన కథనం కూడా ఆ స్థాయిలోనే ఓపికను పరీక్షించిందేమో అనిపిస్తుంది.