'అన్ టిల్ డాన్' .. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీన థియేటర్లకు వచ్చిన ఒక ఆంగ్ల చిత్రం. ఫారెస్టు నేపథ్యంలో ఒక పాత ఇంట్లో నడిచే ఈ సినిమా, 463 కోట్ల రూపాయల వసూళ్లను రాబట్టడం విశేషం. అలాంటి ఈ సినిమా, ఈ నెల 25వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. సర్వైవల్ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: మ్యాక్స్ .. ఏబ్ .. నినా .. మెగన్.. క్లోవర్ .. అనే ఐదుగురు స్నేహితులు లాంగ్ డ్రైవ్ కి బయల్దేరతారు. ఫారెస్టు ఏరియాలో వారి కారు చాలా దూరం ప్రయాణిస్తుంది. ఒక ప్రదేశంలో వాళ్లను ఆపుతుంది క్లోవర్. తన చెల్లెలు 'మెల్' కనిపించకుండా పోవడానికి ముందు వీడియో చేసిన ప్రదేశం అది. ఏడాది తరువాత ఆమె జాడ తెలుసుకోవడం కోసం క్లోవర్ తమని అక్కడికి వచ్చిందనే విషయం ఆ బృందానికి అర్థమవుతుంది. 

అక్కడికి సమీపంలో 'గ్లోర్ వ్యాలీ' ఉందనీ, మెల్ అటుగా వెళ్లిన తరువాతనే కనిపించకుండా పోయిందని క్లోవర్ తెలుసుకుంటుంది. ఫ్రెండ్స్ తో కలిసి కార్లో 'గ్లోవర్ వ్యాలీ'కి చేరుకుంటుంది. ఆ ప్రదేశంలో ఒక పాత ఇల్లు ఉండటం చూసి, లోపలికి వెళతారు. ఆ ఇల్లు .. అక్కడి వస్తువులు వారికి చాలా చిత్రంగా అనిపిస్తాయి. కనిపించకుండా పోయినవారి ఫొటోలు అక్కడి నోటీస్ బోర్డులో చాలానే కనిపిస్తాయి. అక్కడే 'మెల్' ఫొటో కూడా ఉంటుంది. 

 ఆ ఇంట్లో పాత కాలంనాటి 'అవర్ గ్లాస్' (ఇసుక గడియారం) ఉంటుంది. అది సూచించే సమయాన్ని బట్టి ఆ ఇంట్లో పరిస్థితులు భయంకరంగా మారిపోతుంటాయి. దాంతో తెల్లవారేలోగా ఆ ఇంట్లో నుంచి బయటపడాలని వారు నిర్ణయించుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? మెల్ ఏమైపోతుంది? ఆ ఇంట్లో నుంచి .. ఆ అడవిలో నుంచి వాళ్లు బయటపడతారా? అనేది కథ. 

విశ్లేషణ: ఇంగ్లిష్ మూవీస్ లో థ్రిల్లర్ జోనర్ కి సంబంధించినవి ఎక్కువగా కనిపిస్తాయి. దట్టమైన  అడవి .. ఆ అడవి మధ్యలో ఒక పాత ఇల్లు .. కొంతమంది ఫ్రెండ్స్ ఆ ప్రదేశానికి చేరుకోవడం .. అక్కడ జరిగే అనూహ్యమైన సంఘటనల బారిన పడటం వంటి కాన్సెప్ట్ తో గతంలో చాలా సినిమాలు వచ్చాయి. వాళ్లు ప్రాణాలతో అక్కడికి బయటపడతారా లేదా అనే ఒక క్యూరియాసిటీని రేకెత్తించాయి. ఆ దారిలో నడిచే కథనే ఇది. 

అయితే ఈ కథలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అది 'అవర్ గ్లాస్' తో ముడిపడి ఉంటుంది. హింస .. భయాన్ని కలిగించే సన్నివేశాలు హారర్ జోనర్లో కనిపించడం సాధారణమే. అయితే ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో, అదే ఈ సినిమా ప్రత్యేకతగా నిలుస్తుంది. ప్రధానమైన ఆ అంశం చుట్టూనే ఈ కథ తిరుగుతూ ఉంటుంది. 

అసలు ప్రతిరోజు రాత్రి ఆ ఇంట్లో ఏం జరుగుతోందనే విషయంపై స్నేహితులంతా దృష్టి పెడతారు. అప్పుడు వాళ్లకి అర్ధమయ్యే విషయాలు .. అక్కడి నుంచి తప్పించుకోవడానికి వాళ్లు చేసే ప్రయత్నాలు .. వాళ్లకి ఎదురయ్యే ఆటంకాలు .. అడుగడుగునా భయపెడతాయి. హారర్ జోనర్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేసే కంటెంట్ ఇది.

పనితీరు: కథ అంతా కూడా ఫారెస్టు ఏరియాలోని ఒక పాత ఇంట్లో నడుస్తుంది. అయినా బోర్ కొట్టకుండా ఆడియన్స్ ను కూర్చో బెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. ఒక సమయం ప్రకారం ఆ ఇంట్లో జరిగే భయానక సంఘటనలతో హడలెత్తించడంలో కెమెరా వర్క్ .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధానమైన పాత్రను పోషించాయని చెప్పాలి.

ముగింపు: ఇంగ్లిష్ థ్రిల్లర్ సినిమాలు ఎలా ఉంటాయో, ఈ సినిమా కూడా అలాగే ఉంటుంది. హింస ఒక రేంజ్ లో ఉంటుంది. ఆ హింసలో నుంచే భయం బయటికి వస్తుంది. సౌండ్ ఎఫెక్ట్స్ అందుకు మరింత దోహదం చేస్తాయి. థ్రిల్లర్ జోనర్ కి బాగా అలవాటు పడిపోయినవారు మాత్రమే ఈ సినిమాను చూడగలరు.