వాణి కపూర్ .. సుర్విన్ చావ్లా .. శ్రియా పిల్గాంకర్ ప్రధానమైన పాత్రలను పోషించిన భారీ వెబ్ సిరీస్ 'మండల మర్డర్స్'. గోపీ పుత్రన్ .. మనన్ రావత్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్, 8 ఎపిసోడ్స్ గా రూపొందింది. భారీ బడ్జెట్ .. భారీ తారాగణంతో నిర్మితమైన ఈ సిరీస్, ఈ రోజు నుంచే 'నెట్ ఫ్లిక్స్'లో స్ట్రీమింగ్ అవుతోంది. డిఫరెంట్ జోనర్స్ ను టచ్ చేస్తూ సాగిన ఈ సిరీస్, ఏ స్థాయిలో కనెక్ట్ అయిందనేది చూద్దాం.

కథ: ఉత్తర ప్రదేశ్ ప్రాంతంలోని 'చరణ్ దాస్ పూర్'లో .. 1952లో ఈ కథ మొదలవుతుంది. చరణ్ దాస్ పూర్ .. దట్టమైన అడవికి దగ్గరలో ఉన్న ఒక గ్రామం. 'వరుణ అడవి'లో రుక్మిణి అనే ఒక మంత్రగత్తె తన అనుచరులతో కలిసి రహస్య ప్రదేశంలో నివసిస్తూ ఉంటుంది. బొటనవ్రేలు సమర్పించిన వారి కోరికలను క్షుద్రశక్తుల ద్వారా తీరుస్తూ ఉంటుంది. శత్రువులపై పగ తీర్చుకోవాలని అనుకున్నవారు ఆమెను ఆశ్రయిస్తూ ఉంటారు.

చరణ్ దాస్ పూర్ వాసులంతా కలిసి ఆ అడవి నుంచి ఆ మంత్రగత్తెను తరిమివేస్తారు. ఆ సమయంలో ఆ ఊరు నుంచి ఢిల్లీ వెళ్లిపోయిన విక్రమ్, (వైభవ్ రాజ్ గుప్తా) అక్కడే పోలీస్ ఆఫీసర్ అవుతాడు. కొన్ని కారణాల వలన అతనిపై సస్పెన్షన్ వేటు పడుతుంది. దాంతో అతను తన తండ్రిని వెంటబెట్టుకుని సొంతవూరు వస్తాడు. గతంలో అనారోగ్యంతో బాధపడుతున్న తన తమ్ముడిని .. పిన్నిని తీసుకుని 'వరుణ అడవి'కి వెళ్లిన తన తల్లి తిరిగి రాలేదనే విషయం అతనికి అప్పుడు స్పష్టమవుతుంది. 

తన స్నేహితుడైన ప్రమోద్ సాయంతో తన తల్లి ఆచూకీ తెలుసుకోవాలని అతను నిర్ణయించుకుంటాడు. ఆ ఊళ్లో సుజయ్ - విజయ్ అనే అన్నదమ్ములు రౌడీయిజం చెలాయిస్తూ ఉంటారు. రాజకీయాలలో పైకి రావడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే అధికారం వాళ్ల చేతికి చిక్కకుండా అనన్య భరద్వాజ్ (సుర్వీన్ చావ్లా) చక్రం తిప్పుతూ ఉంటుంది. ఆ సమయంలోనే అభిషేక్ అనే యువకుడితో పాటు, సుజయ్ - విజయ్ కూడా దారుణంగా హత్యకి గురౌతారు.

ముగ్గురి శవాలపై చిత్రమైన చిహ్నాలు కనిపిస్తాయి. అవేమిటనేవి ఎవరికీ అర్థం కాదు. ఈ మిస్టరీని ఛేదించే స్పెషల్ పోలీస్ ఆఫీసర్ గా రియా థామస్ (వాణీ కపూర్) ఆ ఊరికి వస్తుంది. ఆ ఇన్వెస్టిగేషన్ లో ఆమెకి ఎదురయ్యే సవాళ్లు ఎలాంటివి? విక్రమ్ తన తల్లిని కలుసుకుంటాడా? 1952లోని మంత్రగత్తెలకు ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి? అనేది కథ.         

విశ్లేషణ: ఒక వైపున పోలీస్ యాక్షన్ .. ఒక వైపున గ్రామీణ రాజకీయాలు .. మరో వైపున ఫ్యామిలీ ఎమోషన్స్ .. ఇంకొక వైపున క్షుద్రశక్తులు అనే నాలుగు ప్రధానమైన అంశాలను అల్లుకుంటూ ఈ కథ నడుస్తుంది. ఈ నాలుగు వైపుల నుంచి కూడా ఈ కథ ఆసక్తికరంగా కొనసాగుతుంది. చాలానే పాత్రలు ఉన్నప్పటికీ, వాటిని రిజిస్టర్ చేస్తూ వెళ్లిన విధానం బాగుంది. స్క్రీ న్ ప్లే పరంగా మంచి మార్కులు కొట్టేస్తుంది. 

ప్రధానమైన మూడు ట్రాకులను నాయికలు నడిపించడం మరింత కుతూహలాన్ని రేకెత్తిస్తుంది. ఆ పాత్రలను డిజైన్ చేసిన విధానం మెప్పిస్తుంది. కథ మొత్తంలో కూడా స్త్రీ ప్రధానమైన పాత్రలే ఎక్కువగా కనిపిస్తాయి. కథ ఎప్పటికప్పుడు మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఏం జరగనుందనేది ఆడియన్స్ గెస్ చేయలేరు. మధ్యలో ఎక్కడ ఫార్వర్డ్ చేసినా ఆ తరువాత కథ అర్థం కాదు. అంత చిక్కగా ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు.

తాంత్రికానికి సంబంధించిన సెటప్ బాగుంది. అలాగే 1952 నేపథ్యంలో సీన్స్ ను ఆవిష్కరించిన తీరు ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. పాత్రలన్నింటినీ ఒక ట్రాక్ పైకి తీసుకొచ్చిన పద్ధతి ప్రేక్షకులను అలా కూర్చోబెడుతుంది. డిఫరెంట్ జోనర్స్ ను టచ్ చేస్తూ ఈ కథను నడిపించడంలో దర్శకులు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. 

పనితీరు: నిర్మాణం పరంగా .. టేకింగ్ పరంగా ఈ కంటెంట్ ఆకట్టుకుంటుంది. స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తుంది. షాజ్ మహ్మద్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. నైట్ ఎఫెక్ట్ .. రెయిన్ ఎఫెక్ట్ .. ఫారెస్ట్ నేపథ్యంలో సన్నివేశాలను చిత్రీకరించిన తీరు బాగుంది. మితేష్ సోని - మేఘన ఎడిటింగ్ మెప్పిస్తుంది. నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకునేలా సాగింది. ఆర్టిస్టులంతా కూడా సన్నివేశాలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. 

ముగింపు: డిఫరెంట్ జోనర్స్ ను టచ్ చేసిన సిరీస్ ఇది. పాత్రలు .. మలుపులు ఎక్కువే. అయినా మొదటి నుంచి చివరివరకూ ఆసక్తికరంగానే కొనసాగుతుంది. ఒకటి రెండుచోట్ల అభ్యంతరకర  సన్నివేశాలు .. అక్కడక్కడా కాస్త హింసాత్మక దృశ్యాలు అయితే ఉన్నాయి. పిల్లలతో కలిసి హాల్లో కూర్చుని చూసే సిరీస్ కాదు గానీ, ఈ తరహా జోనర్ ను ఇష్టపడేవారికి నచ్చుతుంది.