కన్నడలో కిచ్చా సుదీప్ కి మంచి క్రేజ్ ఉంది. ఆయన కథానాయకుడిగా రూపొందిన సినిమానే 'హెబ్బులి'. ఫిబ్రవరి 23వ తేదీన 2017లో థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. యాక్షన్ థ్రిల్లర్ జోనర్లో నిర్మితమైన ఈ సినిమాకి కృష్ణ దర్శకత్వం వహించాడు. తెలుగులో ఈ సినిమా 'సారథి' టైటిల్ తో 'ఆహా' ఓటీటీ ట్రాక్ పై వచ్చింది. ఈ నెల 18వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
కథ: రామ్ (సుదీప్) ఆర్మీలో స్పెషల్ ఫోర్స్ లో పనిచేస్తూ ఉంటాడు. ఒకానొక ఆపరేషన్ లో అతను డాక్టర్ నందిని (అమలా పాల్)ను రక్షిస్తాడు. అప్పటి నుంచి ఆమె అతణ్ణి ఇష్టపడుతూ ఉంటుంది. అదే సమయంలో అతని అన్నయ్య సత్యమూర్తి (రవిచంద్రన్) చనిపోయినట్టుగా తెలుస్తుంది. సత్యమూర్తి కలెక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఆయన గురించి ఆలోచన చేస్తూనే, రామ్ తన సొంతవూరుకి చేరుకుంటాడు. వదిన అనూరాధ (కల్యాణి)నీ, ఆమె కూతురు రీతూను ఓదార్చుతాడు.
సత్యమూర్తి 'ఉరి' వేసుకుని చనిపోయాడని తెలిసి, రామ్ ఆశ్చర్యపోతాడు. తన అన్నయ్య అంత పిరికివాడు కాదని తెలిసిన రామ్, జరిగిందేమిటో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అదే సమయంలో తనని ఎవరో రహస్యంగా గమనిస్తున్నట్టు, ఫాలో అవుతున్నట్టుగా అతనికి అనిపిస్తుంది. దాంతో అన్నయ్య మరణం పట్ల అతనికి గల అనుమానం మరింత బలపడుతుంది. ఇక ఆలస్యం చేయకుండా ఈ మిస్టరీని ఛేదించడానికి రంగంలోకి దిగుతాడు.
ఆ ప్రయత్నంలో అతనికి కబీర్ ( కబీర్ దుహాన్ సింగ్) .. రెడ్డెప్ప ( రవి శంకర్) .. అమ్రిత్ షా (రవికిషన్ ) పేర్లు వినిపిస్తాయి. అప్పటి నుంచి రామ్ చూపులు వారిని వెంటాడటం మొదలుపెడతాయి. ఈ ముగ్గురూ ఎవరు? ఆ ముగ్గురుతో సత్యమూర్తికి గల సంబంధం ఏమిటి? ఆ విషయం తెలుసుకోవడంలో రామ్ ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది మిగతా కథ.
విశ్లేషణ: ఆర్మీలో పనిచేసే ఒక తమ్ముడు, తన అన్నయ్య హఠాన్మరణం గురించి తెలిసి సొంత ఊరుకు వస్తాడు. తన అన్నయ్యది ఆత్మహత్య కాదనీ, హత్య అని అనుమానిస్తాడు. నిజానిజాలు తెలుసుకోవడానికి అతను సాగించిన ప్రయాణమే ఈ సినిమా కథ. ఇలాంటి కథలు గతంలో చాలానే వచ్చాయి. ఏ మాత్రం కొత్తదనం వైపు వెళ్లకుండా, అదే తరహా కథను మరోసారి చెప్పడానికి చేసిన ప్రయత్నమే ఇది.
ఈ మొత్తం కంటెంట్ లో హీరో అన్నయ్యను ఎవరు చంపారు? ఎందుకు చంపారు? ఆ నిజాలను హీరో ఎలా తెలుసుకున్నాడు? అనే అంశాలే అత్యంత కీలకం. అయితే నెక్స్ట్ ఏం జరుగుతుందా అనే ఒక కుతూహలాన్ని రేకెత్తించకుండా, రొటీన్ గా కథను చెప్పుకుంటూ వెళ్లిపోయారు. ఒకరి తరువాత ఒకరిగా మూడు అంచెల పద్ధతిలో ముగ్గురు విలన్లను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. కానీ ఎవరి పాత్రలోను బలం కనిపించదు.
పనితీరు: దర్శకుడు బలమైన కథను రాసుకోలేదు. స్క్రీన్ ప్లే వైపు నుంచి ఎలాంటి మేజిక్ చేయడానికి ట్రై చేయలేదు. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ ను ఆడియన్స్ కి కనెక్ట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం ఫలించలేదు. డిఫరెంట్ గా డిజైన్ చేసినప్పటికీ, కిచ్చా సుదీప్ లుక్ పెద్దగా ఆకట్టుకోదు. ఆయన స్టైల్ వైపు నుంచి కథను చెప్పడానికి ప్రయత్నించినట్టు కనిపించదు.
కరుణాకర్ ఫొటోగ్రఫీ ఫరవాలేదు. దీపు ఎస్ కుమార్ ఎడిటింగ్ ఓ మాదిరి. అర్జున్ జన్య సంగీతం అంతగా ఆకట్టుకోదు. బాణీలు అంతంత మాత్రమే. బాణీలకు సంబంధించి సాగే తెలుగు సాహిత్యం మరీ ఇబ్బంది పెడుతుంది. ఈ విషయంలో ఎంతమాత్రం శ్రద్ధ పెట్టినట్టుగా కనిపించదు. రెండు పాటలను పూర్తిగా ఎత్తేయవచ్చు కూడా. ఇక నేపథ్య సంగీతం విషయానికి వస్తే, ఎంతసేపూ హీరోయిజాన్ని పైకి లేపడం కోసమే కష్టపడింది.
ముగింపు: కన్నడంలో 'హెబ్బులి'గా రూపొందించిన ఈ సినిమాను, తెలుగులో 'సారథి' టైటిల్ తో రిలీజ్ చేశారు. ఎప్పటికప్పుడు హీరోను పైకి లేపడానికి ప్రయత్నిస్తూ, కథను మాత్రం వదిలేశారు. దాంతో హీరోయిజం ఎలివేషన్స్ కి సంబంధించిన దృశ్యాలు తప్ప, మిగతాదంతా పాత సినిమాను కొత్త థియేటర్లో చూసినట్టుగా అనిపిస్తుంది.
'సారథి' (ఆహా) మూవీ రివ్యూ!
Saradhi Review
- సుదీప్ హీరోగా రూపొందిన 'హెబ్బులి'
- తెలుగు టైటిల్ తో వచ్చిన 'సారథి'
- రొటీన్ గా నడిచే కథాకథనాలు
- సందర్భానికి మించి సాగిన నేపథ్య సంగీతం
Movie Details
Movie Name: Saradhi
Release Date: 2025-07-18
Cast: Sudeep, Ravichandran, Amala Paul, Kabir Duhan Singh, Ravi Shankar, Ravi Kishan
Director: Krishna
Music: Arjun Janya
Banner: CMB Productions
Review By: Peddinti