విజయ్ ఆంటోని జయాపజయాలను గురించి పెద్దగా పట్టించుకున్నట్టుగా కనిపించదు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ ఆయన ముందుకు వెళుతూ ఉంటాడు. అలా ఆయన చేసిన సినిమానే 'మార్గన్'. లియో జాన్ పాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 27వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా ఈ రోజు నుంచే  'అమెజాన్ ప్రైమ్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.

కథ: హైదరాబాదులో అమ్మాయిల వరుస హత్యలు జరుగుతూ ఉంటాయి. హంతకుడు అమ్మాయిలపై అనూహ్యంగా దాడిచేసి, మెడ ద్వారా ప్రమాదకరమైన ఒక 'డ్రగ్' ఇంజక్ట్ చేస్తున్నాడనీ, ఆ కారణంగా వాళ్లు అక్కడికక్కడే చనిపోతున్నారనే విషయం తేలుతుంది. అయితే హంతకుడు ఎందుకు హత్యలు చేస్తున్నాడనే విషయం మాత్రం పోలీసులకు అంతుబట్టదు. ఈ మిస్టరీ మర్డర్స్ గురించి, ముంబైలో పోలీస్ ఆఫీసర్ గా పనిచేస్తున్న 'ధృవ్' (విజయ్ ఆంటోని)కి తెలుస్తుంది. 

హైదరాబాదులో జరుగుతున్న ఈ హత్యలను గురించి వినగానే, ఆయన కళ్లముందు గతం కదలాడుతుంది. తన మాదిరిగా ఏ ఆడపిల్ల తండ్రి బాధపడకూడదని ఆయన భావిస్తాడు. పర్సనల్ ఇంట్రెస్ట్ తో ఈ కేసును పరిష్కరించే బాధ్యతను తీసుకుని, హైదరాబాద్ చేరుకుంటాడు. రమ్య హత్య నుంచి ధృవ్ ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. రమ్య తన బర్త్ డే రోజు రాత్రి హత్యచేయబడుతుంది. ఆమె .. కార్తీక్ ప్రేమించుకున్నారనే విషయం అతని దృష్టికి వెళుతుంది.
 
ధ్రువ్ అన్వేషణ అరవింద్ అనే యువకుడి దగ్గర ఆగుతుంది. ఎందుకంటే రమ్య చనిపోయిన రాత్రి ఆ ప్రదేశానికి దగ్గరలో అరవింద్ ఉండటం .. అందుకు ఆధారాలుగా సీసీటీవీ పుటేజ్ ఉండటమే కారణం. దాంతో ఆయన అరవింద్ ను అదుపులోకి తీసుకుంటాడు. అయితే అతను సాధారణ యువకుడు కాదనే విషయం అప్పుడే ధృవ్ కి తెలుస్తుంది. అప్పుడు ధృవ్ ఏం చేస్తాడు? ఎలా ఈ మర్డర్ మిస్టరీని ఛేదిస్తాడు? హంతకుడు ఎవరు? ఎందుకు హత్యలు చేస్తున్నాడు? అనే మలుపులతో ఈ కథ పరుగెడుతుంది.         

విశ్లేషణ: విజయ్ ఆంటోని సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ అయినా కాకపోయినా, ఆయన ఎంచుకునే కథలలో ఒక కొత్త పాయింట్ మాత్రం ఉంటుంది అనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. 'బిచ్చగాడు' సినిమా నుంచి ఆయన ఆ నమ్మకాన్ని నిలుపుకుంటూ వస్తున్నాడు. ఈ సినిమా కూడా ఆ నమ్మకాన్ని కాపాడుతుంది. చాలా తక్కువ ప్రధానమైన పాత్రలతో డిజైన్ చేసిన ఈ కథ ఆడియన్స్ ను అలా కూర్చోబెట్టేస్తుంది. 

క్రైమ్ .. సస్పెన్స్ .. ఇన్వెస్టిగేషన్ .. ఈ మూడింటినీ కలిపి నడిపించడంలో దర్శకుడు తన పనితీరును కనబరిచాడు. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ .. అన్నా చెల్లెళ్ల ఎమోషన్ .. లవర్స్ ఎమోషన్ ఈ కథలో ఎక్కువ వాటాను కొట్టేస్తాయి. ఇక మిగిలిన షేర్ మనకి హంతకుడి వైపు నుంచి కనిపిస్తుంది. హంతకుడు ఎవరనేది కనుక్కునే తీరు కొత్తగా అనిపిస్తుంది .. మరింత కుతూహలాన్ని పెంచుతూ వెళుతుంది. 

ఇది కమర్షియల్ హంగులు జోడించిన రెగ్యులర్ కంటెంట్ కాదు. హీరో.. హీరోయిన్ .. లవ్ ... డ్యూయెట్లు .. భారీ యాక్షన్ సీక్వెన్స్ లు గట్రా ఉండవు. కథ టైట్ కంటెంట్ తో చాలా సీరియస్ గా  సాగుతుంది. కథకి అడ్డొచ్చే సన్నివేశాలు ఉండవు .. ప్రేక్షకులు కూడా ఆ మూడ్ లో నుంచి బయటికి రారు. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడేవారికి ఈ సినిమా ఎంతమాత్రం అసంతృప్తిని కలిగించదు. 

పనితీరు: కథ ఏదైనా ప్రతి పాత్ర వలన ప్రయోజనం ఉండాలి. ప్రతి సన్నివేశం వలన ఉపయోగం ఉండాలి. అనవసరమైనవి తెరపై కనిపించకూడదు. అలాంటివి ఏరేయాలని చూసిన ప్రేక్షకులకు ఏమీ దొరక్కూడదు. అప్పుడే ఆ కంటెంట్ పెర్ఫెక్ట్ గా ఉందని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో దర్శకుడు లియో జాన్ పాల్ చాలానే జాగ్రత్తలు తీసుకున్నాడని చెప్పాలి. 

కథపై పూర్తి అవగాహనంతో లియో జాన్ పాల్ తన పనిని పూర్తిచేశాడు. ఎడిటింగ్ బాధ్యతను కూడా ఆయన సమర్థవంతంగా నిర్వహించాడు. యువ ఫొటోగ్రఫీ, కథపై మరింత ఆసక్తి పెరగడానికి కారణమైందని చెప్పాలి. ఇక విజయ్ ఆంటోని నేపథ్య సంగీతం ఈ సినిమాకి మరింత బలాన్ని అందించిందనే అనాలి. 

ముగింపు: కథ .. హీరో .. దర్శకుడు .. టెక్నీకల్ టీమ్ ఈ సినిమాకి నాలుగు పిల్లర్స్ గా నిలిచాయి. హీరో నుంచి .. దర్శకుడి నుంచి ఓ మాదిరి బడ్జెట్ లో వచ్చిన ఇంట్రెస్టింగ్ కంటెంట్ గా దీనిని గురించి చెప్పుకోవాలి. ఎలాంటి రక్తపాతం లేకుండా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్, ఈ జోనర్ ను ఇష్టపడేవారికి నచ్చుతుంది.