సిద్ధార్థ్ కథానాయకుడిగా రూపొందిన సినిమానే '3 BHK'. అరవింద్ సచ్చిదానందం రాసిన '3 BHK' వీడు' అనే కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. శ్రీగణేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జులై 4వ తేదీన థియేటర్లకు వచ్చింది. అరుణ్ విశ్వ నిర్మించిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'అమెజాన్' ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. అమృత్ రామ్ నాథ్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: వాసుదేవన్ (శరత్ కుమార్) శాంతి (దేవయాని) మధ్యతరగతి దంపతులు. వారి సంతానమే ప్రభు (సిద్ధార్థ్) ఆర్తి (మీతా రఘునాథ్). వాసుదేవన్ ఒక చిన్న సంస్థలో పనిచేస్తూ ఉంటాడు. ఆర్ధికపరమైన ఇబ్బందుల కారణంగా కొడుకును మాత్రమే మంచి స్కూల్ లో చదివిస్తూ, కూతురును గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తూ ఉంటాడు. ఇరుకైన అద్దె ఇళ్లలో కాలం గడుపుతూ ఉంటారు. ఆ ఇంటి ఓనర్స్ పెట్టే నియమ నిబంధనలు వాళ్ల మనసుకు కష్టం కలిగిస్తూ ఉంటాయి. 

వాసుదేవన్ కుటుంబ సభ్యులంతా '3 BHK' తీసుకోవాలని నిర్ణయించుకుంటారు. అయితే వాసుదేవన్ కి అప్పు చేయడం ఇష్టం ఉండదు గనుక, అందరూ అన్ని వైపుల నుంచి కష్టపడుతూ పెద్ద మొత్తంలో సేవ్ చేయాలని నిర్ణయించుకుంటారు. తన ఫ్యామిలీకి తాను ఎంత ముఖ్యమనేది తెలుసుకున్న ప్రభు, ఒక వైపున చిన్న జాబ్ చేస్తూనే, మరింత కష్టపడి చదువుకుంటూ ఉంటాడు. శాంతి కూడా ఫుడ్ ఐటమ్స్ సేల్ చేస్తూ ఉంటుంది. 

అలా నలుగురూ ఎంతో కష్టపడుతూ తాము అనుకున్న స్థాయిలోనే కూడబెడతారు. అప్పు చేయకుండా నేరుగా వెళ్లి ఫ్లాట్ సొంతం చేసుకునే అవకాశం వస్తుంది. సరిగ్గా ఆ సమయంలోనే ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? ఆ సంఘటన వాళ్ల జీవితాలను ఎలా ప్రభావితం చేస్తుంది. వాళ్ల సొంతింటి కల నిజమవుతుందా? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: మధ్యతరగతివారిలో సొంతిల్లు అనే ఒక కల చాలా బలంగా కనిపిస్తుంది. ఆ కలను నిజం చేసుకోవడానికి వాళ్లు ఎన్నో కష్టాలు పడతారు .. అవమానాలను భరిస్తారు .. ఆశలను చంపుకుంటారు. అలాంటి ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, తమ సొంతింటి కలను నిజం చేసుకోవడానికి ఎలాంటి అవాంతరాలను అధిగమించింది అనే కథను దర్శకుడు ఆవిష్కరించిన విధానం ఆకట్టుకుంటుంది. 

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వారు ఎప్పటికప్పుడు మార్కెట్ ధరలను అందుకోలేకపోతుంటారు. సొంతింటి విషయంలోను వాళ్లు ఇదే పరిస్థితిని ఫేస్ చేస్తూ ఉంటారు. అలా పెరుగుతున్న ధరలకు .. పెరగని సంపాదనకు మధ్య నలిగిపోవడాన్ని దర్శకుడు చిత్రీకరించిన తీరు సహజత్వానికి చాలా దగ్గరగా వెళుతూ కనెక్ట్ అవుతుంది. కలను నిజం చేసుకోవడం కోసం కలిసి చేసే పోరాటంగా ఈ కథ కనిపిస్తుంది.

ఈ కథ మొదటి నుంచి చివరివరకూ చాలా ఎమోషనల్ గా రన్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటుంది. వీళ్ల సొంతింటి కల నిజమవుతే బాగుంటుందని ప్రేక్షకులు అనుకునే స్థాయిలో పాత్రలు కనెక్ట్ అవుతాయి. చాలామంది తమ జీవితంలో ఫేస్ చేసే సంఘటనలే కావడం వలన, ప్రతి ఒక్కరూ ఈ కథతో కలిసి ప్రయాణిస్తారు. 

పనితీరు: దర్శకుడు ఆయా పాత్రలను మలచిన తీరు, సన్నివేశాలను ఆవిష్కరించిన విధానం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పాలి. ప్రతి పాత్ర కూడా తెరపై చాలా సహజంగా సంచరిస్తుంది. అందువలన ప్రేక్షకులకు ఒక సినిమా చూస్తున్నట్టుగా కాకుండా, ఒక జీవితాన్ని చూస్తున్న భావన కలుగుతుంది. ఎక్కడా అనవసరమైన సన్నివేశమనేది మనకి తగలదు. 

శరత్ కుమార్ .. దేవయాని .. సిద్ధార్థ్ .. ఇలా అందరూ కూడా తమ పాత్రలకు జీవం పోశారు. అక్కడక్కడా కొన్ని సన్నివేశాలు మనసును తడి చేస్తాయి. దినేశ్ కృష్ణన్ - జితిన్ ఫొటోగ్రఫీ, అమృత్ రామ్ నాథ్ సంగీతం ఆకట్టుకుంటాయి. గణేశ్ శివ ఎడిటింగ్ వర్క్ కూడా చాలా నీట్ గా అనిపిస్తుంది. కథా పరిధిని దాటి ఒక్క సన్నివేశం కూడా మనకి కనిపించదు. 

ముగింపు: ఇల్లు అంటే నాలుగు గోడలు - పై కప్పు కాదు, అది ఒక గౌరవం .. జ్ఞాపకాల మందిరం అనే స్థాయిలో ఈ కథ నడుస్తుంది. జీవితంలో ప్రతి అనుభవమూ ఒక పాఠమే, ప్రతి ఓటమీ వాయిదా వేయబడిన గెలుపే. అలాంటి ఒక సందేశంతో సాగే ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి తప్పకుండా కనెక్ట్ అవుతుంది.