'జూనియర్' .. ఈ రోజునే థియేటర్లకు వచ్చిన సినిమా. ఒక్కసారిగా ప్రమోషన్స్ తో హడావిడి చేసి వదిలిన సినిమా ఇది. వారాహి బ్యానర్ .. గొప్ప గొప్ప టెక్నీషియన్స్ .. హీరోయిన్ గా శ్రీలీల. ఈ హడావుడి అంతా చూసి, అసలు ఈ కుర్రాడు ఎవరబ్బా అని అంతా అనుకున్నారు. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు అని తెలియగానే, రిలీజ్ డేట్ పై ఫోకస్ పెట్టారు. తెరపై కథ కనిపించిందా .. ఖర్చు కనిపించిందా? రెండూ కలిసే కనిపించాయా? అనేది ఇప్పుడు చూద్దాం.
కథ: 'విజయనగరం' అనే విలేజ్ లో కోదండపాణి (రవిచంద్రన్) దంపతులకు లేటు వయసులో పుట్టినవాడే అభి (కిరీటి). అభి పుట్టినవెంటనే తల్లి చనిపోతుంది. దాంతో అన్నీ తానై తండ్రే పెంచుతాడు. అభి ఇంజనీరింగులో అడుగుపెడతాడు. జీవితంలో వయసైపోయిన తరువాత తలచుకోవడానికి కొన్ని మెమొరీస్ అంటూ ఉండాలి. అందువలన ఆ మెమొరీస్ కోసం ప్రతి విషయాన్ని ఎక్స్ పీరియన్స్ చేయాలి అనే బలమైన అభిప్రాయంతో ఉంటాడు.
కాలేజ్ లో అతనికి స్ఫూర్తి (శ్రీలీల) తారస పడుతుంది. అప్పటి నుంచి ఆమె వెనకాల తిరగడం మొదలుపెడతాడు. ఆమె కోసమే ఒక పెద్ద సంస్థలో జాబ్ సంపాదిస్తాడు. ఆ సంస్థ చైర్మన్ గోపాలం (రావు రమేశ్). ఆయన కూతురు విజయ సౌజన్య ( జెనీలియా). తన కూతురును సీఈఓ గా చేసే ప్రయత్నాల్లో గోపాలం ఉంటాడు. ఉద్యోగంలో చేరిన మొదటి రోజునే తన పట్ల విజయ సౌజన్యకి మంచి అభిప్రాయం లేకుండా చేసుకుంటాడు అభి.
అభిని చూడగానే విజయ సౌజన్య కోపంతో మండిపోతూ ఉంటుంది. అతను మాట్లాడటానికి ప్రయత్నిస్తే చాలు చిరాకుపడుతూ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లోనే ఆమెతో పాటు అభిని విజయానగరం పంపిస్తాడు గోపాలం. విజయనగరంలో జరగవలసిన పనేమిటి? ఆఫీసులో ఎంతోమంది ఉండగా విజయ సౌజన్యతో అభిని మాత్రమే పంపించడానికి గల కారణం ఏమిటి? విజయనగరంతో విజయ సౌజన్యకు గల సంబంధం ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: డబ్బు .. పలుకుబడి ఉన్న ఫ్యామిలీస్ నుంచి ఆసక్తి ఉన్న కుర్రాళ్లు హీరోలుగా ఎంట్రీఇవ్వడం చాలా కాలంగా జరుగుతూ వస్తున్నదే. అలా గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి కూడా ఈ సినిమాతో హీరోగా వెండితెరకి పరిచయమయ్యాడు. అవకాశం ఉంది కాబట్టి హీరో అయ్యాడని అనుకుని లైట్ తీసుకున్నారు. కానీ ఇంటర్వ్యూలలోను .. ఈవెంట్స్ లోను సింపుల్ గా కనిపిస్తూ, తన బాడీ లాంగ్వేజ్ తోను .. ట్రోలింగ్ జరక్కుండా చూసుకోవడంలో సక్సెస్ అయ్యాడు.
సాధారణంగా కొత్తగా ఒక హీరో పరిచయమవుతున్నప్పుడు 'ఇతగాడు అన్నీ చేసేయగలడు' అనేది సాధ్యమైనంత తక్కువ సమయంలో ఆడియన్స్ కి చెప్పడానికి తొందరపడటం కనిపిస్తుంది. అదే ఆరాటం .. తాపత్రయం ఈ సినిమాలోనూ కనిపిస్తుంది. అందువల్లనే ఫైటూ .. డాన్స్ .. లవ్వు .. వంటి అంశాలు చకచకా తెరపైకి వచ్చేస్తూ ఉంటాయి. చాకులాంటి కుర్రాడే అని ఆడియన్స్ తో అనిపించడానికి నానా ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి.
కథ లేకుండా హడావిడి చేయడానికి మాత్రం ట్రై చేయలేదు .. అంతవరకూ సంతోషం. యాక్షన్ .. ఫ్యామిలీ ఎమోషన్స్ .. లవ్ .. రొమాన్స్ ఉండేలా చూసుకున్నారు. అయితే కొత్తగా చెప్పడానికి అవకాశమున్న సన్నివేశాలను .. కథను నెక్స్ట్ లెవెల్ కి తీసుకుని వెళ్లే అంశాలను రొటీన్ గా రాసుకోవడం వలన, కథ అంతా హీరోకి అప్పగించేయడం వలన మిగతా ఆర్టిస్టులకు తెరపై పెద్దగా చోటు దొరకలేదు .. హీరోయిన్ తో సహా.
విజయ సీఈఓ కాకుండా ఆపుతానని అభి తన ఫ్రెండ్స్ అంటాడు. అదెలా సాధ్యం? అందుకోసం అభి ఏం చేస్తాడు? అని అంతా ఆసక్తితో ఎదురుచూస్తుంటే, ఆ వేడిని చప్పున చల్లార్చేసి కథను విజయనగరానికి షిఫ్ట్ చేయడం అసంతృప్తిని కలిగిస్తుంది. అలాగే బేస్ వాయిస్ తో ఎంట్రీ ఇచ్చిన విలన్ ఏం చేస్తాడా అని వెయిట్ చేసిన ప్రేక్షకులకు కూడా నిరాశే మిగులుతుంది. ఇలాంటి చోట కాస్త కసరత్తు చేసుంటే బాగుండేదని అనిపిస్తుంది.
పనితీరు: దర్శకుడు ఈ సినిమా ఫస్టాఫ్ ను పరిగెత్తించాడు. కానీ సెకండాఫ్ లో స్క్రీన్ ప్లే తడబడింది. సెకండాఫ్ లో ప్రేక్షకులు శ్రీలీల పాత్రను మరిచిపోతారు. 'వైరల్' సాంగ్ లో ఆమె మెరవగానే, 'ఇప్పటిదాకా ఈమె ఏమైపోయింది?' అనుకుంటారు. పొరపాటున ఈ పాట సెకండాఫ్ లో పడకపోయుంటే చాలా డ్యామేజ్ జరిగిపోయేదే. ఇక 'జూనియర్' అనే టైటిల్ ఈ సినిమాకి ఏ వైపు నుంచి పెట్టారనేది మనకు అర్థం కాని మరో విషయం.
కిరీటికి ఇది ఫస్టు మూవీయే అయినా, చాలావరకూ లాకొచ్చాడు. డాన్సులు .. ఫైట్ల విషయంలో మంచి మార్కులే కొట్టేశాడు. కాకపోతే ఎక్స్ ప్రెషన్స్ విషయంలోనే ఇంకా పాఠాలు నేర్చుకోవాలి. శ్రీలీల చేసింది చెప్పుకోదగిన పాత్రేమీ కాదు. ఈ సినిమా వలన ఆమె కెరియర్ కి ఒరిగేదేమీ లేదు. ఆడియన్స్ కి ప్రత్యేక ఆకర్షణగా అనిపిస్తుందంతే. జెనీలియా పాత్రను కూడా అంత గొప్పగా ఏమీ డిజైన్ చేయలేదు గానీ .. ఉన్న పాత్రలలో కొంత బెటర్.
దేవిశ్రీ ప్రసాద్ బాణీలు బాగున్నాయి. ప్రతి పాట కూడా యూత్ ను హుషారెత్తించేలా ఉంది. ఇక 'వైరల్' సాంగ్ ప్రభావం మాస్ ఆడియన్స్ పై మరికొంతకాలం ఉండిపోతుంది.సెంథిల్ ఫొటోగ్రఫీ గొప్పగా అనిపిస్తుంది. అలాగే పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ .. రేవంత్ మాస్టర్ కొరియోగ్రఫీ హైలైట్ గా నిలుస్తుంది. 'వీకెండ్స్ కేలండర్లో ఉంటాయి .. కెరియర్లో ఉండవు' .. 'ప్రారంభం కాదు .. ముగింపు గొప్పగా ఉండాలి' వంటి డైలాగ్స్ గుర్తుండిపోతాయి.
ముగింపు: కిరిటీకి ఇది ఫస్టు మూవీయే అయినా, తన ఎనర్జీ లెవెల్స్ తో చాలావరకూ లాక్కొచ్చాడు. ఫస్టాఫ్ లో హుషారుగా నడిచిన కథ, సెకండాఫ్ లో మాత్రం కాస్త తడబడుతుంది. ఫొటోగ్రఫీ .. సంగీతం .. ఫైట్స్ .. కొరియోగ్రఫీ అదనపు బలంగా నిలిచాయనే చెప్పాలి.
'జూనియర్' - మూవీ రివ్యూ!
Junior Review
- కిరీటి హీరోగా రూపొందిన 'జూనియర్'
- డాన్సులు, ఫైట్స్ తో మార్కులు కొట్టేసిన హీరో
- బలహీనపడిన సెకండాఫ్
- ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన వైరల్ సాంగ్
- సందడి చేసిన దేవిశ్రీ సంగీతం
Movie Details
Movie Name: Junior
Release Date: 2025-07-18
Cast: Kireeti, Sreeleela, Genelia, Rao Ramesh, Ravichandran, Achyuth Kumar, Sathya
Director: Radhakrishna Reddy
Music: Devi Sri Prasad
Banner: Varahi Chalana Chitram
Review By: Peddinti
Trailer