'ట్రిగ్గర్' (నెట్ ఫ్లిక్స్) వెబ్ సిరీస్ రివ్యూ!

  • కొరియన్ సిరీస్ గా వచ్చిన 'ట్రిగ్గర్'
  • ఆసక్తికరమైన మలుపులతో సాగే కథ
  • అలరించే యాక్షన్ దృశ్యాలు 
  • ప్రత్యేక ఆకర్షణగా నిలిచే భారీతనం
  • ఆలోచింపజేసే సందేశం

'నెట్ ఫ్లిక్స్' ద్వారా ప్రేక్షకులను పలకరించిన కొరియన్ సిరీస్ 'ట్రిగ్గర్'. కిమ్ నామ్ గిల్ .. కిమ్ యంగ్ క్వాంగ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సిరీస్ కి క్వాన్ ఓ సెయుంగ్ దర్శకత్వం వహించాడు. 10 ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ ను అందించారు. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నుంచి 60 నిమిషాల వరకూ ఉంది. జులై 25వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చిన ఈ సిరీస్, తెలుగులోను  అందుబాటులో ఉంది. 

కథ: దక్షిణ కొరియాలో అక్రమంగా ఆయుధాలను కలిగి ఉండటం పెద్ద నేరం. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తూ ఉంటుంది. అలాంటి పరిస్ధితులలో 'యాంగ్ సెంగ్' ప్రాంతంలో నిరుద్యోగిగా ఉన్న ఒక యువకుడు సూసైడ్ చేసుకుని చనిపోతాడు. అది 'డోమ్యాంగ్ పోలీస్ స్టేషన్' పరిధిలోని ప్రాంతం కావడంతో పోలీస్ ఆఫీసర్ లీడో ( కిమ్ నామ్ గిల్) రంగంలోకి దిగుతాడు. 

ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి ఇంట్లో 'లీడో'కి, గన్స్ కి సంబంధించిన బుల్లెట్స్ పెద్దమొత్తంలో  లభిస్తాయి. అవి అతనికి ఎక్కడివి అనే విషయం 'లీడో'కి అర్థం కాదు. ఆ తరువాత అదే పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక కాలేజ్ స్టూడెంట్ తనని ఇరిటేట్ చేస్తున్నారనే ఉద్దేశంతో, తన తోటి స్టూడెంట్స్ పై కాల్పులు జరుపుతాడు. దాంతో 'లీడో' అతనిని అదుపులోకి తీసుకుంటాడు. అతని రూమ్ లో అత్యాధునిక ఆయుధాలు ఉండటం చూసి లీడో షాక్ అవుతాడు. అవి తనకి కొరియర్ లో వచ్చాయని ఆ యువకుడు చెబుతాడు.

సాధారణ యువకులు .. ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న యువకులకు కొరియర్ లో ఎవరు ఆయుధాలు పంపిస్తున్నారు? హింస దిశగా వాళ్లను ఎవరు ప్రోత్సహిస్తున్నారు? అనేది 'లీడో'కి అర్థం కాదు. అందుకు సంబంధించిన ఆపరేషన్ లోనే అతనికి మూన్ బేక్ (కిమ్ యంగ్ క్వాంగ్) తారసపడతాడు. తనవంతుగా అతను 'లీడో'కి సాయపడుతూ ఉంటాడు. మూన్ బేక్ ఎవరు? అతని నేపథ్యం ఏమిటి? జరుగుతున్న మారణ కాండకు కారకులు ఎవరు? అనే మలుపులతో ఈ కథ నడుస్తుంది. 

విశ్లేషణ: కొరియన్ సిరీస్ లను చాలామంది తెలుగు ప్రేక్షకులు ఫాలో అవుతూ ఉంటారు. అందుకు కారణం, కంటెంట్ విషయంలో వాళ్లు చేసే కసరత్తేనని చెప్పుకోవాలి. మొదటి నుంచి చివరివరకూ కథను ఇంట్రెస్టింగ్ గా నడిపించే విషయంలో వాళ్లు చాలా కేర్ తీసుకుంటారు. అలాంటి లక్షణాలతో రూపొందిన మరో సిరీస్ గా 'ట్రిగ్గర్'ను గురించి చెప్పుకోవచ్చు.

ఒక గ్రామంలోని ప్రజలంతా కలిసి మెలిసి హాయిగా జీవిస్తూ ఉంటారు. ఓ అపరిచితుడు ఒక 'గన్' తీసుకొచ్చి ఆ ఊరు నడిబొడ్డులో పడేసి వెళ్లిపోతాడు. ఆ 'గన్'ను అందరూ చూస్తారు. తెల్లారేసరికి అది అక్కడి నుంచి మాయమవుతుంది. కానీ ఆ ఊళ్లోని వాళ్లంతా ఆ 'గన్' విషయంలో ఒకరిని ఒకరు అనుమానించడం .. ఎవరి రక్షణ కోసం వాళ్లు 'గన్స్' కొనడం మొదలవుతుంది .. అంటూ ఈ సిరీస్ లో హీరో ఒక పిట్టకథ చెబుతాడు. ఈ కథకి తగినట్టుగానే ఈ సిరీస్ నడుస్తుంది. 

కథలో చాలానే పాత్రలు కనిపిస్తాయి. అయితే ఆ పాత్రలు ప్రేక్షకులకు రిజిస్టర్ అవుతాయి. యాక్షన్ తో పాటు ఎమోషన్స్ ను కనెక్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. నిడివి ఎక్కువగా ఉన్నప్పటికీ బోర్ అనిపించదు. కథలో ఒక బలమైన ట్విస్ట్ ఉంటుంది. అది చివరివరకూ ఆడియన్స్ ను అలా కూర్చోబెడుతుంది. ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ వెబ్ సిరీస్ లలో దీనికి స్థానం దొరుకుతుంది. 

పనితీరు: ఈ సిరీస్ విషయానికి వస్తే మొదటి మార్కులు స్క్రిప్ట్ కి పడతాయి. కథలో బలమైన అంశం ప్రధానంగా కనిపిస్తుంది. ఇక స్క్రీన్ ప్లే కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగుతుంది. దర్శకుడి టేకింగ్ మెప్పిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన నటీనటులంతా సన్నివేశాలను మరింత బలంగా ఆడియన్స్ ముందు ఆవిష్కరించడంలో తమవంతు కృషి చేశారు. 

నిర్మాణం పరంగా ఈ సిరీస్ గొప్పగా అనిపిస్తుంది. ఖర్చు విషయంలో ఎంత మాత్రం రాజీపడలేదు. బలమైన కథ .. భారీ ఖర్చు వృథా పోలేదనే చెప్పాలి. ఫొటోగ్రఫీని మెచ్చుకోకుండా ఉండలేం. ఛేజింగ్ దృశ్యాలను .. యాక్షన్ సీక్వెన్స్ ను చిత్రీకరించిన తీరు ఆకట్టుకుంటుంది. నేపథ్య సంగీతం కూడా ఈ కథతో పాటు మనలను ట్రావెల్ చేయిస్తుంది. ఎడిటింగ్ పరంగా చూసుకుంటే, మూన్ బేక్ ఫ్లాష్ బ్యాక్ సీన్స్ కాస్త సాగదీసినట్టుగా అనిపిస్తుందంతే. 

ముగింపు: సమాజంలో హింసను ప్రోత్సహించడానికి కొన్ని శక్తులు ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటాయి. అలాంటి శక్తులపై అందరూ కలిసి పోరాడాలి. మారణాయుధాలు అందుబాటులోకి వస్తే, మానవుల మనుగడ ప్రమాదంలో పడుతుందనే సందేశాన్ని ఇచ్చే సిరీస్ గా ఇది కనిపిస్తుంది. యాక్షన్ కంటెంట్ ను ఇష్టపడేవారికి ఈ సిరీస్ నచ్చుతుంది.

Movie Details

Movie Name: Trigger

Release Date: 2025-07-25

Cast: Kim Nam Gil, Kim Young Kwang, Moon Seong Hyun, Park Hoon, Gil Hae Yeon

Director: Kwon Oh Seung

Producer: -

Music: Hwang Sang Jun

Banner: Bidangil Pictures

Review By: Peddinti

Trigger Rating: 3.00 out of 5

Trailer

More Movie Reviews