రామ్ గోపాల్ వర్మ ఎంచుకునే కథలు .. ఆయన వాటిని ఆవిష్కరించే పద్ధతి భిన్నంగా ఉంటాయి. దర్శక నిర్మాతగా వర్మ చేసిన ప్రయోగాలు ప్రేక్షకులకు సుపరిచితమే. తన కెరియర్ ఆరంభంలోనే తన అసిస్టెంట్స్ కి అవకాశాలు ఇచ్చిన వర్మ, ఈ సారి మరో శిష్యుడికి దర్శకుడిగా ఛాన్స్ ఇస్తూ నిర్మించిన సినిమానే 'శారీ'. కొత్తగా ఆయన రచనా సహకారాన్ని అందించిన ఈ సినిమా, ఈ నెల 11వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 

కథ: ఆరాధ్య (ఆరాధ్య దేవి) ఓ మిడిల్ క్లాస్ అమ్మాయి. తన ఫ్రెండ్స్ తో కలిసి సరదాగా రీల్స్ చేస్తూ ఉంటుంది. ఆమెకి 'శారీ' అంటే ఇష్టం. అందువలన ఎక్కువగా శారీనే కట్టుకుంటూ ఉంటుంది. తల్లి .. తండ్రి .. అన్నయ్య రాజ్ .. ఇది ఆమె ఫ్యామిలీ. ఒక రోజున ఆమె కిట్టూ (సత్య యాదు) కంట పడుతుంది. అతను ఓ ఫొటోగ్రాఫర్ .. ఫోటోషూట్ లు చేస్తూ ఉంటాడు. ఆరాధ్య చీరకట్టుకి అతను ఆకర్షితుడు అవుతాడు. అప్పటి నుంచి ఆమెను ఫాలో అవుతూ ఆమెను గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటాడు.

 సోషల్ మీడియా ద్వారా ఆరాధ్యతో కిట్టూ పరిచయం పెంచుకుంటాడు. ఫొటో షూట్ అంటూ ఆమెకి మరింత దగ్గరవుతాడు. తన రూమ్ అంతా ఆమె ఫొటో పోస్టర్లే అంటించుకుంటాడు. ఆరాధ్యకు తెలియకుండగా ఆమెను ఫాలో అవుతూ సీక్రెట్ గా కూడా వీడియోస్ తీస్తూ ఉంటాడు. అది గమనించిన ఆమె అన్నయ్య రాజ్, కిట్టూని హెచ్చరిస్తాడు. దాంతో తమ ప్రేమకు రాజ్ అడ్డుగా ఉన్నాడని భావించిన కిట్టూ ఏం చేస్తాడు? అతని కారణంగా ఆరాధ్య ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవలసి వస్తుంది? అనేది కథ.             

విశ్లేషణ: ఒకప్పుడు అమ్మాయిలు బయట కనిపించడమే తక్కువ. కానీ ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని, అమ్మాయిల అలవాట్లు .. అభిరుచులు .. వారి బలాలు .. బలహీనతలు తెలుసుకోవడం చాలా తేలికైపోయింది. ఇప్పుడు ఎవరైనా సరే గడప దాటకుండానే ప్రపంచానికి పరిచయమైపోవచ్చు. మితిమీరిన స్వేచ్చను కల్పిస్తున్న సోషల్ మీడియాలో, పరిమితులు పెట్టుకోకపోతే ప్రమాదంలో పడతామనే సందేశం ఉందంటూ ఆర్జీవీ ఈ సినిమాను పేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. 

'శారీ' అనే టైటిల్ కి ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే రొమాన్స్ ను తెరపై చూపించడంలో వర్మ ఒక ట్రెండ్ సెట్ చేశాడు. అందువలన ఆయన శిష్యుడు కూడా అదే తరహాలో డీల్ చేసి ఉంటాడని అంతా అనుకున్నారు. కానీ అందులో ఎంతమాత్రం వాస్తవం లేదన్నది సినిమా చూసిన తరువాతనే మనకి అర్థమవుతుంది. చీరకట్టుకి ఒక ప్రత్యేకత ఉంది. అందంగా ఉన్నవారు కడితే .. కట్టు కుదిరితే .. అది మరింత అందాన్ని ఇస్తుందని నమ్ముతారు.

ఈ సినిమాలో హీరోయిన్ చీరలోనే కనిపిస్తుంది ... కాకపోతే అది ఆమె వంటిపై నిలవలేదు. శారీ వలన ఆమెకి గానీ, ఆమె వలన శారీకి గాని అందం వచ్చిందా అంటే రాలేదనే చెప్పాలి. ఆమె దారి ఆమెదే .. శారీ దారి శారీదే. ఇక 'శారీ' అనే టైటిల్ పెట్టిన దర్శకుడు, ఆ వైపు నుంచి ఏమైనా హైలైట్ చేశాడా అంటే అదీ లేదు. నిజానికి ఇది ఒక సైకో ప్రేమకథ. అలా అని చెబితే థియేటర్ కి ఎవరూ వెళ్లరని తెలుసు కాబట్టి ఆ సాహసం చేయలేదు.   

పనితీరు: థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను నాలుగు గోడల మధ్యలో బంధించి .. బడ్జెట్ ను తగ్గిస్తూ ఉంటారు. 'శారీ'లో రొమాంటిక్ యాంగిల్ ఎక్కవగా ఉంటుంది గనుక, ఆ ప్రమాదం ఉండకపోవచ్చని అంతా అనుకుంటారు. కానీ ఈ కథ కూడా అటూ ఇటూ తిరిగొచ్చి, అదే నాలుగు గోడల మధ్యలో నక్కుతుంది. ఎక్కువసేపు సైకో ఏకపాత్రాభినయంతో చుక్కలు చూపిస్తుంది.

 ఎలాంటి కొత్తదనం లేకుండా ఆర్టిస్టులను .. టైటిల్స్ ను మార్చుకుని కొన్ని సినిమాలు వస్తుంటాయి. అలాంటి సినిమాల జాబితాలో ఈ సినిమాను కూడా చేర్చుకోవచ్చు. నటీనటుల నటన గురించి చెప్పుకొనేంత కొత్తదనం వాళ్ల పాత్రలలో ఏమీ కనిపించదు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. 

ముగింపు
: శారీ పద్ధతిగా కడితేనే అందంగా ఉంటుంది. లేదంటే కట్టుకున్నవారి కంటే, చూసేవారికి ఎక్కువ చీరకు తెప్పిస్తుంది. 'ఎర'ను చూసి ఆరాటంతో వెళ్లిన చేప గాలానికి చిక్కడం సహజమే. అలాగే 'శారీ'ని చూసి ఆశగా వెళ్లినవారు సైకో చేతికి చిక్కడమూ ఖాయమే.