'షో టైమ్' (అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ!

  • నవీన్ చంద్ర హీరోగా రూపొందిన 'షో టైమ్'
  • క్రైమ్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
  • బలహీనమైన కథాకథనాలు
  • కనెక్ట్ కాలేకపోయిన సన్నివేశాలు   
నవీన్ చంద్ర సినిమాలకి .. సిరీస్ లకు ఇప్పుడు ఓటీటీ ట్రాక్ మంచి డిమాండ్ కనిపిస్తోంది. రీసెంటుగా ఆయన నుంచి వచ్చిన 'బ్లైండ్ స్పాట్' .. 'ఎలెవన్' మంచి మార్కులు కొట్టేశాయి. అలాంటి నవీన్ చంద్ర చేసిన మరో క్రైమ్ థ్రిల్లర్ గా 'షో టైమ్' కనిపిస్తుంది. ఈ నెల 4వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ అవుతోంది.

కథ: సూర్య (నవీన్ చంద్ర) శాంతి (కామాక్షి భాస్కర్ల) భార్యాభర్తలు. వారి ఒక్కగానొక్క సంతానమే వైశు. సూర్య జిమ్ ట్రైనర్ గా పనిచేస్తూ ఉంటాడు. శాంతిని అతను ప్రేమించి పెళ్లిచేసుకుంటాడు. అందువలన పెద్దవాళ్ల వైపు నుంచి వాళ్లకి ఎలాంటి సపోర్ట్ ఉండదు. ఒకరోజున సూర్య ఫ్యామిలీతో పోలీస్ ఆఫీసర్ లక్ష్మీకాంత్ (రాజా రవీంద్ర)కి గొడవ అవుతుంది. అప్పటి నుంచి అతను  సూర్యపట్ల గుర్రుగా ఉంటాడు.

సూర్య - శాంతిపై కోపం పోవడంతో, శాంతి తల్లిదండ్రులు వాళ్లను చూడాలని అనుకుంటారు. వాళ్లు వస్తున్న విషయం సూర్యకి తెలుస్తుంది. శాంతికి తెలియకుండగా అతను అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో సూర్య ఇంటికి దొంతతనానికి వచ్చిన ఒక వ్యక్తిపై, శాంతి తిరగబడుతుంది. ఆ పెనుగులాటలో ఆ వ్యక్తి పడిపోతాడు. ఆ వ్యక్తి నాడీ చూసిన సూర్య, అతను చనిపోయాడని భార్యతో చెబుతాడు.

ఒక వైపున చాలా కాలం తరువాత తన ఇంటికి వస్తున్న అత్తమామలు. మరోవైపున తాను ఏ కారణంగా దొరుకుతానా అని ఎదురుచూసే పోలీస్ ఆఫీసర్. ఈ మధ్యలో శవాన్ని ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో సూర్య ఉంటాడు. చివరికి తన భార్య కోసం అతను ఒక నిర్ణయం తీసుకుంటాడు. అదేమిటి? పర్యవసానంగా ఏం జరుగుతుంది? ఈ సమస్య నుంచి సూర్య ఫ్యామిలీ ఎలా బయటపడుతుంది? అనేది కథ.

విశ్లేషణ
: కథాపరంగా .. నిడివిపరంగా కూడా ఇది చిన్న సినిమా. ఒక సమస్యను హీరో ఫ్యామిలీ ఎలా ఫేస్ చేసింది అనే విషయాన్ని ఆసక్తికరంగా అందించడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అయితే ఆ విషయంలో ఆయన పూర్తిస్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. కథను బయటికి వెళ్లనీయకుండా ఒక ఇంటికి .. నాలుగు గోడలకి మధ్యలో నడిపించేశాడు. చూసేవాళ్లకి ఇది కాఫీబ్రేక్ లో చదువుకునే కథలా అనిపిస్తుంది.

కొన్ని కథలు చిన్నవిగానే కనిపించినప్పటికీ, చివరిలో ఒక మెరుపులాంటి ట్విస్ట్ ఉంటుంది. దాంతో అప్పటివరకూ నిదానంగా నడుస్తూ వచ్చిన కథ మొత్తానికి బలం చేకూరినట్టు అవుతుంది. అదే విధంగా ఈ కథ చివరిలోను ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ పడుతుందని అనుకుంటారు. ట్విస్ట్ ఉంది .. కానీ అది కథను మరింత తేల్చేసి వెళ్లిపోతుంది. ఉన్న కాస్త నిడివిలోనే అంత్యాక్షరీ ఎపిసోడ్ .. నరేశ్ పాత్ర వైపు నుంచి ఉన్న అతి కాస్త సాగతీతగా అనిపిస్తాయి. 

ఈ తరహా కథలలో సమస్య మొదలైన తరువాత ఏ క్షణం ఏం జరుగుతుందో, ఏ క్షణంలో తాము చేసిన నేరం బయటపడుతుందో అనే సందర్భాలు సన్నివేశాలలో పడాలి. ఏ క్షణం ఏం జరుగుతుందో అనే ఉత్కంఠ ఆడియన్స్ లో కలగాలి. కానీ అలాంటివాటికి ఈ కథ కాస్త దూరంగానే కనిపిస్తుంది. ఆశించినస్థాయి పట్టులేక బలహీనపడుతుంది. 

పనితీరు: కథ .. స్క్రీన్ ప్లే సాదాసీదాగా సాగుతాయి. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులు బాగానే చేశారు. కాకపోతే నరేశ్ పాత్రను డిజైన్ చేసిన తీరులోనే కాస్త అతి కనిపిస్తుంది. పాత్రలకి సంబంధించిన ఎలాంటి ఎమోషన్స్ ఆడియన్స్ కి కనెక్ట్ కాకపోవడమే ప్రధానమైన లోపంగా అనిపిస్తుంది. 

ముగింపు: ఈ మధ్య కాలంలో ప్రేక్షకులు బడ్జెట్ ను గురించి .. భారీతనాన్ని గురించి పట్టించుకోవడం లేదు. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా ఉంటే, దానిని స్ప్రెడ్ చేస్తూనే ఉన్నారు. అయితే ఈ సినిమా విషయానికి వచ్చేసరికి, ఆశించిన స్థాయిలో కసరత్తు జరగలేదు. అందువలన ఈ సినిమా ఈ జోనర్ వైపు నుంచి పెద్దగా ప్రభావితం చేయలేకపోయిందనే చెప్పాలి. 

Movie Details

Movie Name: Show Time

Release Date:

Cast: Naveen Chandra, Kamakshi Bhaskarla, Naresh, Raja Ravindra, Manik Reddy

Director: Madan Daksshinamurthy

Producer: Kishore Garikapati

Music: Sekhar Chandra

Banner: Sky Line Movies

Show Time Rating: 1.75 out of 5

Trailer

More Movie Reviews