'మస్తీస్' గతంలో సిరీస్ గా వచ్చింది. 2020లో సిరీస్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సిరీస్ ను ఇప్పుడు సినిమాగా అందుబాటులోకి తీసుకొచ్చారు. క్రిష్ ఈ సినిమాకి కథను అందించడమే కాకుండా, నిర్మాతగాను వ్యవహరించారు. అలాంటి ఈ సినిమా ఈ రోజునే 'ఆహా'లో స్ట్రీమింగ్ కి వచ్చింది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఈ కథ హైదరాబాదులో జరుగుతుంది. ప్రణవ్ (నవదీప్) ఒక వైపున యాడ్ ఏజెన్సీని నిర్వహిస్తూనే మరో వైపున పబ్ ను నడుపుతుంటాడు. ఆయన భార్య గౌరీ (బిందుమాధవి). ప్రణవ్ అనుభవిస్తున్న ఆస్తిపాసులు ఆమెవే. ప్రణవ్ ను ఆమె సిన్సియర్ గా ప్రేమిస్తూ ఉంటుంది. కానీ ప్రణవ్ అలా కాదు. యాడ్స్ చేయడం కోసం వచ్చిన లేడీస్ తో అతను రొమాన్స్ చేస్తూ ఉంటాడు. అలాగే తన పబ్ లో పనిచేసే లేఖ (చాందినీ చౌదరి)తో ఎఫైర్ సాగిస్తూ ఉంటాడు. 

అదే పబ్ లో పనిచేస్తున్న ఆనంద్ (రాజా చేంబోలు) లేఖను లవ్ చేస్తూ ఉంటాడు. కానీ విలాసవంతమైన జీవితాన్ని కోరుకున్న లేఖ, అతని ప్రేమను తిరస్కరిస్తుంది. ఆ పబ్ లోనే తన టీమ్ తో కలిసి 'బ్యాండ్' నిర్వహిస్తూ ఉంటుంది తానియా (హెబ్బా పటేల్). ఆ టీమ్ లోని దినేశ్ - కార్తీక్ ఇద్దరూ కూడా తానియాను లవ్ చేస్తూ ఉంటారు. ఆమె కోసం గొడవపడుతూ ఉంటారు. తనకి డబ్బు చాలా అవసరం కావడంతో, ఇద్దరికీ ఆమె నచ్చచెబుతూ వస్తుంటుంది.

తమ కంపెనీకి వచ్చిన ఒక యాడ్ ను సిమ్రన్ (అక్షర గౌడ)తో చేస్తాడు ప్రణవ్. అయితే ఆమెకు మరిన్ని అవకాశాలు ఇప్పిస్తానని లోబరచుకుంటాడు. అయితే ఆమెకి ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోతాడు. దాంతో ఇద్దరి మధ్య గొడవజరుగుతుంది. అదే సమయంలో ప్రణవ్ కారణంగా లేఖ గర్భవతి అవుతుంది. ఈ విషయంలో ఆమెతోను అతను గొడవపడతాడు. అప్పుడు వాళ్లిద్దరూ ఏం చేస్తారు? పర్యవసానంగా అతనికి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? తానియా ప్రేమకథ ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: ప్రేమలో అయినా .. పెళ్లిలో అయినా ఒకరిపై ఒకరికి గల నమ్మకమే ప్రధానం. అది లేని జీవితాలు గందరగోళంలో పడతాయని నిరూపించే కథ ఇది. అవసరం .. ఆపద .. వ్యామోహం .. ఈ మూడింటిలో ఏది తీరాలన్నా డబ్బే కావాలి. ఆ డబ్బు కోసమే దారితప్పేవాళ్లు కొంతమంది. తమ దగ్గరున్న డబ్బు చూపిస్తూ దారిలోకి తెచ్చుకునేవారు మరికొందరు. ఈ రెండు రకాల వ్యక్తుల చుట్టూ తిరిగే ఈ కథను క్రిష్ రాసుకున్న తీరు బాగుంది.

ఈ కథలో 80 శాతం ఒక 'పబ్' చుట్టూ తిరుగుతుంది. ప్రధానమైన పాత్రలను 'పబ్'తో ముడిపెట్టి నడిపించిన తీరు బాగుంది. ఆయా పాత్రల స్వరూప స్వభావాలను ఆవిష్కరించడంలో దర్శకుడు చాలావరకూ సక్సెస్ అయ్యాడు. కథ పబ్ లోనే జరుగుతున్నప్పటికీ బోర్ అనిపించదు. అక్కడక్కడే కథ మలుపులు తీసుకుంటూ ఆసక్తిని పెంచుతూ ఉంటుంది. మోడ్రన్ లైఫ్ స్టైల్ అంటూ నైతిక విలువలు వదిలేస్తే, జీవితాలను కూడా కోల్పోవలసి వస్తుందనే సందేశం మనకి ఈ కథలో కనిపిస్తుంది. 

పనితీరు: థ్రిల్లర్ కథలను ఒక ఇంటికే పరిమితం చేసి నడిపించడం వేరు. కానీ ఒక పబ్ చుట్టూ కథను రాసుకుని మెప్పించడం వేరు. అవసరాలు తీరడానికి డబ్బును కోరుకునే తానియా .. విలాసాల కోసం డబ్బును ఆశించే లేఖ .. విలాసవంతమైన జీవితం అందుబాటులో ఉన్నప్పటికీ వ్యక్తిత్వానికి ప్రాధాన్యతనిచ్చే గౌరీ .. పాత్రలను ఆవిష్కరించిన విధానం మెప్పిస్తుంది. క్రిష్ నైపుణ్యం మనకి ఇక్కడ తెలుస్తుంది.

 లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్స్ అన్నీ అక్కడికక్కడే ఆవిష్కరించిన తీరు ఆకట్టుకుంటుంది. ఆర్టిస్టులంతా బాగా చేశారు. అయితే బిందుమాధవి నటనకి ఎక్కువ మార్కులు పడతాయి. అజయ్ భుయాన్ దర్శకత్వం .. మనోజ్ రెడ్డి కెమెరా పనితనం .. స్మరణ్ నేపథ్య సంగీతం .. ధర్మేంద్ర కాకరాల ఎడిటింగ్ ఓకే. 

ముగింపు: ఈ కథ కాస్త నిదానంగా మొదలై ఆ తరువాత గాడిలో పడుతుంది. జీవితాన్ని రంగుటద్దంలో నుంచి చూస్తే అందంగానే కనిపిస్తుంది. కానీ అద్దాలు తొలగించి చూస్తేనే అసలైన జీవితం కనిపిస్తుంది అనే సందేశాన్ని ఇచ్చిన కథ ఇది. బడ్జెట్ పరంగా ఇది చిన్న సినిమానే అయినప్పటికీ, ఆలోచింపజేసే కంటెంట్ ఉంది.