మొదటి నుంచి కూడా ఫ్యామిలీ అంతా కలిసి చూసే కంటెంట్ కి ఈటీవీ ప్రాధాన్యతనిస్తూ వస్తోంది. ఓటీటీ కంటెంట్ విషయంలోను అదే పద్ధతిని అనుసరిస్తోంది. ఓటీటీలో లఘు చిత్రాలతో పాటు, వివిధ భాషలకు చెందిన సినిమాలను తెలుగులో అందిస్తోంది. అలా ఈ వారం వదిలిన మలయాళ సినిమానే 'ఇట్టిమాని: మేడిన్ చైనా'. మోహన్ లాల్ ద్విపాత్రాభినయం చేసిన ఈ సినిమా, ఈ నెల 24వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: ఇట్టి మాథన్ (మోహన్ లాల్) చైనాలో మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణనిచ్చే గురువుగా ఉంటాడు. ఆయన భార్య దేవమ్మ నెల తప్పుతుంది. వారికి కలిగిన సంతానమే 'ఇట్టిమాని' (మోహన్ లాల్). ఇట్టిమాని పుట్టిన తరువాత ఇట్టిమాథన్ దంపతులు చైనా నుంచి ఇండియాకి వచ్చేస్తారు. కేరళ ప్రాంతంలో ఇట్టి మాథన్ ఒక చైనీస్ హోటల్ పెడతాడు. డూప్లికేట్ వస్తువులు తయారు చేసి అమ్మడంలో అతను సిద్ధహస్తుడు. ఆ వైపు నుంచే అతను ఎక్కువగా సంపాదించాడని అంతా చెప్పుకుంటూ ఉంటారు.
తండ్రి చనిపోవడంతో ఇట్టిమాని ఆ బిజినెస్ లను కొనసాగిస్తూ ఉంటాడు. కమీషన్ లేకుండా .. లాభం రాకుండా అతను ఏ పనీ చేయడు. అలా పెళ్లి విషయంలో కూడా లెక్కలు వేసుకుంటూ వెళ్లడం వలన, అతనికి 40 దాటినా పెళ్లికాకుండా పోతుంది. జెస్సీ (హనీ రోజ్)తో పెళ్లి తప్పిపోవడానికి కూడా కారణం అదే. డబ్బు పట్ల అతనికి గల వ్యామోహానికి తల్లి చీవాట్లు పెడుతూనే ఉంటుంది. సాధ్యమైనంత త్వరగా అతనికి పెళ్లి చేయాలని ప్రయత్నిస్తూ ఉంటుంది.
ఇట్టిమాని ఇంటికి దగ్గరలోనే 'అణ్ణమ్మ' (రాధిక) నివసిస్తూ ఉంటుంది. ఆమెకి ముగ్గురు కొడుకులు. వాళ్లందరికీ వివాహమై పిల్లలు కూడా. అందరూ ఎక్కడెక్కడో ఉంటారు. తన భర్త చనిపోయిన దగ్గర నుంచి పిల్లలెవరూ రాకపోవడం ఆమెను బాధిస్తూ ఉంటుంది. ఆ బాధతోనే ఆమెకి గుండెనొప్పి వస్తుంది. ఆమె ఆవేదనను అర్థం చేసుకున్న ఇట్టిమాని ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆ నిర్ణయం ఏమిటి? అది ఆమె పిల్లల ధోరణిలో మార్పు తెస్తుందా? అనేది కథ.
విశ్లేషణ: మలయాళం ప్రేక్షకులు కాంబినేషన్ కంటే కథలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ ఉంటారు. ఆ కథల్లో హడావిడి .. ఆర్భాటాలను కాకుండా సహజత్వాన్ని కోరుకుంటారు. అందువల్లనే అక్కడి సినిమాలు చాలా తక్కువ బడ్జెట్ లో పూర్తవుతూ ఉంటాయి .. ఎక్కువ ఆదరణ పొందుతూ ఉంటాయి. అలాంటి కేటగిరీలో రూపొందిన సినిమాగా ఇది కనిపిస్తుంది. కామెడీ టచ్ తో ఫ్యామిలీ ఎమోషన్స్ ను ఆవిష్కరించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.
రెక్కలు వచ్చిన తరువాత పిల్లలు ఎక్కడెక్కడికో ఎగిరిపోతారు. ఎవరి ఫ్యామిలీకి సంబంధించిన ఆనందాలను .. సంతోషాలను వాళ్లు చూసుకుంటూ ఉంటారు. సొంత ఊళ్లోని కన్నవాళ్లను గురించి ఆలోచించే సమయం వారికి ఉండదు. పిల్లలు పట్టించుకోక .. ఆ విషయాన్ని నలుగురికి చెప్పుకోలేక సతమతమైపోయేవారు ఎందరో. అలాంటి కోణాలను ఆవిష్కరిస్తూ ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయి. అయితే ఆ కథలకు భిన్నంగా ఒక కొత్త పాయింట్ ఈ సినిమాను నడిపిస్తుంది.
పిల్లలు తమ పట్ల ఎలా ప్రవర్తించినా తల్లిదండ్రులు సర్దుకుపోతుంటారు. తల్లి మనసులో ఏముందో కొంతమంది పిల్లలకు సున్నితంగా చెబితే సరిపోతుంది. కానీ మరికొంతమందికి అది అర్థం కావాలంటే కాస్త కరుకైన దారిలో వెళ్లవలసిందే అని చెప్పడమే ఈ కథలోని ముఖ్యమైన ఉద్దేశంగా కనిపిస్తుంది. గ్రామీణ నేపథ్యం .. అక్కడివారి స్వభావాలు .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. సహజత్వం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయని చెప్పొచ్చు.
పనితీరు: జిబి - జోజు దర్శకత్వం వహించిన సినిమా, చాలా సింపుల్ లైన్ తో కనిపిస్తుంది. ఆయా పాత్రలను డిజైన్ చేసిన తీరు, ట్రీట్మెంట్ మాత్రం ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చేలా ఉంటుంది. ఈ సినిమాను తెరపై కాకుండా, పిట్టగోడపై నుంచి మన పక్కింట్లో జరుగుతున్న తంతంగాన్ని చూస్తున్నట్టుగా అనిపిస్తుంది.
మోహన్ లాల్ .. రాధిక .. లలిత .. సిద్ధికీ .. అజూ వర్గీస్ నటన ఆకట్టుకుంటుంది. షాజీ కుమార్ ఫొటోగ్రఫీ .. దీపక్ దేవ్ నేపథ్య సంగీతం .. సూరజ్ ఎడిటింగ్ కథకి తమవంతు సపోర్టును అందించాయి.
ముగింపు: తల్లి ఎప్పుడూ తన పిల్లల గురించే ఆలోచన చేస్తుంది. కానీ పిల్లలు తమ ప్రపంచం పెద్దది అంటూ ఆ తల్లిని పట్టించుకోవడం మానేస్తారు. అలాంటి పిల్లలను ఆలోచింపజేసే కథ ఇది. ఎలాంటి హడావిడి లేకుండా సహజత్వానికి దగ్గరగా సాగిపోయే ఈ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు.
'ఇట్టిమాని: మేడ్ ఇన్ చైనా' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ
Ittymaani Review
- మోహన్ లాల్ నుంచి వచ్చిన సినిమా
- కామెడీ టచ్ తో ఆగే ఎమోషనల్ డ్రామా
- సహజత్వానికి పెద్దపీట వేసిన దర్శకుడు
- ఆలోచింపజేసే కంటెంట్
Movie Details
Movie Name: Ittymaani
Release Date: 2025-07-24
Cast: Mohanlal, Radhika, Lalitha, Honey Rose, Madhuri, Siddhique, Aju Varghese
Director: Jibi- Joju
Music: Deepak Dev
Banner: Aashirvad Cinemas
Review By: Peddinti