తమిళంలో రూపొందిన కొన్ని సినిమాలు మలయాళం ఫ్లేవర్ తో కనిపిస్తాయి. అలా రూపొందిన సినిమానే 'పరంతు పో'. ఈ ఏడాది జులై 4వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. జియో హాట్ స్టార్ లో ఈ రోజు నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. శివ .. గ్రేస్ ఆంటోని .. మిథుల్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: గోకుల్ (శివ) గ్లోరీ ( గ్రేస్ ఆంటోనీ) భార్యాభర్తలు. వారి ఒక్కగానొక్క సంతానమే అన్బు (మిథున్). శివ - గ్లోరీ ప్రేమించి పెళ్లి చేసుకుంటారు. అందువలన ఇటు కుటుంబాల వైపు నుంచి వాళ్లకి ఎలాంటి సపోర్ట్ ఉండదు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన శివ - గ్లోరీ ఇద్దరూ కూడా, ఏదో చిన్నపాటి బిజినెస్ చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉంటారు. ఇద్దరూ ఇంట్లో ఉండకపోవడంతో, అన్బుకి బోర్ కొడుతూ ఉంటుంది.

అన్బు అల్లరి పిల్లాడు. ఎక్కడా కుదురుగా ఉండేరకం కాదు. అలాంటి ఆ కుర్రాడు, బిజినెస్ పనిపై తల్లి వేరే ఊరు వెళ్లడం వలన, మరింత చికాకు చేస్తూ ఉంటాడు. ఇంట్లో ఉంటూ అన్నీ ప్రమాదకరమైన పనులు చేస్తూ ఉంటాడు. మాట వినకుండా తండ్రిని నానా తిప్పలు పెడుతూ ఉంటాడు. దాంతో అన్బును తీసుకుని గోకుల్ సరదాగా రోడ్ ట్రిప్ వేస్తాడు. ఆ ట్రిప్ లో వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? అనేదే కథ. 

విశ్లేషణ: ఈ కథ చెన్నైలో జరుగుతుంది. ఇప్పుడున్న పరిస్థితులలో ఇల్లు గడవాలంటే భార్యాభర్తలు ఇద్దరూ పనిచేయవలసిందే. ఇద్దరూ ఎవరి పనిపై వాళ్లు వెళ్లిపోతారు. స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు, తమ పేరెంట్స్ వచ్చేవరకూ ఒంటరిగా ఫ్లాట్ లో వెయిట్ చేస్తూ ఉండవలసిందే. చూస్తే టీవీ చూడాలి .. లేదంటే వీడియో గేమ్స్ ఆడాలి. ప్రకృతితో సంబంధాలు లేకుండానే వారు ఎదుగుతున్నారు. ఈ అంశాన్ని ప్రధానంగా చేసుకునే దర్శకుడు ఈ కథను తెరకెక్కించాడు. 

పిల్లలు తమ తోటి పిల్లలతో కలిసి బయటికి వెళ్లడం .. ఆడుకోవడం రాన్రాను తగ్గిపోతోంది. పేరెంట్స్ తమకి తెలియకుండానే తమ పిల్లలను నాలుగు గోడల మధ్యనే ఉంచేస్తున్నారు. ఆ నాలుగు గోడల మధ్య కూడా అనేక ఆంక్షలు. అందుకే వారికి ప్రకృతిని .. ప్రపంచాన్ని పరిచయం చేయవలసి ఉందంటూ దర్శకుడు చేసిన ఆవిష్కరణ ఆకట్టుకుంటుంది. 

పిల్లల ఆనందంలోనే పేరెంట్స్ తమ సంతోషాన్ని వెతుక్కుంటూ ఉంటారు. అయితే పిల్లలు వారి ఫ్రెండ్స్ తో కలిసి స్వేచ్ఛగా ఆడుతూ పాడుతూ ఉన్నప్పుడే వారిలో అసలైన ఆనందాన్ని చూడగలమనే విషయాన్ని దర్శకుడు చెప్పిన విధానం ఆకట్టుకుంటుంది. పిల్లల చిన్ని ప్రపంచాన్ని పెద్దది చేస్తూ, వారి  కోర్కెలను తీర్చడానికి ప్రయత్నించవలసిన అవసరం ఉందనే విషయాన్ని దర్శకుడు తేల్చిన పద్ధతి బాగుంది.           
    
పనితీరు: తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆందుబాటులో లేకుండా పోతే, పిల్లలు మొండిగా తయారవుతారనే విషయాన్ని దర్శకుడు స్పష్టం చేసిన తీరు బాగానే ఉంది. అయితే ఇటు తండ్రి వైపు నుంచి .. అటు తల్లివైపు నుంచి సరైన ట్రాకులు పడలేదని అనిపిస్తుంది. ఈ రెండు ట్రాకులు కూడా బలహీనంగానే అనిపిస్తాయి. మొత్తం భారం పిల్లాడికి సంబంధించిన ట్రాక్ పైనే పడిపోయింది. 

ఇక పిల్లాడు చేసే ప్రమాదకరమైన పనులపై దృష్టి పెట్టారేగానీ, ఆ వైపు నుంచి వినోదాన్ని రాబట్టే ప్రయత్నం మాత్రం చేయలేదు. అయినా ప్రేక్షకులు టీవీల ముందు కదలకుండా కూర్చోడానికి ఒక కారణం ఉంది .. అదే లొకేషన్స్. అంజలి ఎపిసోడ్ మాత్రం కాస్త ఊరటనిస్తుందని చెప్పాలి.  ఈ సినిమాకి లొకేషన్స్ హైలైట్ అని చెప్పచ్చు. ఏకాంబరం ఫొటోగ్రఫీ ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. యువన్ శంకర్ రాజా నేపథ్య సంగీతం .. మథి ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు
: ఇల్లు అనేది పిల్లల పాలిట పంజరం కాకూడదు. వారిని ప్రకృతికి దగ్గరగా తీసుకుని వెళ్లాలి .. వారికి ఇష్టమైన ప్రపంచానికి పరిచయం చేయాలనే సందేశంతో కూడిన ఈ కథ ఫరవాలేదనిపిస్తుంది.