అథర్వ - నిమిషా సజయన్ ప్రధానమైన పాత్రలను పోషించిన తమిళ సినిమానే 'DNA'. నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 20వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఫ్యామిలీ ఎమోషన్స్ తో కూడిన ఈ యాక్షన్ థ్రిల్లర్, ఈ నెల 18వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: చెన్నై వీధుల్లో ఆనంద్ (అథర్వ) తాగేసి తిరుగుతుంటాడు. అందుకు కారణం అతను ప్రేయించిన అమ్మాయి శరణ్య (మానస చౌదరి) అతనికి దక్కకుండా పోవడమే. ఆనంద్ అలా మారిపోవడం పట్ల తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. పెళ్లి చేస్తే దారిన పడతాడు అనే ఉద్దేశంతో, దివ్య (నిమిషా సజయన్) సంబంధాన్ని సెట్ చేస్తారు. ఆ అమ్మాయి మానసిక స్థితి సరిగ్గా ఉండదని తెలిసినా, ఆమెతో పెళ్లికి ఆనంద్ అంగీకరిస్తాడు. వారి పెళ్లి జరిగిపోతుంది.  

దివ్యకి నెలలు నిండటంతో ఆనంద్ ఒక హాస్పిటల్లో చేరుస్తాడు. దివ్య ఒక మగబిడ్డకు జన్మనిస్తుంది. అయితే కొంతసేపటి తరువాత ఆ బిడ్డ తమ బిడ్డకాదని దివ్య గోల చేయడం మొదలుపడుతుంది. హాస్పిటల్ సిబ్బంది ఎంతగా చెప్పినా ఆమె వినిపించుకోదు. దివ్య మానసిక స్థితి గతంలో సరిగ్గా ఉండక పోవడం వలన, ఆమె చెబుతున్నది దాంట్లో ఎంతవరకూ నిజం ఉందనేది ఆనంద్ తేల్చుకోలేకపోతాడు. ఆమె కుటుంబ సభ్యుల పరిస్థితి కూడా అదే. 

దివ్య బాధను చూడలేకపోయిన ఆనంద్, ఒక ప్రైవేట్ హాస్పిటల్లో DNA టెస్ట్ చేయిస్తాడు. ఆ బిడ్డ వారి బిడ్డ కాదని తెలుస్తుంది. దాంతో తమ బిడ్డను ఎవరో కిడ్నాప్ చేయించారనే విషయం ఆయనకి  అర్థమవుతుంది. అయితే తన బిడ్డను ఎత్తుకుపోతూ, వేరే బిడ్డను తమకి వదిలేసి ఎందుకు వెళ్లిపోయారనేది ఆయనకు అర్థం కాదు. తమ బిడ్డ ఆచూకీ తెలుసుకోవడం కోసం అతను ఏం చేస్తాడు? ఆయన ప్రయత్నం ఫలిస్తుందా? అనేది మిగతా సినిమా. 

విశ్లేషణ: హాస్పిటల్స్ చుట్టూ అల్లుకున్న మాఫియా నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. ఇది కూడా ఆ తరహా సినిమానే. కాకపోతే కొత్త యాంగిల్ లో ఈ కథను ఆవిష్కరించారు.
పురిటిలోనే తన బిడ్డను మాయం చేశారని గ్రహించిన ఓ తల్లి .. బిడ్డకి దూరమై ఆ తల్లి పడే ఆవేదనను చూడలేని భర్త .. తమ బిడ్డ ఆచూకీ కనుక్కోవడం కోసం వారు పడే ఇబ్బందులను దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. 

ఒక వైపున తమ బిడ్డ ఎక్కడ ఉన్నది జాడ తెలుసుకోవాలి. మరో వైపున తమ చేతికి వచ్చిన బిడ్డ ఎవరనేది తెలుసుకుని ఆ తల్లిదండ్రులకు అప్పగించాలి. తమని ఇంతగా బాధపెట్టిన ముఠా వెనుక ఎవరున్నారనేది పసిగట్టాలి. ఎలాగైనా సరే ఆ ముఠాను చట్టానికి పట్టివ్వాలి. అనే ఒక ఉద్దేశంతో హీరో చేసే ఈ పోరాటాన్ని అంచలంచెలుగా నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లిన విధానం ఆసక్తికరంగా అనిపిస్తుంది. సస్పెన్స్ తో పాటు అక్కడక్కడా కళ్లు చెమ్మగిల్లేలా చేసే సన్నివేశాలు కనెక్ట్ అవుతాయి.         

పనితీరు: దర్శకుడు నెల్సన్ వెంకటేశన్ పేరు వినగానే, గతంలో ఆయన ఐశ్వర్య రాజేశ్ తో చేసిన 'ఫర్హానా' సినిమా గుర్తుకువస్తుంది. స్క్రేన్ ప్లే పరంగా ఆ సినిమా గొప్పగా అనిపిస్తుంది. అదే పోకడ ఈ సినిమా విషయంలోను కనిపిస్తుంది. సస్పెన్స్ .. యాక్షన్ .. ఎమోషన్ కలిసి నడుస్తూ ఉంటాయి. అందువలన కథనాథనాలకు మంచి మార్కులు పడతాయి. 

అథర్వ - నిమిషా సజయన్ నటన ఈ సినిమాకి హైలైట్ నిలుస్తుంది. ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలలో ఇద్దరూ కూడా జీవించారు. బాలాజీ శక్తివేల్ నటన చాలా సహజంగా అనిపిస్తుంది. గిబ్రాన్ నేపథ్య సంగీతం .. పార్తీబన్ ఫొటోగ్రఫీ .. సబు జోసెఫ్ ఎడిటింగ్ ఆకట్టుకుంటాయి.

ముగింపు: ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ అనేక మలుపులు తిరుగుతూ, ఉత్కంఠభరితమైన ఒక ముగింపును ఇస్తుంది. ఎమోషన్స్ వైపు నుంచ్చి ఎక్కువ మార్కులు కొట్టేస్తుంది. ఎలాంటి అభ్యతరకరమైన సన్నివేశాలు లేని ఈ సినిమాను, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.