వినీత్ కుమార్ సింగ్ .. రాజశ్రీ దేశ్ పాండే .. తారుక్ రైనా .. ప్రధానమైన పాత్రలను పోషించిన హిందీ సిరీస్ 'రంగీన్'. కబీర్ ఖాన్ ఫిలిమ్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ సిరీస్ కి, కోపల్ నైతాని - ప్రాంజల్ దువా దర్శకత్వం వహించారు. 9 ఎపిసోడ్స్ గా నిర్మితమైన ఈ సిరీస్, ఈ నెల 25వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఆదర్శ్ ( వినీత్ కుమార్) ఓ జర్నలిస్ట్. ఆయన ఒక పత్రికను నడుపుతుంటాడు. ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో పత్రికను నడపడం సవాలుగా మారుతుంది. దాంతో ఆయన ఆఫీసులోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తుంది. ఆయన భార్య నైనా (రాజశ్రీ దేశ్ పాండే) తమ జీవితం మరింత ఉన్నతంగా ఉండాలని కలలు కంటూ ఉంటుంది. ఎనిమిదేళ్ల వారి వైవాహిక జీవితం సజావుగా సాగిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితులలోనే ఆదర్శ్ మొబైల్ కి ఒక వీడియో వస్తుంది.

నైనా ఒక యువకుడితో సన్నిహితంగా ఉన్న వీడియో అది. ఆ వీడియో చూడగానే అతని బిత్తరపోతాడు. తన ఆశ .. ఆశయం కుప్పకూలిపోయినట్టుగా అనిపిస్తుంది. ఈ విషయంపై అతను భార్యను నిలదీయడానికి వెళతాడు. అయితే భయంతో ఆమె తన పుట్టింటికి వెళ్లిపోతుంది. తన  భార్యతో సన్నిహితంగా ఉన్న యువకుడు ఎవరనేది కనిపెట్టడానికి ఆదర్శ్ ప్రయత్నిస్తాడు. అతను అదే ఊరుకు చెందిన సన్నీ (తారుక్) అని తెలుసుకుంటాడు. తన భార్యతో అతనికి గల సంబంధాన్ని గురించి ప్రశ్నిస్తాడు.        

అప్పుడు సన్నీ ఒక విషయం చెబుతాడు. అదేమిటి? ఆ విషయం వినగానే ఆదర్శ్ ఎలా స్పందిస్తాడు? ఆ తరువాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు? ఆ నిర్ణయం వలన అతను ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అక్రమ కార్యకలాపాలకు పాల్పడుతూ జైలు పాలైన మంజూ వలన, ఆయన భార్య జిగ్ను కారణంగా ఆదర్శ్ కెరియర్ పై ఎలాంటి ప్రభావం పడుతుంది? అనేది కథ.

విశ్లేషణ: 'రంగీన్' అనేది కథానాయకుడి యూజర్ నేమ్ గా ఈ కథలో కనిపిస్తుంది. నిజం చెప్పాలంటే ఈ సిరీస్ పై ఆసక్తిని రేకెత్తించింది ఈ టైటిల్ అనే చెప్పాలి. ప్రధానమైన కథ అంతా కూడా భార్య భర్తల మధ్య పైకి కనిపించని అగాథం చుట్టూ తిరుగుతుంది. ఒకరితో ఒకరు మనసు విప్పి చెప్పుకోలేనంత పల్చని తెర వారికి అడ్డుపడుతూ ఉంటుంది. భార్యకోసమే కష్టపడే భర్త, తనని పట్టించుకోవడం లేదని బాధపడే భార్య. ఇదే ఈ కథకు మూలం అని చెప్పాలి.

ఇక కొంతమంది యువకులు కష్టపడకుండా డబ్బు సంపాదించాలని అనుకుంటారు. తమకి తెలియకుండానే తాము ఎందులో కూరుకుపోతున్నది వారికి తెలియదు. నిజం తెలుకునేసరికి జరగాల్సిన నష్టం జరిగిపోతూ ఉంటుంది. కుటుంబంలో ఎవరు ఏ పని చేస్తున్నా, అది ఆ కుటుంబం పరువుతో ముడిపడి ఉంటుంది. పరువు అనే ఆ గీతను ఏ ఒక్కరు దాటినా, ఆ ఫ్యామిలీ అంతా ఎలాంటి  ప్రమాదం వైపు పరిగెత్తవలసి ఉంటుందనే ఈ కథను దర్శకుడు ఆసక్తికరంగానే ఆవిష్కరించాడు. 

అయితే ఈ కథలో ప్రధానమైనవిగా కనిపించే మూడు పాత్రలు కూడా తప్పుడు మార్గాన్ని ఎంచుకుంటాయి. అందువలన మూడు వైపుల నుంచి కూడా కథ అడల్ట్ కంటెంట్ ను టచ్ చేస్తూ ఉంటుంది. ఈ కారణంగా ఇది హాల్లో కూర్చుని అందరితో కలిసి చూసే కంటెంట్ కాదు. రెండు మూడు చోట్ల అభ్యంతరకరమైన సన్నివేశాలు కనిపిస్తాయి .. ఆ తరహా సంభాషణలు వినిపిస్తాయి. 

పనితీరు: దర్శకుడు కథా పరిధి విస్తృతంగా ఉన్న అంశాన్నే ఎంచుకున్నాడు. అయితే ఆశించిన స్థాయిలో సన్నివేశాలను ఆసక్తికరంగా ఆవిష్కరించినట్టుగా అనిపించదు. అక్కడక్కడా సన్నివేశాలు మరీ నిదానంగా నడుస్తాయి. నిడివి తగ్గించుకుని .. స్క్రీన్ ప్లే వేగాన్ని పెంచితే బాగుండునని అనిపిస్తుంది. కెమెరా పనితనం .. నేపథ్య సంగీతం ఫరవాలేదు. ఎడిటింగ్ వైపు నుంచి చూసుకుంటే, ట్రిమ్ చేయవలసిన సన్నివేశాలు కొన్ని కనిపిస్తాయి. ఆర్టిస్టులంతా పాత్ర పరిధిలో మెప్పించారు. 

ముగింపు: దారితప్పిన భార్యాభర్తలు ఆ దారి చివరివరకూ వెళ్లిన తరువాత అక్కడ నిజం తెలుసుకునే కథ ఇది. ఒక్కో ఎపిసోడ్ నిడివి 40 నిమిషాలపైనే ఉంది. కథను నిదానంగా .. నింపాదిగా నడిపించడమే అందుకు కారణంగా చెప్పుకోవాలి. చివర్లో చిన్నపాటి సందేశం ఉన్నప్పటికీ, ఓ మాదిరిగా అనిపించే సిరీస్ ఇది.