'థగ్ లైఫ్' - మూవీ రివ్యూ!

| Reviews
Thug Life

Thug Life Review

  • యాక్షన్ డ్రామాగా వచ్చిన 'థగ్ లైఫ్'
  • కనిపించని మణిరత్నం మార్క్ 
  • రొటీన్ గా అనిపించే కథ
  • కమల్ నటన .. ఫొటోగ్రఫీ - ఫైట్స్ హైలైట్ 

కమల్ - మణిరత్నం కాంబినేషన్ అనగానే అందరికీ గుర్తుకు వచ్చే సినిమా 'నాయకుడు'. మాఫియా నేపథ్యంలో ఆ తరువాత చాలా సినిమాలు వచ్చినా, 'నాయకుడు'కి గల ప్రత్యేకత మాత్రం చెదిరిపోలేదు. మళ్లీ ఇంతకాలానికి ఈ కాంబినేషన్ కుదిరింది. ఈ సారి కూడా మాఫియా నేపథ్యాన్నే ఎంచుకోవడం విశేషం. అలా 'థగ్ లైఫ్' సినిమా తెరపైకి వచ్చింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. 

కథ: రంగరాయ శక్తిరాజ్ (కమల్) ఢిల్లీలో ఓ గ్యాంగ్ స్టర్. ఆయన అన్నయ్య మాణిక్యం (నాజర్) పత్రోస్  (జోజు జార్జ్)  అన్బు రాజ్ (భగవతి పెరుమాళ్) ఆయన ప్రధానమైన అనుచరులు.ఈ ముఠాకి ప్రధానమైన శత్రువుగా సదానంద్ (మహేశ్ మంజ్రేకర్) ఉంటాడు. ఆయన కారణంగా ఒకసారి శక్తిరాజ్ గ్యాంగ్ చిక్కుల్లో పడుతుంది. అప్పుడు పోలీస్ కాల్పుల్లో ఓ వ్యక్తి చనిపోతాడు. అతని పదేళ్ల కొడుకు అమర్ .. కూతురు చంద్ర, ఆ గొడవలో వేరైపోతారు. 

అమర్ ను అడ్డుపెట్టుకుని ఆ గొడవలో నుంచి బయటపడిన శక్తిరాజ్, అతనికి ఆశ్రయమిస్తాడు. అమర్ చెల్లెలు చంద్రను వెతికి తీసుకొచ్చే బాధ్యత తనదని మాట ఇస్తాడు. శక్తి రాజ్ భార్య లక్ష్మి (అభిరామి) ఆయన కూతురు మంగా (సంజనా కృష్ణమూర్తి) కూడా అమర్ ను తమ కుటుంబ సభ్యుడి మాదిరిగానే చూసుకుంటారు. తనకి వేశ్యా గృహం నుంచి విముక్తిని కలిగించిన శక్తిరాజ్ ను  ఇంద్రాణి (త్రిష) ఆరాధిస్తూ ఉంటుంది. అతను కూడా ఆమె పట్ల ఆకర్షితుడవుతాడు. 

 కాలక్రమంలో శక్తిరాజ్ తరువాత స్థానంలో అమర్ చక్రం తిప్పడం మొదలుపెడతాడు.ఒకానొక సమయంలో శక్తిరాజ్ జైలుకు వెళ్లవలసి వస్తుంది. ఆ సమయంలో ఆయన అన్ని వ్యవహారాలను అమర్ కి అప్పగిస్తాడు. అది మాణిక్యానికి అవమానకరంగా అనిపిస్తుంది. పత్రోస్ కూడా ఈ విషయంలో కాస్త అసహనానికి లోనవుతాడు. శక్తిరాజ్ ను దెబ్బతీసే సమయం కోసం ఎదురుచూస్తున్న సదానంద్, అమర్ ను తనవైపుకు తిప్పుకోవాలనుకుంటాడు. మాణిక్యం - పత్రోస్ కూడా శక్తిరాజ్ పట్ల అమర్ కి గల విశ్వాసంపై దెబ్బకొట్టాలనుకుంటారు. అందుకోసం వాళ్లు ఏం చేస్తారు? ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ.          

విశ్లేషణ
: గతంలో వచ్చిన 'నాయకుడు' సినిమా ప్రభావం కారణంగా, 'థగ్ లైఫ్' సినిమాపై  అంచనాలు ఏర్పడ్డాయి. చాలా కాలం తరువాత కుదిరిన ఈ కాంబినేషన్ ను చూడటానికి ఆడియన్స్ ఆసక్తిని కనబరిచారు. దానికి తోడు ఈ సినిమాలో కూడా బలమైన తారాగణం ఉండటం .. ఏఆర్ రెహ్మాన్ సంగీతం .. ట్రైలర్ ఇవన్నీ కూడా మరింత కుతూహలాన్ని కలిగించాయి. మరి అలాంటి ఈ సినిమా, 'నాయకుడు' సినిమాను తలపించగలిగిందా అంటే లేదనే చెప్పాలి. 

మణిరత్నం సినిమాలలో కథ ఏంటి? కథనం ఎలా ఉంది? పాటలు ఎలా అనిపించాయి? అనే విషయాలపై ఆడియన్స్ పెద్దగా ఫోకస్ పెట్టరు. తెరపై ఆయన ఆవిష్కరించే తనదైన మార్క్ ను చూడటానికి వెళుతూ ఉంటారు. ఆ మార్క్ ను మనసు పెట్టి చూడటానికి వచ్చిన అభిమానులకు ఈ సినిమా సంతృప్తిని ఇవ్వదనే చెప్పాలి. ఆయన మార్క్ మేకింగ్ అక్కడక్కడా మాత్రమే మెరుస్తుంది .. అంతే. 

యాక్షన్ ను .. ఎమోషన్స్ ను కలుపుకుంటూ మణిరత్నం తాను చెప్పదలచుకున్న కథను చాలా నీట్ గా చెప్పారు. అయితే అదంతా కూడా రొటీన్ కి భిన్నంగా లేకపోవడమే ఇబ్బందిపెడుతుంది. అలాగే అమర్ కి చెల్లెలి విషయంలో శక్తిరాజ్ ఇచ్చిన మాటను అప్పుడప్పుడు ఆడియన్స్ కి గుర్తు చేస్తే బాగుండేది. ఇక పాత్రలను డిజైన్ చేసిన విధానం కూడా అంత సంతృప్తికరంగా అనిపించదు. ఆడియన్స్ ను రప్పించడం కోసం అన్నట్టుగా 'త్రిష'ను పెట్టుకున్నారే తప్ప, ఆ పాత్ర వలన ఎలాంటి ప్రయోజనం లేదు. ఆమె ఉద్దేశం ఏమిటనే విషయంలో మనకి ఒక క్లారిటీ కూడా రాదు. 

జోజు జార్జ్ పరిస్థితి మరీ దారుణం. అంత పెద్ద ఆర్టిస్ట్ ను సరిగ్గా ఉపయోగించుకోకపోవడం నిరాశను కలిగిస్తుంది. ఇక శింబు విషయానికి వస్తే ఆ లుక్ ఏమిటో .. ఆ గొడవేంటో అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో కమల్ కి శింబు కొడుకులాంటివాడని కొన్ని పాత్రలు అంటే .. తమ్ముడులాంటి వాడని మరికొన్ని పాత్రలు అంటూ మనలను అయోమయంలోకి నెడతాయి. 

పనితీరు: మణిరత్నం కథ .. స్క్రీన్ ప్లే నిదానంగా సాగుతూ, రొటీన్ గా అనిపిస్తాయి. పాత్రలను మలిచి విధానం కూడా ఆడియన్స్ ను నిరాశపరుస్తుంది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం కూడా అంతగా ప్రభావితం చేయలేకపోయింది. ఇది మణిరత్నం మూవీ .. ఏఆర్ రెహ్మాన్ మూవీ అని మనకి అనిపించదు. రవి. కె చంద్రన్ ఫొటోగ్రఫీ మాత్రం ఆకట్టుకుంటుంది. జైసల్మీర్ .. నేపాల్ లొకేషన్స్ ను .. కార్ల ఛేజింగ్ ను చిత్రీకరించిన తీరు బాగుంది. అక్కడక్కడా ఫైట్స్ కూడా మెప్పిస్తాయి. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ కూడా ఓకే.

ముగింపు: చాలాకాలం తరువాత కమల్ - మణిరత్నం కలిసి వచ్చినప్పటికీ, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయారు. కొత్తదనం కొంచమైనా లేని ఒక రొటీన్ కథనే అప్పగించి వెళ్లారు. కథకి బలమైన విలన్ లేకపోవడం ఒక లోపమనే చెప్పాలి. గుంపులో కొట్లాటలు చూస్తూ కూర్చోవడం కాస్త కష్టమైన పనే!

Movie Name: Thug Life

Release Date: 2025-06-05
Cast: Kamal Haasan,Trisha Krishnan, Silambarasan, Abhirami, Aishwarya Lekshmi,Nassar,Joju George
Director: Mani Ratnam
Music: AR Rehman
Banner: Raaj Kamal Films International

Thug Life Rating: 2.50 out of 5

Trailer

More Reviews