ఒక వైపున హారర్ థ్రిల్లర్లు .. క్రైమ్ థ్రిల్లర్లు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పై సందడి చేస్తూ ఉంటే., మరో వైపున పొలిటికల్ థ్రిల్లర్లు కూడా తమ ప్రత్యేకతను చాటుతున్నాయి. అలాంటి పొలిటికల్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సిరీస్ గా 'మయసభ' కనిపిస్తుంది.తెలుగు రాజకీయాలను ప్రభావితం చేసిన ఇద్దరు నాయకుల జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని రూపొందించిన సిరీస్ ఇది. దేవ కట్టా - కిరణ్ జై కుమార్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 9 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ: చిత్తూరు జిల్లాకి చెందిన కృష్ణమనాయుడు (ఆది పినిశెట్టి) వ్యవసాయదారుల కుటుంబంలో జన్మిస్తాడు. ఉన్నతమైన చదువులు చదువుతూనే, రాజకీయంగా తన చుట్టూ ఉన్న వారి జీవితాలను ప్రభావితం చేస్తూ ఉంటాడు. చదువు పూర్తికాగానే రాజకీయాలలోకి రావడానికి సన్నాహాలు చేసుకుంటూ ఉంటాడు. ఆ సమయంలోనే అతనికి అనూ హారిక పరిచయమవుతుంది. ఆమెను వివాహం చేసుకోవాలనుకున్న అతని ప్రయత్నం విఫలమవుతుంది. 

ఇక కడప జిల్లాకి చెందిన రామిరెడ్డి (చైతన్యరావు) ఫ్యాక్షన్ కుటుంబంలో పుట్టి పెరుగుతాడు. లక్ష్మి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. స్థానికంగా హాస్పిటల్ నిర్మించి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనలో ఉంటాడు. అయితే రామిరెడ్డి రాజకీయంగా ఎదగాలనే ఉద్దేశంతో ఆయన తండ్రి శివారెడ్డి ఉంటాడు. అటు కృష్ణమనాయుడు .. ఇటు రామిరెడ్డి ఇద్దరూ కూడా ఢిల్లీ రాజకీయాలను గమనిస్తూనే ముందుకు వెళుతుంటారు. 

ఈ నేపథ్యంలోనే విజయవాడలోని రాజకీయాలపై .. రౌడీయిజంపై ఒక వ్యక్తి తిరుగుబాటు మొదలవుతుంది. అదే సమయంలో ప్రముఖ హీరో ఆర్ సి ఆర్ రాజకీయ పార్టీ పెట్టడానికి సన్నాహాలు జరుగుతూ ఉంటాయి. రాజకీయ పరమైన ఒక భారీ మార్పు అవసరమని మూవీ మొగల్ శివాజీరావు భావిస్తూ ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో కృష్ణమనాయుడు .. రామిరెడ్డి కలుసుకుంటారు. రాజకీయ జీవితాన్ని ఆరంభించాలని నిర్ణయించుకుంటారు. అయితే కృష్ణమనాయుడి ప్రతిభను సీనియర్ నాయకులు తొక్కేయడానికి ట్రై చేస్తుంటే, ఫ్యాక్షన్ ఫ్యామిలీ అంటూ రామిరెడ్డి రాజకీయ భవిష్యత్తుకు స్థానిక నేతలు అడ్డుపడుతూ ఉంటారు. అప్పుడు వాళ్లు ఏం చేశారు? ఎలాంటి పరిణామాలను ఫేస్ చేశారు? అనేది మిగతా కథ. 

విశ్లేషణ
: దేవ కట్టా ఎంచుకున్న ఈ కథ, పూర్తిగా రాజకీయాల నేపథ్యంలో కొనసాగుతుంది. 1970లలో మొదలైన ఈ కథ, 1990ల నుంచి ఊపందుకుంటుంది. ఈ సిరీస్ ను చూస్తుంటేనే ఎవరెవరిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సిరీస్ ను రూపొందించారనే విషయం మనకి అర్థమైపోతూ ఉంటుంది. ఆ కాలం నాటి వాతావరణాన్ని ప్రతిబింబిస్తూ, అప్పటి వేషధారణ .. పల్లెల పరిస్థితికి అద్దం పడుతూ ఈ సిరీస్ ను చిత్రీకరించడం కష్టమైన పనేనని చెప్పుకోవాలి. 

ఒక వైపున కృష్ణమనాయుడు .. ఒక వైపున రామిరెడ్డి, మరో వైపున నటుడు ఆర్ సి ఆర్ .. ఇంకొక వైపున మూవీ మొగల్ శివాజీరావు కోణాలను ఆవిష్కరిస్తూ ఈ కథను నడిపించడం అనుకున్నంత తేలిక కాదు. ఆయా పాత్రలను మలిచే విధానం .. ఏ పాత్రను ఎంతవరకూ చూపించాలి? ఎంతవరకూ చెప్పాలి? అనేదే అసలైన సమస్య. ఆ అవాంతరాలను దాటుకుంటూనే దేవ కట్టా ఈ కథను ముందుకు తీసుకుని వెళ్లాడు.

రెండు ప్రధానమైన పాత్రలను ఒకదాని తరువాత ఒకటిగా టచ్ చేస్తూ, ఆ తరువాత ఆ రెండు పాత్రలను కలిపి నడిపిస్తూ .. వేరే ట్రాకులకు బీజాలు వేస్తూ వెళ్లిన తీరు బాగుంది. అయితే అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు, అంత అవసరం లేనట్టుగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాల నుంచి ఆశించిన స్థాయి అవుట్ పుట్ రాలేదనే భావన కలుగుతుంది. అక్కడక్కడా రక్తపాతాన్ని మినహాయిస్తే,  ఎలాంటి వివాదాస్పదమైన అంశాలను టచ్ చేయకుండా సీజన్ 2 వరకూ తీసుకెళ్లిన విధానం ఆకట్టుకుంటుంది. 

పనితీరు: నిదానంగా కథను మరింత లోతుగా తీసుకుని వెళుతూ ఆసక్తినిపెంచిన విధానం మెప్పిస్తుంది. ప్రధానమైన పాత్రలను మలిచిన తీరు కూడా బాగుందని అనిపిస్తుంది. ఆది పినిశెట్టి .. చైతన్యరావు నటనకి మంచి మార్కులే పడతాయి. రామిరెడ్డి తండ్రి శివారెడ్డి పాత్రను పోషించిన ఆర్టిస్ట్ చాలా బాగా చేశాడు. ఐరావతి బసూ పాత్రలో దివ్య దత్త హుందాగా కనిపించింది. సాయికుమార్ తో పాటు మిగతా వాళ్లంతా పాత్ర పరిధిలో మెప్పించారు. 

సురేశ్ రగుతా .. జ్ఞానశేఖర్ ఫొటోగ్రఫీ బాగుంది. శక్తికాంత్ కార్తీక్ నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. ఆయన స్వరపరిచిన బాణీలు, ఆ టైమ్ లైన్ లో కుదిరాయి. ప్రవీణ్ ఎడిటింగ్ విషయానికి వస్తే, కొన్ని సన్నివేశాలను ట్రిమ్ చేస్తే బాగుండేదనే భావన కలుగుతుంది. 

ముగింపు: దర్శకుడు ఎంచుకున్న కథ చాలా విస్తారమైనదే .. వివాదాలకు అవకాశం ఉన్నదే. అయినా దేవ కట్టా తనదైన స్టైల్లో చెప్పడానికి ప్రయత్నం చేశాడు. ప్రధానమైన పాత్రలు .. టైటిల్ ఆసక్తిని రేకెత్తిస్తాయి .. అంచనాలు పెంచుతాయి. ఆ అంచనాలకు కాస్త దగ్గరలోనే ఈ కంటెంట్ కదులుతుంది .. కాకపోతే కాస్త నిదానంగా సాగుతుంది అంతే.