కొత్త కథలతో కాన్సెప్ట్‌ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలిచే కథానాయకుడు సుహాస్‌ తాజాగా నటించిన చిత్రం 'ఓ భామ అయ్యో రామ'. రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా? ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయా? లేదా సమీక్షలో తెలుసుకుందాం. 

కథ: రామ్‌ (సుహాస్‌) చిన్నతనంలోనే తల్లి (అనిత) కోల్పోవడంతో మేనమామ (అలీ) దగ్గర పెరిగి పెద్దవుతాడు. తండ్రి చేసిన మోసం వల్లే అమ్మ చనిపోయిందనే బాధతో ఉంటాడు రామ్‌. ఓ రోజు అనుకోకుండా తాగిన మత్తులో ఉన్న సత్యభామను (మాళవిక మనోజ్‌) జాగ్రత్తగా వాళ్ల ఇంటికి చేరుస్తాడు రామ్‌. ఆ తరువాత రామ్‌ స్వభావం నచ్చి సత్యభామ అతన్ని ప్రేమిస్తుంది.  ఇక సత్యభామ, రామ్‌ జీవితంలోకి వచ్చాక జరిగిన మార్పులేమిటి? 

అసలు సినిమాలంటే నచ్చని రామ్‌ దర్శకుడు హరీశ్‌ శంకర్‌ దగ్గర అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా ఎందుకు జాయిన్‌ కావాల్సి వస్తుంది. రామ్‌, సత్యభామల లవ్‌స్టోరీ ఎలాంటి మలుపులు తిరిగింది. రామ్‌ తల్లి మరణానికి కారణం ఏమిటి? సత్యభామ తండ్రి ఈ ప్రేమజంట వివాహానికి పచ్చజెండా ఊపాడా? లేదా  తెలియాలంటే సినిమా చూడాల్సిందే.. 

విశ్లేషణ: ఇదొక రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని మలిచాడు. ఈ చిత్రం ట్రైలర్‌ ఆకట్టుకోవడంతో సినిమాలో బలమైన కథ ఉందని అనుకుంటారు. కానీ ట్రైలర్‌ ఆకట్టుకున్నంత విషయం సినిమాలో లేదు. ఫస్టాహాఫ్‌ స్లోగా కొనసాగిన ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ అలరించే విధంగా ఉండటంతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి కలుగుతుంది. అయితే ఇలాంటి ఓ లవ్‌స్టోరీలో దర్శకుడు అతకని ట్విస్టులు జత చేయడంతో కథ గందరగోళంగా అనిపిస్తుంది. 

సెకండాఫ్‌లో ఎమోషన్‌, లవ్‌ సీన్స్‌ ఫ్రెష్‌గా అనిపించినప్పటికీ, స్క్రీన్‌ప్లే పేలవంగా ఉండటంతో నిరాశతప్పదు. రామ్‌ పాత్రను నీరసంగా మొదలుపెట్టి, సత్యభామ పాత్రను మాత్రం ఎంతో ఎనర్జీతో ఎంట్రీ చేశాడు. అయితే సినిమాలోని సన్నివేశాలన్నీ రొటిన్‌గా, ఇంతకు ముందు ఎక్కడో చూశామనే ఫీల్‌ కలగడంతో పెద్దగా ఆ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా అనిపించవు. సెకండాఫ్‌లో వచ్చే లవ్‌సీన్స్‌తో పాటు తల్లి,కొడుకుల మధ్య ఎమోషన్‌ సీన్స్‌ అందరి హృదయాలను హత్తుకునే విధంగా ఉంటాయి. 

అయితే కథకు ముగింపు ఇచ్చే విషయంలో దర్శకుడు అనవసరమైన ట్విస్టులు పెట్టడంతో ఆడియన్స్‌కు సినిమాపై ఇంట్రెస్ట్‌ పోతుంది. రొటిన్‌కు భిన్నంగా సాగే ప్రయత్నమే అయినా పతాక సన్నివేశాలు పెద్దగా ఆకట్టుకోవు. 

పనితీరు: రామ్‌ పాత్రలో సుహాస్‌ కొత్తగా కనిపించాడు. సత్యభామగా హీరోయిన్‌ పాత్రను దర్శకుడు బాగా తీర్చిదిద్డాడు. ఆమె పాత్రలోని చలాకీతనం,ఎనర్జీ చిత్రానికి ఆకర్షణగా నిలిచాయి. మేనమామగా అలీ రొటిన్‌కు భిన్నమైన పాత్రలో నటించాడు. సుహాస్‌ తల్లి పాత్రలో అనిత కనిపించింది. 

అయితే ఆ పాత్రకు ఆమె కరెక్ట్‌ చాయిస్‌గా అనిపించలేదు. హరీశ్‌ శంకర్‌, మారుతి పాత్రలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. రథన్‌ సంగీతం, మణికందన్‌ ఫోటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచాయి. నిర్మాణ విలువలు బాగున్నాయి. 

ముగింపు: వైవిధ్యమైన కథలతో ప్రేక్షకుల ముందుకొచ్చే సుహాస్‌ ఈసారి రొటిన్‌ లవ్‌స్టోరీతో ప్రేక్షకులను మెప్పించాలని చేసిన ప్రయత్నం పూర్తిస్థాయిలో ఫలించలేదు. మాళవిక నటన, తల్లి సెంటిమెంట్‌ సన్నివేశాలు ఈ చిత్రంలో చెప్పుకోదగ్గ ప్లస్‌లు. ఇంతకు మించి ఈ సినిమాలో ఆకట్టుకునే అంశాలేమీ లేవు.