బాలీవుడ్ వైపు నుంచి ఈ మధ్య కాలంలో వచ్చిన భారీ వెబ్ సిరీస్ లలో, 'స్పెషల్ ఓపీఎస్' ఒకటని చెప్పాలి. కేకే మేనన్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సిరీస్ లో అంతర్భాగంగా వచ్చిన 'స్పెషల్ ఓపీఎస్ 1.5'కి కూడా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇక రీసెంటుగా 'స్పెషల్ ఓపీఎస్ 2'ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ నెల 18 నుంచి 7 ఎపిసోడ్స్ గా 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: 'బుడాపెస్ట్' లో జరుగుతున్న ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సదస్సుకి ఇండియా నుంచి డాక్టర్ పీయూష్ భార్గవ్ (ఆరిఫ్ జకారియా) హాజరవుతాడు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ప్రపంచాన్ని ఎలా శాసిస్తుందనే విషయాన్ని గురించి ఆయన ఆ సదస్సులో మాట్లాడి వస్తుండగా, కొంతమంది దుండగులు ఆయనను కిడ్నాప్ చేస్తారు. తనని ఎవరి కిడ్నాప్ చేయించారు? ఎక్కడికి తీసుకుని వెళుతున్నారు? అనే విషయం పీయూష్ భార్గవ్ కి అర్థం కాదు.
ఇక మరో వైపున బ్యాంకుల నుంచి పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్న జిగ్నేష్ లోలాకియా విదేశాలకు పారిపోతాడు. భవిష్యత్తులో తమ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆ బ్యాంకులలో డబ్బు దాచుకున్న సామాన్యులు, నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ప్రజల వైపు నుంచి పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతూ ఉంటాయి. వాళ్లలో సుబ్రహ్మణ్యం (ప్రకాశ్ రాజ్) కూడా ఉంటాడు. జిగ్నేష్ ను వెనక్కి తీసుకురావాలని అతను పట్టుబడతాడు.
ఈ రెండు సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యతను, 'రా' ఉన్నతాధికారులు హిమ్మత్ సింగ్ కి అప్పగిస్తారు. ఫ్యామిలీ వైపు నుంచి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ, హిమ్మత్ సింగ్ తన టీమ్ తో కలిసి రంగంలోకి దిగుతాడు. శత్రువుల బారి నుంచి పీయూష్ భార్గవ్ ను కాపాడి తీసుకుని రావడం, బ్యాంకులకు అప్పులు ఎగేసి దేశం విడిచిపోయిన జిగ్మేష్ ను బంధించి తీసుకురావడం ఆయన ముందున్న సవాళ్లు. వాటిని ఆయన టీమ్ ఎలా ఎదుర్కొందనేదే మిగతా కథ.
విశ్లేషణ: ఆధునిక ప్రపంచాన్ని ఇప్పుడు AI అలుముకుంటోంది. అన్నివైపులా అది చాలా వేగంగా విస్తరిస్తోంది. AI కారణంగా కొన్ని ఉపయోగాలను పొందడమే కాదు, మరికొన్ని సమస్యల కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఇదే అంశాన్ని ప్రధానంగా తీసుకుని నీరజ్ పాండే - దీపక్ కింగ్రాని ఈ కథను తయారు చేసుకున్నారు. ప్రధానమైన ఈ అంశాన్ని హైలైట్ చేస్తూనే, కథాంశం ఏమిటనేది రిజిస్టర్ చేసేశారు.
దేశ భద్రత .. 'రా' ఆపరేషన్స్ కి సంబంధించిన చాలా సిరీస్ లు ఇంతకుముందు వచ్చాయి. అదే తరహాలో ఈ సిరీస్ లోని ఈ సీజన్ కూడా కొనసాగుతుంది. కథ పరిధి విస్తృతంగా ఉండటం .. ఖర్చుకు వెనకాడకపోవడం మనకి స్క్రీన్ పై కనిపిస్తుంది. ఈ తరహా సిరీస్ లకు యాక్షన్ సీన్స్ ప్రధానమని చెప్పాలి. ఆ వైపు నుంచి ఆశించిన స్థాయిలో జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక ఎమోషన్స్ వైపు నుంచి కూడా బ్యాలెన్స్ చేయాలనుకున్నారు. కానీ ఆ వైపు నుంచి సరైన ట్రాక్ వేసుకోలేకపోయారు.
ఒక సమస్యపై కాకుండా రెండు సమస్యల దిశగా 'రా' టీమ్ కదలడం, రెండు పడవలపై ప్రయాణం మాదిరిగా అనిపిస్తుంది. మెయిన్ లైన్ ఇంట్రెస్టింగ్ గా ముందుకు వెళుతూ ఉండగా, బ్యాంకులకు జిగ్నేష్ అనే బిజినెస్ మెన్ టోపీపెట్టి పారిపోవడమనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఇది ప్రధానమైన అంశానికి అంతరాయాన్ని కలిగించినట్టుగా అనిపిస్తుంది. అలాగే చాలా పాత్రలు తెరపైకి వస్తుంటాయిగానీ, వాటికి సరైన ప్రాధాన్యత లేకపోవడం కనిపిస్తుంది.
పనితీరు: దర్శకుడు ప్రధానమైన అంశానికి సంబంధించిన కథను బలంగానే రాసుకున్నారు. అయితే ఇటు హీరో .. అటు విలన్ పాత్రల మినహా, మిగతా పాత్రలేవీ ప్రేక్షకులను ప్రభావితం చేయలేకపోవడం కనిపిస్తుంది. చివరికి ప్రకాశ్ రాజ్ పాత్ర కూడా బలహీనంగానే అనిపిస్తుంది. అయితే ఆయా దేశాలలోని లొకేషన్స్, ఈ కథకి కొత్త ఆకర్షణను .. భారీతనాన్ని తీసుకొచ్చాయని చెప్పాలి.
కేకే మేనన్ .. తాహిర్ రాజ్ భాసిన్ నటన ఆకట్టుకుంటాయి. అలాగే యాక్షన్ సీక్వెన్స్ లో కరణ్ థాకర్ .. సయామీ ఖేర్ మెప్పిస్తారు. అరవింద్ సింగ్ ఫొటోగ్రఫీ ఆకట్టుకుంటుంది. అద్వైత్ నేపథ్య సంగీతం మెప్పిస్తుంది. ప్రవీణ్ ఎడిటింగ్ ఓకే.
ముగింపు: స్పెషల్ ఓపీఎస్ 2 నిర్మాణ విలువలు బాగున్నాయి. ప్రధానమైన కథాంశం బాగానే ఉంది. అయితే జిగ్మేష్ సూత్రధారిగా నడిచే బ్యాంకు వ్యవహారం .. ఎమోషనల్ సైడ్ కూడా ఉండాలనే ఉద్దేశంతో సెట్ చేసిన హీరో ఫ్యామిలీ ఇష్యూ .. ఈ రెండూ కూడా ప్రధానమైన కథ వేగానికి ఆటంకాన్ని కలిగించినట్టుగా అనిపిస్తుంది. అభ్యంతరకర సంభాషణలు .. సన్నివేశాలు లేని కారణంగా, ఫ్యామిలీతో కలిసి ఈ సిరీస్ ను చూడొచ్చు.
'స్పెషల్ ఓపీఎస్ 2' (జియో హాట్ స్టార్) సిరీస్ రివ్యూ!
Special Ops 2 Review
- యాక్షన్ థ్రిల్లర్ గా 'స్పెషల్ ఓపీఎస్ 2'
- ప్రధానమైన పాత్రలో కేకే మేనన్
- ఆకట్టుకున్న యాక్షన్ సీక్వెన్స్
- కనెక్ట్ కాని ఎమోషన్స్
- అలరించే భారీతనం
Movie Details
Movie Name: Special Ops 2
Release Date: 2025-07-18
Cast: KK Menon, Tahir Raj Bhsin, Prakash Raj, Saiyami Kher
Director: Neeraj Pandey
Music: Advait Nemlekar
Banner: Friday Storytellers
Review By: Peddinti
Trailer