సముద్రం .. జాలరుల జీవితం నేపథ్యంలో చాలానే సినిమాలు .. సిరీస్ లు వచ్చాయి. సత్యదేవ్ - ఆనంది ప్రధానమైన పాత్రలను పోషించిన 'అరేబియా కడలి' కూడా ఇదే నేపథ్యంలో రూపొందింది. సూర్య కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 8వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథ ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: చేపలవాడ - మత్స్యవాడ సముద్రతీరంలో .. పక్కపక్కనే ఉన్న గ్రామాలు. అయితే అక్కడి సముద్రంలో చేపలు పట్టడానికి అనుకూలమైన పరిస్థితులు ఉండవు. జెట్టీ .. ఫిషింగ్ హార్బర్ వస్తే తప్ప చేపల వేట సాధ్యపడదు. అందువలన ఆ గ్రామాల నుంచి జాలరులు గుజరాత్ కి వలస వెళుతూ ఉంటారు. అక్కడి 'సంగరోల్' నుంచి వాళ్లకి ఒక ఏజన్సీ బోట్లు ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. మగాళ్లంతా చేపలవేటకు గుజరాత్ వెళ్లి వచ్చేవరకూ, వారి కుటుంబాలు భయం గుప్పెట్లో బ్రతుకుతుంటాయి. 

 చేపలవాడకి చెందిన బద్రి ( సత్యదేవ్) మత్స్యవాడికి చెందిన గంగ (ఆనంది) ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే ఈ రెండు గ్రామాలకి మధ్య పాత పగలు .. ప్రతీకారాలు ఉంటాయి.  తమ ఊళ్ల మధ్య గొడవలుపోయి, చేపలవేటలోని ఇబ్బందులు తొలగిపోవడం కోసం గంగ - బద్రి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే బద్రితో గంగ తిరగడం ఆమె తండ్రి నానాజీకి ఎంతమాత్రం నచ్చదు. తన ఊరికి చెందిన శేఖర్ (వంశీకృష్ణ) కి గంగను ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించుకుంటాడు.       

ఈ నేపథ్యంలోనే చేపలవాడ నుంచి బద్రి .. మత్స్యవాడ నుంచి నానాజీ బృందం గుజరాత్ కి వెళతారు. అక్కడి ఏజన్సీవారు ఏర్పాటు చేసిన పాత పడవలలో సముద్రంలోకి వెళతారు. కొంతదూరం వెళ్లిన తరువాత 'బోట్'లోని సాంకేతిక సమస్యలను గుర్తిస్తారు. అదే సమయంలో తాము పాకిస్థాన్ సముద్రజలాలలోకి వచ్చేశామని గ్రహిస్తారు. వెంటనే బోట్లను వెనక్కి తిప్పుతారు. కానీ అప్పుడే పాకిస్థాన్ నేవీకి దొరికిపోతారు. అక్కడ వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అనేది కథ. 

విశ్లేషణ
: భారతదేశానికి చెందిన కొంతమంది మత్స్య కారులు, తమకి తెలియకుండానే పాకిస్థాన్ జలాలలోకి ప్రవేశించడం .. అక్కడి నేవీ సిబ్బందికి చిక్కడం .. పాకిస్థాన్ జైల్లో నానా హింసలకు గురికావడం .. ఆ ఊరికి చెందిన ఒక యువతి వారికి కాపాడటానికి ప్రయత్నించడం వంటి కథతో ఇంతకుముందు 'తండేల్' సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. కాస్త అటు ఇటుగా అదే కథతో రూపొందిన సిరీస్ ఇది.

దాదాపు ఒకే కంటెంట్ అనిపించినప్పటికీ, ఒక సినిమాకీ .. సిరీస్ కి ఉండవలసిన తేడా కనిపిస్తూనే ఉంటుంది. హీరో - హీరోయిన్ కి ఒక ఆశయం ఉంటుంది. అందుకు సంబంధించి వారు చేసే ప్రయత్నాలు ఉంటాయి. రొమాన్స్ దిశగా వెళ్లని వారి లవ్వు .. గంగ తండ్రి కూడా బద్రితో పాటు పాకిస్థాన్ ఆర్మీకి పట్టుబడటం వంటి సన్నివేశాలు ఈ కథను 'తండేల్' నుంచి వేరుచేసి చూపిస్తాయి.    

జాలరుల జీవితాలు .. స్థానికంగా ఉండే సమస్యలు .. ఏజన్సీలు చేసే మోసాలు .. వారి ప్రాణాలకు  ఏ మాత్రం విలువలేదని భావించే పెద్ద మనుషులు .. సముద్ర ప్రమాదాలు .. పాకిస్థాన్ జైళ్లలో భారతీయ ఖైదీల పరిస్థితిని దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. సున్నితమైన భావోద్వేగాలను కనెక్ట్ చేసిన విధానం కూడా ఆకట్టుకుంటుంది. కథ మనకి తెలిసినదే అయినా, ఇంట్రెస్టింగ్ ట్రీట్మెంట్ తో ముందుకు వెళుతుంది. 

పనితీరు:మొదటి నుంచి చివరివరకూ ఈ కథను ఆసక్తికరంగా నడిపించడంలో, పాత్రలను సహజత్వానికి దగ్గరగా మలచడంలో దర్శకుడి ప్రతిభ మనకి కనిపిస్తుంది. తెలిసిన కథనే కదా అని సన్నివేశాలను తేలికగా పక్కన పెట్టేస్తూ ముందుకు వెళ్లలేం. సున్నితమైన భావోద్వేగాలు కెరటాల  మాదిరిగా మనసును తాకుతూనే ఉంటాయి. 

సత్యదేవ్ తన పాత్రకి కరెక్టుగా సెట్ అయ్యాడు. ఆయన నటన ఆకట్టుకుంటుంది. ఎంతటి సాదాసీదా పాత్ర వేసినా ఆనంది అందంగానే కనిపిస్తుంది. సహజమైన ఆమె నటన మెప్పిస్తుంది. ఇక మిగతా ఆర్టిస్టులంతా బాగానే చేశారు. సమీర్ రెడ్డి కెమెరా పనితనం మెప్పిస్తుంది. నాగవెల్లి విద్యాసాగర్ నేపథ్య సంగీతం .. చాణక్య రెడ్డి ఎడిటింగ్ కథకి తగినట్టుగా అనిపిస్తాయి. 

ముగింపు: కథా పరంగా 'తండేల్' సినిమాకి దగ్గర పోలికలు ఉండటం వలన, ఆ కథ మనకి తెలుసు గదా అనిపించవచ్చు. కథ ముందుగా ఊహించినదే అయినా, టేకింగ్ .. ఫొటోగ్రఫీ .. లొకేషన్స్ పరంగా బోర్ అనిపించదు. జాలరి గ్రామాల నేపథ్యం .. సముద్ర నేపథ్యం .. ఈ రెండింటితో ముడిపడిన సహజత్వం అందుకు కారణం కావొచ్చు.