'రోంత్' (జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!

  • మలయాళంలో రూపొందిన 'రోంత్'
  • ఒకరాత్రిలో సాగే కథ ఇది
  • సహజత్వానికి దగ్గరగా సన్నివేశాలు
  • ఆలోచింపజేసే సందేశం    
  • ఊహించని క్లైమాక్స్

తెరపై ఇంట్రెస్టింగ్ గా సాగే పోలీస్ కథల పట్ల ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తిని కనబరుస్తూనే ఉంటారు. అలాంటి పోలీస్ కథలను ఆద్యంతం ఆసక్తికరంగా నడిపించడంలో మలయాళ దర్శకులు మరింత నైపుణ్యాన్ని చూపుతుంటారు. అలా మలయాళంలో రూపొందిన సినిమానే  'రోంత్'. ఈ ఏడాది జూన్ 13వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ రోజు నుంచే 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతో పాటు, ఇతర భాషలలోను అందుబాటులో ఉంది. 

కథ: ఈ కథ కేరళలోని 'ధర్మశాల'లో జరుగుతూ ఉంటుంది. 'ధర్మశాల' పోలీస్ స్టేషన్ లో SI గా యోహన్నా (దిలీష్ పోతన్) కానిస్టేబుల్ దిన్నాథ్ (రోషన్ మాథ్యూ) పనిచేస్తూ ఉంటారు. వృత్తి పరంగా యోహన్నాకి పాతికేళ్ల అనుభవం ఉంటుంది. భార్య మానసిక స్థితి గురించే అతను ఆందోళన చెందుతూ ఉంటాడు. ఇక దిన్నాథ్ మాత్రం ఆ ఉద్యోగానికి కొత్త. తల్లినీ .. భార్యనీ .. ఏడాదిలోపు వయసున్న పాపని తీసుకుని అతను ఆ ఊరు వస్తాడు. దిన్నాథ్ కొంచెం సెన్సిటివ్ అనీ, అతను ఈ జాబ్ కి కరెక్ట్ కాదని యోహన్నా భావిస్తాడు.

ఒక రోజున యోహన్నా - దిన్నాథ్ కలిసి నైట్ పెట్రోలింగ్ చేయవలసి వస్తుంది. పాపకి ఫీవర్ గా ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితిల్లో దిన్నాథ్ డ్యూటీకి వస్తాడు. ఆ రాత్రి వారు ఒక ప్రేమ వ్యవహారాన్ని .. ఒక ఆత్మహత్యను .. ఒక గృహహింస సంబంధించిన కేసులను ఫేస్ చేస్తారు. డ్యూటీని సవ్యంగా పూర్తిచేశామని హ్యాపీగా ఫీలవుతూ, ఇంటికి వెళ్లిపోతారు. అప్పుడే ఓ అనూహ్యమైన సంఘటన జరుగుతుంది. అదేమిటి? దాంతో వాళ్ల జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది కథ. 

విశ్లేషణ: 'రోంత్' అంటే 'గస్తీ' అని అర్థం. ఒక ఎస్ఐ .. ఒక పోలీస్ కానిస్టేబుల్ కలిసి ఒకరాత్రి వేళ గస్తీ తిరగడానికి వెళతారు. ఆ రాత్రి వారి జీవితాలను ఎలాంటి మలుపు తిప్పిందనేది కథ. ఈ సినిమాకి షాహి కబీర్ దర్శకత్వం వహించాడు. 'నాయట్టు' .. 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' సినిమాలకు షాహి కబీర్ రచయితగా పనిచేశారు. ఆ రెండూ ప్రేక్షకుల దరణ పొందిన పోలీస్ కథలే. అందువలన సహజంగానే ఈ కంటెంట్ పై అందరూ దృష్టి పెట్టారు. 

ఈ కథలో 80 శాతం నైట్ పెట్రోలింగ్ లోనే .. నైట్ ఎఫెక్ట్ లోనే నడుస్తుంది. వాళ్లకి ఎదురయ్యే సంఘటనలు .. వాళ్లు తీసుకునే నిర్ణయాలతో కథ ముందుకు వెళుతూ ఉంటుంది. మధ్య మధ్యలో ఎమోషన్స్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటాయి. కథ చాలా సాఫిగా సాగిపోతుందే అని ప్రేక్షకులు అనుకుంటున్నా సమయంలోనే ఊహించని మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి దాదాపు ఒక అరగంట పాటు ఉత్కంఠను రేకెత్తిస్తుంది. క్లైమాక్స్ చాలా రోజుల పాటు గుర్తుండిపోతుంది. 

మనం అసలు ఏ పనికి పనికోస్తామో తెలుకోవడంపైనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. అలాగే మనం సిన్సియర్ గా పనిచేస్తూ వెళ్లడమే కాదు, మన చుట్టూ ఏం జరుగుతుందో గమనించడం కూడా అవసరమే. ఈ రెండు విషయాలలో లౌక్యం చూపకపోతే, వృత్తి సంబంధమైన జీవితమే కాదు, వ్యక్తిగతమైన జీవితం కూడా చీకటైపోతుంది అనే సందేశంతో కూడిన కథ ఇది.

పనితనం: దర్శకుడు షాహీ కబీర్ రచయితగా ఇంతకుముందు పనిచేసిన సినిమాలు చూస్తే, ఆయన స్క్రీన్ ప్లే సామర్థ్యం ఎలాంటిది అనే విషయం అర్థమైపోతుంది. అయితే ఈ సినిమా విషయంలో ఆ స్థాయి పట్టు .. వేగం కనిపంచవు. కథ నిదానంగా .. నింపాదిగా నడుస్తూ చాలా సమయాన్ని వృథా చేసిన భావన కలుగుతుంది. కాకపోతే రెండే ప్రధానమైన పాత్రలతో ఆయన చేసిన ప్రయత్నం గొప్పగా అనిపిస్తుంది.

నైట్ పెట్రోలింగ్ తో కూడిన కథ కావడం వలన, కథ అంతా చీకట్లో నడుస్తుంది. ఆ సమయంలో చేసిన కెమెరా వర్క్ మంచి మార్కులు కొట్టేస్తుంది. మనేశ్ మాధవన్ ఫొటోగ్రఫీ ఈ సినిమాకి ప్రధానమైన బలం అని చెప్పాలి. అలాగే అనిల్ జాన్సన్ నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటుంది. ప్రవీణ్ ఎడిటింగ్ కూడా మెప్పిస్తుంది. 

ముగింపు: చేసే పనిలో నీతిగా .. నిజాయితీగా ఉండటమే కాదు, తెలివిగా ఉండటం కూడా ముఖ్యమే అనే విషయాన్ని చాటిచెప్పే సినిమా ఇది. కథ నిదానంగా నడిచినా సహజత్వానికి దగ్గరగా తీసుకుని వెళుతుంది. క్లైమాక్స్ మాత్రం ఎవరూ గెస్ చేయనిదిగా ఉంటుంది. చాలా రోజులు మనలను వెంటాడుతుంది కూడా. 

Movie Details

Movie Name: Ronth

Release Date: 2025-07-22

Cast: Roshan Mathew, Dileesh Pothan, Arun Cherukavil, Roshan Abdul Rahoof

Director: Shahi Kabir

Producer: Vineeth Jain

Music: Anil Johnson

Banner: Junglee Pictures

Review By: Peddinti

Ronth Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews