ఆ మధ్య కాలంలో బయోపిక్ ల జోరు కొనసాగింది. సినిమా .. క్రీడా .. రాజకీయ రంగాలకి చెందిన ప్రముఖ వ్యక్తుల జీవితాలు బయోపిక్ లు గా తెరకెక్కాయి. అలా రూపొందిన మరో బయోపిక్ గా 'విజయానంద్' కనిపిస్తుంది. కర్ణాటక ప్రాంతానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త 'విజయ్ సంకేశ్వర్' జీవితచరిత్ర ఆధారంగా నిర్మితమైన సినిమా ఇది. ఆయన వారసుడు ఆనంద్ సంకేశ్వర్ నిర్మించిన ఈ సినిమా, డిసెంబర్ 9 వ తేదీన 2022లో విడుదలైంది. ఈ నెల 8వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: విజయ్ సంకేశ్వర్ ఓ మిడిల్ క్లాస్ కుటుంబానికి చెందిన యువకుడు. 'గదగ్'లో ఆయన తండ్రి ఒక చిన్న ప్రింటింగ్ ప్రెస్ నడుపుతూ ఉంటాడు. ముంబై నుంచి కొత్త మెషిన్ కొనుక్కొచ్చిన విజయ్ సంకేశ్వర్, సాధ్యమైనంత త్వరగా ముద్రణ కొనసాగేలా చేస్తాడు. తన తెలివితేటలతో పెద్దమొత్తంలో ఆర్డర్లు వచ్చేలా చేస్తాడు. స్కూటర్ .. ఆ తరువాత కారులో తిరిగే స్థాయికి చేరుకుంటాడు. ఆ సమయంలోనే 'లలిత'తో ఆయన వివాహం జరుగుతుంది.
కుటుంబ సభ్యులంతా ప్రింటింగ్ ప్రెస్ పైనే ఆధారపడటం మంచిది కాదని భావించిన విజయ్ సంకేశ్వర్, తాను ట్రాన్స్ పోర్టు బిజినెస్ మొదలుపెట్టాలని అనుకుంటాడు. అనుభవం లేని పనులు మొదలుపెట్టొదని తండ్రి వారిస్తాడు. ముందుకు వెళుతూ ఉంటే అనుభవం అదే వస్తుంది అన్నట్టుగా ఆయన ఒక లారీని కొనుగోలు చేస్తాడు. 'గదగ్' మార్కెట్లో తన లారీని పెడతాడు. అయితే ఆ మార్కెట్ కి సంబంధించిన రవాణా అంతా కూడా జీ ఎమ్ బ్రదర్స్ కనుసన్నలలో నడుస్తూ ఉంటుంది.
ఇక అదే మార్కెట్ లో రమాకాంత్ పాటిల్ లారీలు కూడా నడుస్తూ ఉంటాయి. జీఎమ్ బ్రదర్స్ కీ .. రమాకాంత్ పాటిల్ కి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అయితే కొత్తగా విజయ్ సంకేశ్వర్ కూడా అదే బిజినెస్ లోకి దిగడంతో .. మార్కెట్ లో తన లారీని పెట్టడంతో వాళ్లిద్దరూ ఒకటవుతారు. విజయ్ సంకేశ్వర్ ను దెబ్బతీయాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఎలాంటి ప్లాన్ చేస్తారు? వాళ్లను విజయ్ సంకేశ్వర్ ఎలా ఎదుర్కొంటాడు? అనేది కథ.
విశ్లేషణ: జీవితంలో నీతిగా నిలబడటం .. నిజాయితీతో ఎదగడం చాలా కష్టమైన విషయం. వ్యాపారంలో నీతి నిజాయితీలకు కట్టుబడి ఉండటం మరింత కష్టం. ఏ వ్యాపారాన్ని ఎక్కడ ప్రారంభించినా అక్కడివారికి అది పోటీ అవుతూనే ఉంటుంది. అక్కడి నుంచి శత్రువులు పుట్టుకురావడం మొదలవుతుంది. అలాంటి వాళ్లను ఎదిరిస్తూ ముందుకు వెళ్లడానికి ధైర్యం కావాలి .. వాళ్లు సృష్టించే సుడిగుండాలను దాటుతూ వెళ్లడానికి మనో నిబ్బరం కావాలి. అలాంటి అంశాలను ప్రధానంగా చేసుకునే ఈ కథ ముందుకు వెళుతుంది.
ఈ కథలో విజయ్ సంకేశ్వర్ కి వ్యాపారంలో పోటీదారుల నుంచి సమస్య తలెత్తుతుంది. రాజకీయ నాయకుల నుంచి .. వాళ్లు ఎగదోసే అనుచరుల నుంచి కూడా తలనొప్పి తయారవుతుంది. ఒక పత్రిక ఆయనను టార్గెట్ చేస్తుంది. ఆయన గురించి లేనిపోనివి రాస్తూ, ఆయన వ్యాపారాలను దెబ్బకొట్టడానికి ట్రై చేస్తూ ఉంటుంది. అలాంటి ప్రతికూల పరిస్థితులలో విజయ్ సంకేశ్వర్ ముందుకు వెళ్లిన తీరును దర్శకుడు చూపించిన తీరు మెప్పిస్తుంది.
1969 మొదలైన విజయానంద్ ప్రయాణాన్ని అంచలంచెలుగా చూపిస్తూ వచ్చిన విధానం ఆకట్టుకుంటుంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని ఆవిష్కరించడంలో సక్సెస్ అయ్యారు. ఆయా పాత్రలను తీర్చిదిద్దిన తీరు .. ఫ్యామిలీ ఎమోషన్స్ ను కనెక్ట్ చేసిన పద్ధతి ఆడియన్స్ కి కనెక్ట్ అవుతాయి. జీవితంలో ఒక వ్యక్తి ఎదగాలనుకుంటే నీతి - నిజాయితీ - తనపై తనకి గల నమ్మకంతో పాటు, కుటుంబ సభ్యుల సహకారం అవసరం అవుతుందని నిరూపించిన సినిమా ఇది.
పనితీరు: దర్శకుడు ఈ బయోపిక్ కి సంబంధించిన స్క్రిప్ట్ ను పెర్ఫెక్ట్ గా తయారు చేసుకున్నాడు. ఆయన జీవితంలో తలెత్తిన సమస్యలు .. వాటిని ఆయన అధిగమించిన తీరు .. కొత్త మలుపులకు సంబంధించిన ఘట్టాలను .. ఆయన అంతరంగాన్ని ఆవిష్కరించిన విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఆర్టిస్టులంతా చాలా బాగా చేశారు. బీజీ సంకేశ్వర్ గా అనంత్ నాగ్ .. విజయ్ సంకేశ్వర్ గా నిహాల్ .. ఆనంద్ సంకేశ్వర్ గా భరత్ బోపన్న ఆ పాత్రలకు న్యాయం చేశారు. కీర్తన్ పూజారి ఫొటోగ్రఫీ .. గోపీసుందర్ సంగీతం .. హేమంత్ కుమార్ ఎడిటింగ్ ఫరవాలేదు అనిపిస్తుంది.
ముగింపు: ఇది కర్ణాటక ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త బయోపిక్. అందువలన రెగ్యులర్ సినిమాలో మాదిరిగా వినోదభరితమైన అంశాల కోసం వెయిట్ చేయకూడదు. ఎంతవరకూ స్ఫూర్తిని ఇచ్చింది అనే విషయంపైనే ఆడియన్స్ ఆలోచన చేయవలసి వస్తుంది. ఆ వైపు నుంచి చూస్తే ఫరవాలేదనిపించే కంటెంట్ ఇది.
'విజయానంద్'(ఆహా) మూవీ రివ్యూ!
Vijayanand Review
- కన్నడ నుంచి వచ్చిన బయోపిక్
- ఈ నెల 8 నుంచి తెలుగులో అందుబాటులోకి
- స్ఫూర్తిని కలిగించే కథ
- ఆలోచింపజేసే సందేశం
Movie Details
Movie Name: Vijayanand
Release Date: 2025-08-08
Cast: Nihal, Bharath Bopanna, Anant Nag, Ravichandran, Prakash Belawadi
Director: Rishika Sharma
Music: Gopi Sundar
Banner: VRL Film Produtions
Review By: Peddinti
Trailer